ఐదింట్లో మూడు రాష్ట్రాల్లో హంగేనట..!

ఈ నెల 10వ తేదీ నుంచి ఏడుదశల్లో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో.. ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్‌ లలో హంగ్‌ అసెంబ్లీ కొలువుదీరనుందని ఏబీపీ-సీవోటర్స్‌ ఒపీనియన్‌ పోల్‌ సర్వే స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ రెండోసారి అధికారాన్ని చేపడుతుందని, పంజాబ్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) హవా ఉంటుందని వెల్లడించింది.

యూపీలో 403 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ ఈ సారి కొన్ని సీట్లు కోల్పోయినా.. మ్యాజిక్‌ ఫిగర్‌ను దాటి 225-237 సీట్లు సాధిస్తుందని ఈ సర్వే అంచనా వేసింది. సమాజ్‌వాదీ పార్టీ(ఎస్‌పీ) గతంలో కంటే కొంత మెరుగ్గా 139-151 సీట్లను సాధిస్తుందని, బీఎస్పీకి 13-21 సీట్లే వస్తాయని, కాంగ్రెస్‌ 4-8 స్థానాలకు పరిమితమవుతుందని పేర్కొంది.

పంజాబ్‌లో 117 స్థానాలకు గాను.. ఆప్‌ 55-63 సీట్లలో పాగా వేస్తుందని, కాంగ్రెస్‌ 24-30 సీట్లతో రెండో స్థానంలో నిలుస్తుందని, శిరోమణి అకాలీదళ్‌కు 20-26 సీట్లు, బీజేపీకి 3-11 స్థానాలు దక్కుతాయని ఈ సర్వే వెల్లడించింది.

ఉత్తరాఖండ్‌లో 70 సీట్లకు గాను మేజిక్‌ ఫిగర్‌(36) అవకాశాలు బీజేపీ, కాంగ్రెస్‌కు ఉన్నాయని ఏబీపీ-సీవోటర్స్‌ సర్వే అంచనా వేసింది. బీజేపీకి 31-37 స్థానాలు, కాంగ్రెస్‌కు 30-36, ఆప్‌కు 2-4 సీట్లు వస్తాయని పేర్కొంది.

మణిపూర్‌లో 60 అసెంబ్లీ స్థానాలుండగా.. బీజేపీకి 21-25 సీట్లు, దాని మిత్రపక్షం నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌(ఎన్‌పీఎఫ్‌)కు 6-10 సీట్లు వస్తాయని తెలిపింది. ఇక్కడ కాంగ్రెస్‌కు 17-21, ఇతరులకు 8-12 సీట్లు వస్తాయని వివరించింది.

గోవాలోనూ హంగ్‌ అసెంబ్లీ తప్పదని ఏబీపీ-సీవోటర్స్‌ ఒపీనియన్‌ పోల్‌ సర్వే అంచనా వేసింది. 40 స్థానాలకు గాను బీజేపీ మ్యాజిక్‌ ఫిగర్‌ను సాధించలేదని, ఆ పార్టీకి 14-18 సీట్లు వస్తాయని తెలిపింది. కాంగ్రెస్‌ 10-14 స్థానాల్లో, ఆప్‌ 4-8 సీట్లలో పాగా వేస్తుందని పేర్కొంది.

Show comments