By Election Polling Percentage – ఆసక్తికరంగా ఉప ఎన్నికల పోలింగ్‌.. మొదటి మూడు గంటల్లోనే ఓటెత్తారు

తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న రెండు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల పోలింగ్‌ ఆసక్తికరంగా సాగుతోంది. ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్‌ ప్రారంభమైంది. ఇటు బద్వేల్‌లోనూ, అటు హుజురాబాద్‌లోనూ ఓటు వేసేందుకు ఓటర్లు ఆసక్తి చూపిస్తున్నారు. మొదటి మూడు గంటల్లోనే 15 శాతానికి పైగా పోలింగ్‌ నమోదైంది. 10 గంటల సమయానికి బద్వేల్‌లో 14.90 శాతం, హుజురాబాద్‌లో 15.20 శాతం మేర పోలింగ్‌ నమోదైంది.

బద్వేల్‌లో పోలింగ్‌ ప్రశాంతంగా సాగుతోంది. పలుచోట్ల బీజేపీ ఏజెంట్లుగా టీడీపీ కార్యకర్తలు కూర్చున్నారు. నిన్నటి వరకు పోలింగ్‌ ఏజెంట్లుగా కూర్చోవాలనుకుంటున్న తమ పార్టీ కార్యకర్తలను అధికార పార్టీ వారు బెదిరిస్తున్నారని ఆరోపణలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. పోలింగ్‌ రోజు కూడా అదే ధోరణి కొనసాగిస్తున్నారు. తమ పార్టీ ఏజెంట్లను వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని జిల్లా ఎస్పీ అన్బురాజన్‌కు సోము వీర్రాజు ఫిర్యాదు చేశారు. వైసీపీ నేతలే కాకుండా పోలీసులు కూడా బీజేపీ ఏజెంట్లను బెదిరిస్తున్నారని సోము ఫిర్యాదు చేయడం విశేషం.

హుజురాబాద్‌లో పలు చోట్ల బీజేపీ, టీఆర్‌ఎస్‌ కార్యకర్తల మధ్య వాగ్వాదాలు జరుగుతున్నాయి. టీఆర్‌ఎస్‌ నేతలు ఓటర్లను ప్రభావితం చేస్తున్నారంటూ.. బీజేపీ కార్యకర్తలు వారితో వాదిస్తున్నారు. ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ బలగాలు రంగంలోకి దిగి.. పరిస్థితిని అదుపులోకి తెస్తున్నాయి. వీణవంక మండలంలో టీఆర్‌ఎస్‌ నేత పోలింగ్‌ బూత్‌ల వద్ద ప్రచారం చేస్తుండడంతో.. బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. కౌషిక్‌ రెడ్డిని అడ్డుకున్నారు. బూత్‌ల వద్ద నుంచి వెళ్లిపోవాలని పట్టుబట్టి.. ఆయన వెళ్లే వరకూ వాగ్వాదం చేశారు.

Also Read : Badvel, Huzurabad By Election – తెల్లవారితే ఉప సమరం.. ఈ అంశాలే ఆసక్తికరం

Show comments