వంగవీటి రంగా జిల్లా- బోండా ఉమా వర్సెస్ రాధా

టీడీపీ నేత వంగవీటి రాధ రాజకీయ ప్రయాణంపై ఎన్నో అనుమానాలు. ఆయనకు పార్టీలో ఉండటం ఇష్టం లేకపోయినా కొందరు టీడీపీ నేతలు బలవంతం చేసి పార్టీలో ఉండే విధంగా ఒత్తిడి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మంత్రి కొడాలి నానీ, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తో ఆయనకు మంచి సంబంధాలు ఉండటం, వైసీపీలో రాజకీయ భవిష్యత్తు కోసం ఆ వైపు చూస్తున్నారనే వార్తలు రావడంతో విజయవాడ టీడీపీలో కలకలం రేగింది. అది ఎంత వరకు నిజమో గాని రాధ మాత్రం మీడియాలో పెద్దగా కనపడటం లేదనే చెప్పాలి.

ఈ తరుణంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా సంచలన వ్యాఖ్యలు చేసారు. జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరు పై రాధా ఎటువంటి ప్రయత్నం చేస్తున్నారో నాకు తెలియదని… మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీలతో రాధాకు మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. డిసెంబరు 26న వాళ్లంతా కలిసి కార్యక్రమాలు చేశారు అని ప్రస్తావించారు. నాని, వంశీలు ఉద్యమం చేయనక్కర్లేదు… వాళ్ల నాయకుడికి ఒక్క మాట చెబితే చాలు అని వ్యాఖ్యానించారు. రాధా ఆవైపు ప్రయత్నం చేస్తున్నారేమో నేను చెప్పలేను అన్నారు.

రేపు నేను చేపట్టే దీక్షకు కులాలు, పార్టీ లకు అతీతంగా అందరూ తరలి రావాలి అని విజ్ఞప్తి చేసారు. మీడియా ద్వారా అందరికీ ఇదే నా ఆహ్వానం… రంగా అభిమానులు అందరూ దీక్షలో పాల్గొనాలి అని ఆహ్వానించారు. యన్టీఆర్ బాల్యం గడిచిన తూర్పు కృష్ణాకు ఆయన పేరు పెట్టాలని డిమాండ్ చేసిన ఆయన… విజయవాడ లో పేదల కోసం నిరాహారదీక్ష చేస్తూ రంగా ప్రాణాలు అర్పించారన్నారు. విజయవాడ వైపు వంగవీటి మోహనరంగా జిల్లాగా పేరు పెట్టాలి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఈ డిమాండ్ తో శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు సభలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. వంగవీటి మోహనరంగా విగ్రహం లేని ప్రాంతం లేదని అటువంటి మహానేత పేరు పెట్టకపోతే జగన్ ఆయన్ని అవమానించినట్లే అన్నారు. ప్రభుత్వం ఇటువంటి వారి పేర్లు పెడితే వచ్చిన ఇబ్బంది ఏమిటో చెప్పాలి అని నిలదీశారు. రంగా అనే వ్యక్తి అన్ని వర్గాల వారికి ఆరాధ్య నాయకులు అని రంగా పేరు పేరు పెట్టకపోతే చరిత్ర హీనులవుతారనేది వాస్తవమని హెచ్చరించారు. ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఎటువంటి ఖర్చు కూడా అవ్వదన్నారు. తూర్పు కృష్ణా కు యన్టీఆర్, విజయవాడ కు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాల్సిందే అని డిమాండ్ చేసారు.

Also Read : సీఎంను మరోసారి కలవనున్న చిరంజీవి

Show comments