బెంగాల్ దంగ‌ల్ : పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి అనుకూలం ?

గ‌తంతో పోల్చుకుంటే ఏ ఎన్నిక‌ల్లో అయినా పోలింగ్ శాతం ఎక్కువ‌గా న‌మోదు అయితే అది ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త‌కు సంకేతమ‌ని సాధార‌ణంగా భావిస్తుంటారు. కొన్ని సార్లు ఆ లెక్క త‌ప్ప‌యినా సంద‌ర్భాలూ ఉన్నాయ‌నుకోండి. అయితే, ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌ల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. బెంగాల్ లో 7 ద‌శ‌ల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టికే 4 ద‌శ‌ల పోలింగ్ పూర్త‌యింది. నాలుగు సార్లు కూడా పోలింగ్ శాతం పెరిగిన‌ట్లుగా లెక్క‌లు చెబుతున్నాయి. పైన చెప్పిన స‌మీక‌ర‌ణాల ప్ర‌కారం ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త ఉన్న‌ట్లా.. అలా అయితే స‌ర్వేల‌న్నీ అధికార పార్టీకే జై కొడుతున్నాయి.. కార‌ణాలేంటి? అన్న చ‌ర్చ బెంగాల్‌లో జోరుగా సాగుతోంది.

ఈ ఎన్నిక‌ల్లో గెలిచి బెంగాల్ అధికారం చేజిక్కించుకోవాల‌ని తృణ‌మూల్ కాంగ్రెస్, భార‌తీయ జ‌న‌తా పార్టీ హోరాహోరీగా పోరాడాయి. దాదాపు రెండేళ్ల ముందు నుంచే బీజేపీ అసెంబ్లీ ఎన్నిక‌ల ల‌క్ష్యంగా పావులు క‌దుపుతోంది. ఈ క్రమంలోనే 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా 18 స్థానాలను గెలుచుకుని అధికార పార్టీకి ఝ‌ల‌క్ ఇచ్చింది. దాంతో రెట్టించిన ఉత్సాహంతో బెంగాల్ లో రాజ‌కీయంగా స్పీడ్ పెంచింది. బీజేపీ వేగానికి టీఎంసీ నేత‌లు ఆక‌ర్షితులు కావ‌డం మొద‌లైంది. సుమారు 19 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ సహా పెద్దసంఖ్యలో నేతలు బీజేపీలో చేర‌డంతో ఆ పార్టీలో జోష్ పెరిగింది. టీఎంసీలో రాజ‌కీయ అనిశ్చిత ఆరంభ‌మైంది. అయిన‌ప్ప‌టికీ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ మాత్రం చెక్కుచెద‌ర‌ని ఆత్మ విశ్వాసంతో ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మయ్యారు. వ్యూహాత్మ‌కంగా ప్ర‌చారాన్ని ర‌క్తి క‌ట్టిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే 4 ద‌శ‌ల పోలింగ్ పూర్త‌యింది. పోలింగ్ శాతం భారీగా న‌మోదు అవుతూ ఉంది. తొలి ద‌శ పోలింగ్ లో 84.13 శాతం , రెండో ద‌శ పోలింగ్ లో 86.11 శాతం, మూడో ద‌శ పోలింగ్ లో 84.61 శాతం పోలింగ్ న‌మోదు కాగా నాలుగో ద‌శ‌ల పోలింగ్ లో 79.90 శాతం పోలింగ్ న‌మోదు అయ్యింది. మిగ‌తా ద‌శ‌ల పోలింగ్ కు ప్ర‌స్తుతం ప్ర‌చారం కొన‌సాగుతూ ఉంది.

ప్ర‌చారంలో టీఎంసీ, బీజేపీల మ‌ధ్య‌న మాట‌ల తూటాలు పేలాయి. ఇంకా పేలుతూనే ఉన్నాయి. బెంగాల్ లో అధికారం సాధించుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా బీజేపీ కీల‌క నేత‌లు ప‌ని చేస్తూ ఉన్నారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోడీ, కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా .. దీదీ, దీదీ అంటూనే మ‌మ‌త‌ను ల‌క్ష్యంగా చేసుకుంటూ ఉన్నారు. ఈ క్ర‌మంలో భారీగా పోల‌వుతున్న ఓట్లు ఎలాంటి ఫ‌లితాల‌ను ఇస్తాయ‌నేది ఆస‌క్తిదాయ‌కంగా మారింది. సాధార‌ణంగా అధిక పోలింగ్ శాతం న‌మోదు కావ‌డం అనేది ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌కు నిద‌ర్శ‌న‌మ‌ని చెబుతూ ఉంటారు విశ్లేష‌కులు. ఈ ఇలా చూస్తే ఏకంగా బెంగాల్ లో స‌గ‌టును 82 శాతానికి మించి న‌మోదైంది. మ‌రి ఇదంతా ప‌దేళ్ల మమ‌త పాల‌న మీద వ్య‌తిరేక‌తేనా? అనేది ఆస‌క్తిదాయ‌క‌మైన అంశం అవుతోంది. మ‌మ‌త ఇప్ప‌టికే ప‌దేళ్ల పాటు పాలించేశారు. కాబ‌ట్టి ప్ర‌జ‌లకు ఆమెపై వ్య‌తిరేక‌త వ‌చ్చే అవ‌కాశాలను కొట్టి పారేయ‌లేం. ఇదే స‌మ‌యంలో బీజేపీ అనూహ్యంగా బెంగాల్ లో పుంజుకుంది. ఈ ప‌రిణామ క్ర‌మంలో బెంగాల్ కోట‌పై ఏ పార్టీ జెండా ఎగురుతుందో తెలియాలంటే మే 2 వ‌ర‌కూ ఆగాల్సిందే.

Show comments