Idream media
Idream media
కోవిడ్ కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న రంగాలలో విద్యావ్యవస్థ ఒకటి. విద్యార్థులకు పూడ్చలేని నష్టం కరోనా వల్ల వాటిల్లింది. విద్యాసంస్థలు మూసివేయడం, ఆన్‌లైన్ క్లాసుల వల్ల.. చదువులు పేలవంగా సాగాయి. పరీక్షలు లేకుండానే గడిచిన రెండేళ్లలో విద్యార్థులను పాస్ చేస్తూ పై తరగతులకు పంపాల్సిన పరిస్థితి కరోనా వల్ల ఏర్పడింది. పబ్లిక్ పరీక్షలు నిర్వహించేందుకు ఏపీ సర్కార్ ప్రయత్నాలు చేసినా.. సాధ్యపడలేదు. పరీక్షల వల్ల ఉపయోగాలు, పరీక్షలు లేకుండా పాస్ చేస్తూ వెళితే విద్యార్థి జీవితంలో కలిగే నష్టాలను తెలిసిన సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.. విద్యార్థుల భవిష్యత్ కోసం పరితపించారు. ఇటీవల జగనన్న చేదోడు పథకం రెండో విడత నగదు లబ్ధిదారుల ఖాతాలకు జమ చేసే కార్యక్రమంలోనూ.. విద్యార్థులకు నిర్వహించాల్సిన పరీక్షల గురించి ప్రస్తావించి, ఉద్యమం చేస్తామంటున్న కొన్ని ఉపాధ్యాయ సంఘాలకు వారి బాధ్యతను గుర్తు చేశారు.
మొత్తంగా కరోనా వైరస్ తీవ్రత తగ్గడంతో ఈ ఏడాది పాఠశాలలను ప్రారంభించిన జగన్ సర్కార్.. మూడో వేవ్‌లోనూ కొనసాగించింది. సెలవులు ఇవ్వాలని డిమాండ్లు వచ్చినా.. మూడో వేవ్‌పై అవగాహనతోపాటు సన్నద్ధంగా ఉండడంతో.. ఆ డిమాండ్లను తోసిపుచ్చింది. విద్యార్థుల భవిష్యత్ ముఖ్యమని తేల్చి చెప్పింది. సకాలంలో సిలబస్ పూర్తి చేసింది. పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో గురువారం పది, ఇంటర్ పరీక్షల నిర్వహణకు షెడ్యూల్‌ను విడుదల చేసింది.
ఏప్రిల్ 8వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 28వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. 9,86,833 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయబోతున్నారు. ఇంటర్ పరీక్షలు పూర్తయిన తర్వాత పదో తరగతి పరీక్షలు మొదలు కానున్నాయి. మే 2వ తేదీ నుంచి 13వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. 6,39,888 మంది పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు. కోవిడ్ నిబంధనలతో పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు.
Also Read : శ్రీవారి దర్శనానికి కష్టాలు తొలగనున్నాయ్