Idream media
Idream media
సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో ఆయనో ఉద్యమ నాయకుడు. రాష్ట్ర విభజన అనంతరం తెలుగుదేశంలో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. ఆయనే ఏపీ ఎన్జీఓ మాజీ అధ్యక్షుడు అశోక్ బాబు. ఆయన ఏసీటీఓగా పనిచేసిన సమయంలో డిగ్రీ బీకాం చదవకుండానే సర్వీసు రికార్డుల్లో తప్పుడు సమాచారం ఇచ్చారనే ఆరోపణలపై ఏపీ సీబీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. విద్యార్హతలను తప్పుగా పేర్కొన్నందుకు 477A, 465 (ఫోర్జరీ), 420 (చీటింగ్) సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. వాణిజ్య పన్నుల శాఖలో పనిచేసినప్పుడు బీకాం చదవకపోయినా చదివినట్లు తప్పుడు ధృవపత్రం సమర్పించారని విజయవాడకు చెందిన మెహర్ కుమార్ గతంలో లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు.
ఈ కేసులపై గతంలో అశోక్ బాబు మాట్లాడుతూ.. తనపై సీఐడీ కేసు నమోదు అనేది పాత సబ్జెక్టే అని, అది చిన్న టైపో గ్రాఫిక్ మిస్టేక్ వల్ల పడిందని.. దీన్ని అదునుగా తీసుకుని తనపై ఫిర్యాదు చేశారంటూ అశోక్‌బాబు స్పందించారు. డీ కామ్ అనేది బీ కామ్ అని తప్పుగా పడిందంటూ కొత్త సబ్జెక్టును తెరపైకి తెచ్చారు. తాను ఉద్యోగుల సంఘంలో ఉండగా తన ప్రత్యర్థులు చేసిన ప్రయత్నమే ఇప్పుడు ఈ కేసు అంటూ క్లారిటీ ఇచ్చారు. కాగా, గురువారం రాత్రి అశోక్ బాబును ఆయన ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్నారు. దీనిపై వెంటనే తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేశ్ బాబు ట్విట్టర్ వేదికగా స్పందించేశారు.
తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని అధికారులను ప్రశ్నించారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే అరెస్ట్ చేశారని ఆరోపించారు. లోకేశ్ కూడా అవే ఆరోపణలు చేశారు. అర్ధరాత్రి అక్రమ అరెస్టులంటూ ఖండించారు. తాము అశోక్ బాబుకు అండగా ఉంటామని చెప్పారు. అశోక్ బాబుపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సీఐడీ అధికారులు నిగ్గు తేల్చనున్నారు. పూర్తి స్థాయిలో ఆయన అర్హతా పత్రాలను పరిశీలించే అవకాశం ఉంది.
Also Read : జలీల్ ఖాన్ బి.కాం ,ఈ ఎమ్మెల్సీ “డి.కాం”