iDreamPost
android-app
ios-app

అక్షర ఎలా ఉంది – రిపోర్ట్

  • Published Feb 26, 2021 | 5:22 AM Updated Updated Feb 26, 2021 | 5:22 AM
అక్షర ఎలా ఉంది – రిపోర్ట్

ఇవాళ విడుదలైన ఎనిమిది సినిమాల్లో చెక్ తర్వాత అంతో ఇంతో కాస్త హైప్ తెచ్చుకున్న చిత్రం అక్షర. నందిత శ్వేతా ప్రధాన పాత్రలో బి చిన్ని కృష్ణ దర్శకత్వం వహించిన ఈ మూవీకి గత వారం రోజులుగా గట్టి పబ్లిసిటీ ఇస్తున్నారు. అందులోనూ విద్యా వ్యవస్థకు సంబంధించిన సీరియస్ ఇష్యూ తీసుకున్నారనే క్లారిటీ ట్రైలర్ లో ఇవ్వడంతో దీని మీద ఓ మోస్తరు ఆసక్తి నెలకొంది. సురేష్ బొబ్బిలి సంగీతం అందించగా అహితేజ బెల్లంకొండ, సురేష్ వర్మ సంయుక్తంగా నిర్మించారు. సబ్జెక్టు ఎంత తీవ్రమైనదే అయినా వినోదానికి లోటు లేదన్న తరహాలో ముగ్గురు కమెడియన్లను ముఖ్యమైన పాత్రల్లో పెట్టిన ఈ అక్షర ఎలా ఉందో సింపుల్ రిపోర్ట్ లో చూద్దాం

ఓ పెద్ద కార్పొరేట్ చైన్ విద్యాసంస్థలకు అధిపతి అయిన సంజయ్ భార్గవ్(సంజయ్ స్వరూప్)పిల్లల ర్యాంకుల కోసం ఎంతకైనా తెగించే రకం. ఒత్తిడి భరించలేక స్టూడెంట్స్ ఆత్మహత్యలకు పాల్పడుతున్నా చలించడు. అదే సమయంలో అక్కడ లెక్చరర్ గా చేరుతుంది అక్షర(నందిత శ్వేతా). తన కొలీగ్(శ్రీతేజ)ప్రేమించానని ప్రతిపాదన ఇవ్వగానే అక్షర ఎవరూ ఊహించని ఓ దారుణానికి పాల్పడుతుంది. ఇక అక్కడి నుంచి కథ వేరే మలుపులు తీసుకుంటుంది. అసలు అక్షర అక్కడ ఎందుకు చేరింది, తన వెంట పడిన ముగ్గురు యువకులు(షకలక శంకర్, సత్య, మధునందన్)ఎవరు లాంటి ప్రశ్నలకు సమాధానమే సినిమా.

సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఓ సమస్యను తీసుకున్న దర్శకుడు చిన్ని కృష్ణ ఆలోచన బాగానే ఉంది కానీ దాన్ని ఆచరణలో పెట్టే క్రమంలో తడబడ్డాడు. మాస్ ని మెప్పించాలనో లేక కామెడీ లేకపోతే జనం చూడరన్న అర్థం లేని నమ్మకమో చెప్పలేం కానీ అవసరం లేని కామెడీ, ఒక తీరులో సాగని ఫస్ట్ హాఫ్ సన్నివేశాలు బాగా బోర్ కొట్టిస్తాయి. స్టోరీ లైన్, ఫ్లాష్ బ్యాక్ బాగా రాసుకున్న చిన్నికృష్ణ దాని చుట్టూ అవసరమైన ఎపిసోడ్స్ ని ఆసక్తికరంగా మలుచుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. కీలకమైన ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ లు అంతో ఇంతో కాపాడినప్పటికీ కంటెంట్ పరంగా ఉన్న బలహీనతలు అక్షరను లక్ష్యాన్ని చేరుకోకుండా అడ్డుపడ్డాయి.