చంద్రయాన్‌-3 సక్సెస్‌.. ఇస్రో ఛైర్మన్‌ జీతంపై చర్చ! నెలకెంతంటే?

భారతదేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతమైంది. జులై 14న నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్‌.. వివిధ దశలను దాటుకుంటూ అంతిమంగా చంద్రుడిపై విక్రమ్‌ ల్యాండర్‌ సేఫ్‌ అడుగుపెట్టింది. దీంతో చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతం అయినట్లు.. చంద్రుడిపై కాలుమోపిన నాలుగో దేశంగా, చంద్రుడి దక్షిణ ద్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్‌ అవతరించినట్లు ఇస్రో బుధవారం(ఆగస్టు 23) సాయంత్రం 6.04 నిమిషాలకు ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రశంసల వర్షం కురిసింది.

నిన్నటి నుంచి దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా చంద్రయాన్‌ గురించే చర్చ, సోషల్‌ మీడియాలో సైతం చంద్రయాన్‌ పోస్టులతో నిండిపోయింది. ఈ క్రమంలోనే ఇంత ఘనత సాధించిన ఇస్రో శాస్త్రవేత్తల జీతాలపై ముఖ్యంగా ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ జీతంపై చర్చ జరుగుతోంది. ఎంతో ప్రతిష్టాత్మకమైన స్థానంలో ఉన్న సోమనాథ్‌కు అసలు నెలకు ఎంత జీతం వస్తుందని చాలా మంది గూగుల్‌లో తెగ సెర్చ్‌ చేస్తున్నారు. ఇప్పటికే చంద్రయాన్‌-3 ప్రయోగానికి రూ. 615 కోట్లు ఖర్చు చేశారనే విషయం తెలిసిందే. అయితే.. నిరంతరం ఏదో ఒక ప్రయోగంపై రేయిబవళ్లు శ్రమించే శాస్త్రవేత్తలకు జీతాలు ఏ విధంగా ఉంటాయని అంతా ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌కు అందుతున్న జీతం, ఇతర అలెవెన్స్‌ల గురించి తెలుసుకుందాం..

సోమనాథ్ ఏరో స్పేస్ ఇంజనీర్, సాంకేతికత నిపుణులు. PSLV, GSLV, LVM3 వంటి పలు ప్రయోగాల్లో వాహనాల రూపకల్పనలో ఆయన ఎంతో కృషిచేశారు. ఇస్రోలో ఆయన అనేక హోదాల్లో పనిచేసి.. గతేడాది ఇస్రో ఛైర్మన్‌ అయ్యారు. ఇస్రో చైర్మన్‌గా ఆయన జీతం అక్షరాల 2.5 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. ఇది బేసిక్ పే గా తెలుస్తోంది. ఇతర అలవెన్స్‌లు అన్నీ కలిపి మొత్తం మీద రూ.10 లక్షలు దాటొచ్చు. అయితే ఆయనకు భారీ కట్టుదిట్టమైన భద్రత కూడా ఉంటుంది.ఇస్రో చైర్మన్‌కు బెంగళూరులో విశాలమైన, సకల సౌకర్యాలతో కూడిన ఉన్న అధికారిక నివాసాన్ని ఇస్తారు. అధికారిక, వ్యక్తిగత అవసరాల కోసం డ్రైవర్‌తో కూడిన అధికారిక వాహనం ఉంటుంది.

అవసరమైన సమయాల్లో చార్టర్డ్ ఫ్లైట్ లేదా హెలికాప్టర్లను కూడా ఉపయోగించుకోవచ్చు.ఇస్రో చైర్మన్ ఆయన కుటుంబ సభ్యులు భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో ఏదైనా ప్రభుత్వ లేదా ఎంపానెల్ ఆసుపత్రిలో ఉచిత వైద్య సేవలు పొందవచ్చు. ఇస్రో చైర్మన్ ఐదేళ్లు పూర్తి చేసుకున్న తర్వాత లేదా ఈ లోపు ఆయనకు 65 ఏళ్ల వయసుకు చేరుకుంటే పదవీ విరమణ చేస్తారు. ఆ సమయానికి ఆయన చివరగా డ్రా చేసిన బేసిక్ పే , అలవెన్స్‌లో 50 శాతానికి సమానమైన పెన్షన్ పొందుతారు. ఇలా దేశంలో ఎంతో ఉన్నతమైన పదువుల్లో ఇస్రో ఛైర్మన్‌ పదవి కూడా ఒకటి. అందులో కొనసాగే వ్యక్తికి కూడా అదే స్థాయిలో సకల సౌకర్యాలు, మంచి జీతభత్యాలు ఇవ్వడం సమంజసమే. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Video: చంద్రయాన్‌-3 గ్రాండ్‌ సక్సెస్‌! పాకిస్థాన్‌లో పేలుతున్న జోకులు

Show comments