టాలీవుడ్ స్టార్ హీరోలకు ధీటుగా ఒకప్పుడు మార్కెట్ కలిగిన తలైవా రజనీకాంత్ ఈ మధ్య ఇక్కడ టైం కలిసి రాక వరస పరాజయాలు అందుకుంటూనే ఉన్నాడు. ఆ కారణంగా బిజినెస్ తగ్గినప్పటికీ ఇష్టపడే అభిమానగణం ఎక్కడికి పోలేదు, పోదు. ఈ కారణంగానే రజని సినిమాల డబ్బింగ్ హక్కులకు డిమాండ్ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో దర్శకుడు మురుగదాస్ తో రజని జట్టు కట్టడంతో సహజంగానే అంచనాలు మొదలయ్యాయి. అందుకే దర్బార్ తో అయినా రజని మళ్ళీ ఫామ్ లోకి వస్తాడాని తెలుగు రాష్ట్రాల అభిమానులు ఎదురు చూశారు. తీవ్రమైన సంక్రాంతి పోటీ మధ్య దర్బార్ ఈ రోజు విడుదలైంది. మరి కథా కమామీషూ, ఎంత వరకు ఈ పోలీస్ కథ మెచ్చేలా ఉంది రివ్యూలో చూద్దాం పదండి.
కథ:
ముంబై పోలీస్ కమీషనర్ గా ఉన్న ఆదిత్య అరుణాచలం(రజనీకాంత్) ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. తప్పు చేశాడని తేలితే చాలు దయా దాక్షిణ్యం లేకుండా కాల్చి పారేస్తూ ఉంటాడు. సిటీలో విచ్చలవిడిగా పెరిగిన డ్రగ్స్ దందాను అరికట్టే లక్ష్యంతో ఉన్న అరుణాచలం అందులో భాగంగా మాఫియా డీలర్ గా వ్యవహరిస్తున్న యువకుడు అజయ్ మల్హోత్రా(ప్రతీక్ బబ్బర్)ను చంపేస్తాడు. ఈ పరిణామాల దృష్ట్యా విదేశాల్లో ఉండి ఇదంతా నడిపిస్తున్న హరి చోప్రా(సునీల్ శెట్టి)ఇండియాకు తిరిగి వస్తాడు వస్తాడు. అరుణాచాలంతో పాటు అతని కూతురు వల్లి(నివేతా థామస్)ని టార్గెట్ చేస్తాడు. ఆ సమయంలో ఏం జరిగింది, శత్రువులు ఒకరికొకరు ఎలా తలపడ్డారు, ఇందులో లిల్లీ(నయనతార)ఎవరు లాంటి ప్రశ్నలకు సమాధానం తెరమీద చూడాల్సిందే.
ఎవరెలా చేశారు ?
కొందరికి నటనతో గుర్తింపు వస్తుంది. కొందరికి డాన్సులతో ఇమేజ్ ఏర్పడుతుంది. ఇంకొందరికి మల్టీ టాలెంట్స్ బ్రాండ్ ని తెచ్చిపెడతాయి. కానీ వీటన్నింటి కంటే కేవలం స్టైల్ తో ప్రపంచవ్యాప్తంగా అశేష అభిమానులను సొంతం చేసుకోవడం భారతదేశంలో ఒక్క రజనికే చెల్లు అంటే అతిశయోక్తి కాదు. వయోభారం ఎంత మీద పడుతున్నా ఇప్పటికీ అదే దేహాన్ని కాపాడుకుంటూ తనకు మాత్రమే సాధ్యమయ్యే స్టైల్ ని చూపించే రజనికాంత్ ఇందులో కూడా అదే కొనసాగించాడు.
మూడు దశాబ్దాల తర్వాత రజనిని ఇలా ఫక్తు పోలీస్ డ్రెస్ లో చూడటం ఫ్రెష్ గా అనిపిస్తుంది. అందులోనూ తన మ్యానరిజంతో చెడుగుడు ఆడేయడంతో అభిమానులకు కనులపండుగే. తనవరకు ఏ లోటు రాకుండా రజని మరోసారి బెస్ట్ ఇచ్చేశాడు. డాన్స్ విషయంలో తనకున్న బలహీనతను అధిగమిస్తూ గ్రేస్ తో ఆదిత్య అరుణాచలం పాత్రను పండించాడు. మెట్రో స్టేషన్ ఫైట్ లో, జిమ్ ప్రాక్టీసు ఎపిసోడ్ లో ఓ రేంజ్ కిక్ ఇచ్చాడు.
హీరొయిన్ నయనతారది చెప్పుకోదగిన పాత్ర అయితే కాదు. రజనితో గతంలోనే చంద్రముఖి చేసింది కాబట్టి జోడిగా సరితూగింది. ఏదో మొక్కుబడిగా ఉండాలంటే ఉంది అంతే. సెకండ్ హాఫ్ కొంత భాగం అయ్యాక మళ్లి తను కనిపిస్తే ఒట్టు. ఉన్నంతలో నివేదా థామస్ రజని కూతురిగా ఆకట్టుకుంది. రజనితో కూతురిగా తన బాండింగ్ ఉన్న సన్నివేశాలు బాగా కుదిరాయి.
ఇక విలన్ సునీల్ శెట్టి విషయానికి వస్తే మరీ ప్రత్యేకంగా లేడు కాని పాత్రకు తగ్గట్టు గాంభీర్యాన్ని ప్రదర్శించాడు. చాలా పవర్ ఫుల్ గా ఎస్టాబ్లిష్ చేసినప్పటికీ నటనలో ఎందుకనో అంత ఇంటెన్సిటీ చూపించలేకపోయాడు. అందులోనూ ఎక్కువ స్పాన్ లేకపోవడంతో పెర్ఫామ్ చేసే స్కోప్ తగ్గిపోయింది. యోగి బాబు కొంత నవ్వించాడు. మిగిలినవారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమి లేదు.
దర్శకుడి సంగతేంటి
మురుగదాస్ కు దక్షిణాదిలో ప్రత్యేకమైన గుర్తింపు రావడానికి కారణం అతను ఎంచుకునే కథలు, వాటికి కమర్షియల్ విలువలు జోడించి రాసుకునే ట్రీట్మెంట్. ఆ విలక్షణతే ఇతనికి శంకర్ తర్వాత ఆ స్థాయిలో ఫాలోయర్స్ వచ్చేలా చేసింది. గజనితో మొదలుపెట్టి సర్కార్ దాకా ఏదో ఒక నవ్యత, విభిన్నమైన పాయింట్ దాస్ సినిమాల్లో ఉంటుంది. అతని కథకు తగ్గట్టు ఆయా పాత్రల్లో హీరోలు పరకాయప్రవేశం చేస్తారు. కాని ఈ సినిమా విషయంలో రజని ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని దానికి సరిపోయే కథనే రాసుకోవడంతో దర్బార్ కు ఎలాంటి ప్రత్యేకత లేకుండా చేసింది. గతంలో చిరంజీవి స్టాలిన్ ని డీల్ చేయడంలో దాస్ పడిన తడబాటు దర్బార్ లో మరోసారి రిపీట్ అయినట్టు అనిపించినా మసాలాలు సరైన రీతిలో సమకూర్చుకోవడంతో మరీ అంత విసిగించే కోవలోకి రాదు.
తమకంటూ ఒక ప్రత్యేకమైన బాణీ ఏర్పరచుకున్న దర్శకులు స్టార్ హీరోలతో డీల్ చేసినప్పుడు మాస్ ఇమేజ్ అనే చట్రం అడ్డుగా నిలుస్తుంది. దానికి లోబడి కథా కథనాలు నడిపించాలనే ప్రయత్నం అన్నిసార్లు ఒకే ఫలితాన్ని ఇవ్వదు. మురుగదాస్ ఒకవేళ రెగ్యులర్ ఫార్ములా దర్శకుడైతే ఇలా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. కాని తను వేరు. గజినీ చూసి అమీర్ ఖాన్ అంతటి వాడే పిలిచి మరీ రీమేక్ ఛాన్స్ ఇచ్చాడంటే కారణం అదే.
ఆలోచింపజెసే సోషల్ మెసేజ్ తో పాటు అన్ని కమర్షియల్ సూత్రాలను పాటించే స్కూల్ మురుగదాస్ ది. ఇది కొంతమేర దర్బార్ లోనూ ఉంది. కాని దాస్ లోని ట్రూ ఫిలిం మేకర్ రజని మాస్ హిస్టీరియాకు లొంగిపోవడంతో దర్బార్ ఒక స్టార్ హీరో సగటు యాక్షన్ డ్రామాగా మిగిలిపోయింది. మెట్రో స్టేషన్ ఫైట్ లాంటి ఎపిసోడ్స్ అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చినా ఓవర్ ది హీరోయిజం వయసు మళ్ళిన హీరోలు చేస్తే ఇప్పటి జెనరేషన్ ఎంతవరకు మెచ్చుతారు అనేది కొంత అనుమానమే. తన మార్కు అక్కడక్కడా చూపించినా దాస్ దాన్ని సినిమా ఆసాంతం క్యారీ చేయలేకపోయాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ ఎమోషన్ ని చూపించాలన్న ప్రయత్నంలో రజని-నివేదా మధ్య ట్రాక్ ని ఎక్కువ రాసుకోవడంతో కథ ముందుకు వెళ్తున్న ఫీలింగ్ కలగదు.
దర్బార్ లో ఖచ్చితంగా మురుగదాస్ స్థాయి దర్శకుడు లేడు. పేట విషయంలో కార్తీక్ సుబ్బరాజ్ లొంగిపోయినట్టే మురుగదాస్ కూడా రజినిఫై అయిపోయి కథలోని బేసిక్ లాజిక్స్ ని సైతం పట్టించుకోలేదు. ఓ నగర కమీషనర్ అంటే ఏకంగా ప్రధాని లెవెల్ లో పవర్స్ ఉంటాయనే టైపులో చూపించడం ఫ్యాన్స్ కోసమే అయినా సామాన్య ప్రేక్షకులకు ఎన్నో సందేహాలు తీరకుండానే అలా వచ్చి వెళ్తూ ఉంటాయి. హీరో విలన్ నేరుగా క్లైమాక్స్ లోనే తలపడటం కూడా కొంత మేర దెబ్బతీసింది. ఈ ఇద్దరూ ఎక్కడ కలుస్తారు అని ఎదురు చూసే లోపే ఎండ్ కార్డ్స్ కు దగ్గరగా ఉంటాం. మొత్తానికి ఓ అభిమాని కోణంలో చూస్తే దర్బార్ మెప్పించినా సగటు ఆడియన్స్ కి మాత్రం స్టైల్ అద్భుతంగా కుదిరిన ఓ మాములు పోలీస్ ఆఫీసర్ కథే అనిపిస్తుంది
టెక్నీకల్ టీమ్ పనితనం
దర్బార్ సినిమాగా ఏ స్థాయిలో మెప్పించింది అనేది పక్కన పెడితే సాంకేతికంగా ఉన్నతమైన నిపుణులు పనిచేయడంతో అవుట్ ఫుట్ చాలా రిచ్ గా వచ్చింది. ముఖ్యంగా సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ తన అనుభవాన్నంతా ఉపయోగించి విజువల్స్ ని అద్భుతంగా చూపించాడు. స్టైల్ కాప్ గా రజని వయసు బాగా తగ్గినట్టు కనిపించడంలో ఈయన పాత్ర చాలా ఉంది.
సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఇందులో మరోసారి పేట రేంజ్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మెప్పించాడు. కాని పాటలు అంతంత మాత్రంగానే అనిపిస్తాయి. చిత్రీకరణ వల్ల భరించగలం కానీ విడిగా ఎంజాయ్ చేసే ఆడియో అయితే దర్బార్ ఖచ్చితంగా కాదు. ఎప్పుడో ముప్పై ఏళ్ళ క్రితం నాటి అన్నామలై స్కోర్ ని ఇంకా వాడుతున్నారంటే ఖచ్చితంగా దాని క్రియేటర్ దేవాను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిందే
శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ చాలా చోట్ల మొహమాటపడటంతో లెన్త్ పెరిగిపోయింది. ఈజీగా ఓ ఇరవై నిముషాలు ట్రిమ్ చేస్తే వేగం పెరిగి బోర్ తగ్గే అవకాశం ఉండేది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ల్యాగ్ ఫీలయ్యే సీన్స్ చాలా ఉన్నాయి. ఎంత రజని సినిమా అయినా సన్నివేశాల్లో బలం లేనప్పుడు అలాంటి వాటికి కోత వేయడం బెటర్. రామ్ లక్ష్మణ్ పోరాటాలు బాగున్నాయి. రజని స్టైల్ ని మిక్స్ చేస్తూ బాగా డిజైన్ చేశారు. ఫ్యాన్స్ కు కనెక్ట్ అయ్యేవి వీళ్ళ ఫైట్సే. లైకా సంస్థ ఎప్పటిలాగే ప్రొడక్షన్ లో రాజీ పడలేదు. కథ మరీ 2.0 రేంజ్ లో డిమాండ్ చేసే బడ్జెట్ కాకపోవడంతో అవసరమైనంత మేర ఖర్చు చేసి భారీతనం తీసుకొచ్చారు.
ప్లస్ గా ఫీలయ్యేవి
రజని స్క్రీన్ ప్రెజెన్స్, ఎనర్జీ
యాక్షన్ ఎపిసోడ్స్
మెట్రో స్టేషన్ ఫైట్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
మైనస్ గా అనిపించేవి
సెకండ్ హాఫ్ సాగతీత
క్లైమాక్స్
పాటలు
రజని నయన్ లవ్ ట్రాక్
చివరి మాట
రజని సినిమా నుంచి సగటు అభిమాని ఏం ఆశిస్తాడో అది సంపూర్ణంగా దర్బార్ లో ఉంది. కాని అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేందుకు అదొక్కటే సరిపోదు. నరసింహ, బాషా, అరుణాచలంలు బ్లాక్ బస్టర్స్ అవ్వడంలో బలమైన కథ, హత్తుకుపోయే ఎమోషన్స్ పుష్కలంగా ఉండటం కారణమయ్యింది. వాటిని ఆయా దర్శకులు అద్భుతంగా బాలన్స్ చేస్తూ ఆ సినిమాలను ఎవర్ గ్రీన్ క్యాటగిరీలో వేయించారు. కాని ఈ మధ్య వస్తున్న రజనికాంత్ సినిమాలు ఆ స్థాయిలో లేవన్నది నిజం. దర్బార్ ని ఇదే స్థాయిలో తీద్దామని మురుగదాస్ చేసిన ప్రయత్నం నిరాశపరచదు కాని పూర్తి స్థాయిని సంతృప్తిని మాత్రం ఇవ్వదు. మొదలుపెట్టడం దగ్గరి నుంచి కొంత భాగం వరకు ఓ మోస్తరుగా మెప్పించినా మెల్లగా మురుగదాస్ లోని దర్శకుడు పక్కకు వెళ్ళిపోయి సగటు రజని అడ్మైరర్ లా తీయడంలో దర్బార్ జస్ట్ ఓకే మూవీ ఫీలింగ్ తెప్పిస్తుంది.
ఒక్క లైన్ లో చెప్పాలంటే
దర్బార్ – స్టైల్ అదిరింది, కథ తగ్గింది