iDreamPost
android-app
ios-app

క్యాన్సర్ ముప్పులో ప్రపంచం..

క్యాన్సర్ ముప్పులో ప్రపంచం..

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఆరోగ్య సమస్యల్లో క్యాన్సర్ ఒకటి. క్యాన్సర్ మనిషి శరీరంలో ఏ భాగంలో అయినా రావొచ్చు.. దీన్ని అతి ఖరీదైన వ్యాధిగా కొందరు అభివర్ణిస్తారు. క్యాన్సర్ 5-10% మందికి వారసత్వంగా వచ్చిన జన్యుపరమైన లోపాల వల్ల వచ్చే అవకాశం ఉండగా 90-95% మందికి ధూమపానం, మద్యపానం,పొగాకు నమలడం,ఊబకాయం,పర్యావరణ కాలుష్యం,రేడియేషన్ కి గురి కావడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.

క్యాన్సర్ ఎలా వస్తుంది?

మానవ శరీరం కొన్ని వేల కోట్ల కణాలతో నిర్మించబడి ఉంటుందన్న విషయం తెలిసిందే. ప్రతీ రోజు కొన్ని కోట్ల కణాలు మానవ శరీరంలో మరణిస్తూ ఉంటాయి. వాటి స్థానంలో కొత్త కణాలు కణ విభజన ద్వారా ఏర్పడుతూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో కణాల పెరుగుదలలో నియంత్రణ లేనందువల్ల కణాలు చాలా వేగంగా అస్తవ్యస్తంగా విభజన చెందుతాయి. అలా అస్తవ్యస్తంగా విభజన చెందుతున్న కణాలను అబ్నార్మల్ సెల్స్ లేదా క్యాన్సర్ సెల్స్ అని పిలుస్తారు. ఈ కణాలు కణ సమూహాలను ఏర్పరచి మంచిగా ఉన్న ఇతర కణాలకు కూడా వ్యాపించి వాటిని కూడా క్యాన్సర్ కణాలుగా మారుస్తాయి. ఈ కణ సమూహాలను ట్యూమర్ అని పిలుస్తారు.

క్యాన్సర్ మానవ శరీరంలో ఏ భాగంలో అయినా వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత జీవన శైలి కారణంగా మానవులు ఊపిరితిత్తుల క్యాన్సర్,నోటి క్యాన్సర్,లివర్ క్యాన్సర్,పెద్ద పేగు క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్,ప్రోస్టేట్ క్యాన్సర్,బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్,అండాశయ క్యాన్సర్ ల బారిన పడుతున్నారు..

లక్షణాలు:-

అసాధారణంగా తగ్గే బరువు, శరీరంలో ఏర్పడిన పుండు మానక పోవడం,రక్త స్రావం ఏర్పడటం, దగ్గు తగ్గక పోవడం, మలవిసర్జన చేసే సమయంలో రక్తం పడటం, కడుపులో మంటగా ఉండటం,అజీర్తిగా అనిపించడం,శరీరంలో ట్యూమర్ పెరుగుతూ ఉండటం లాంటి లక్షణాలు ఉంటే క్యాన్సర్ పెరుగుతున్నట్లు గుర్తించి పరీక్షలు చేయించుకోవాలి. పైన చెప్పిన లక్షణాలకు కారణం క్యాన్సర్ మాత్రమే కారణం కాదని గుర్తించడం మంచిది. వేరే కారణాల వల్ల కూడా పై లక్షణాలు మానవ శరీరంలో ఏర్పడే అవకాశం ఉంది..

శరీరంలో ఏర్పడే అన్ని ట్యూమర్లు ప్రమాదకరమైనవి కావు.. ప్రమాద స్థితిని బట్టి ట్యూమర్లను రెండు రకాలుగా విభజించారు.

1. బినైన్ ట్యూమర్లు : ఈ రకమైన ట్యూమర్లు శరీరంలో ఏదొక చోట అసాధారణ కణ విభజన కారణంగా ఏర్పడతాయి. ఇవి నెమ్మదిగా పెరుగుతూ ఉంటాయి. వీటి వల్ల ఎలాంటి హాని ఉండదు. ఆపరేషన్ చేసి ఈ ట్యూమర్లను తొలగించవచ్చు..

2. మాలిగ్నెంట్ ట్యూమర్లు:- శరీరంలో ఏదొక ప్రాంతంలో ఏర్పడిన క్యాన్సర్ కణాలు అక్కడినుండి రక్తం లేదా లింఫ్ స్రావాల ద్వారా మరొక ప్రాంతంలోకి ప్రయాణించి వేరొక ప్రాంతంలో కూడా ద్వితీయ ట్యూమర్లను ఏర్పరుస్తాయి. ఈ తరహా క్యాన్సర్లు చాలా ప్రమాదకరమైనవి.

ప్రపంచంలో క్యాన్సర్ రావడానికి Random genetic mutation ప్రధాన కారణం. కణం తన డిఎన్ఏని కాపీ చేసి నూతన కణంగా విభజన చెందేటప్పుడు డిఎన్ఏని కాపీ చేయడంలో వచ్చే లోపాల కారణంగా క్యాన్సర్ అధికంగా వస్తుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. జన్యువుల్లో సంభవించే మార్పుల వల్ల, కాలుష్యంతో కూడిన వాతావరణం, మనిషి జీవన విధానం మరియు వారసత్వం కారణంగా మానవులలో క్యాన్సర్ వస్తుంది.

మానవ శరీరంలో క్యాన్సర్ వ్యాప్తిని స్టేజుల్లో సూచిస్తారు. అంటే క్యాన్సర్ కణాలు తయారైన మొదట్లోనే గుర్తిస్తే స్టేజ్ 1 గా అవి పెరిగిన స్థాయిని బట్టి స్టేజ్ 2,స్టేజ్ 3, స్టేజ్ 4 గా గుర్తిస్తారు. స్టేజ్ 4 లో ఉన్న క్యాన్సర్ చాలా ప్రమాదకరమైన స్థాయిలో ఉందని అర్థం చేసుకోవచ్చు. స్టేజ్ 4 లో ఉన్న క్యాన్సర్ పేషెంట్లను కాపాడటం దాదాపు అసాధ్యం.

చికిత్స..

క్యాన్సర్ సోకిందని తెలియగానే మానసికంగా కృంగిపోవాల్సిన అవసరం లేదు. గతంలో క్యాన్సర్ కు సరైన చికిత్స అందుబాటులో ఉండేది కాదు. గతంతో పోలిస్తే ప్రస్తుతం అత్యంత అధునాతన క్యాన్సర్ చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో సర్జరీ ద్వారా క్యాన్సర్ కంతులను తొలగించడం,కీమో థెరపీ, ఇమ్యునో థెరపీ, రేడియేషన్ థెరపీ,హార్మోన్ థెరపీ,స్టెమ్ సెల్స్ ట్రాన్స్ ప్లాంట్ లాంటి అధునాతన చికిత్సల ద్వారా క్యాన్సర్ ను మానవ శరీరం నుండి రూపుమాపొచ్చు.

2020 వ సంవత్సరంలో భారతదేశంలో 679,421 మంది పురుషులు 712,758 స్త్రీలు క్యాన్సర్ బారిన పడ్డారు. ప్రతీ 9 మంది భారతీయుల్లో ఒకరికి క్యాన్సర్ సోకుతున్నట్లుగా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ప్రతీ 29 మంది స్త్రీలలో ఒకరు రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతుండగా, ప్రతీ 68 మంది పురుషుల్లో ఒకరికి ఊపిరితిత్తుల క్యాన్సర్ సోకుతుంది.

ముగింపు

వారసత్వంగా వచ్చే క్యాన్సర్ కేసులను పక్కన బెడితే మారుతున్న జీవన శైలి, కాలుష్య పూరిత వాతావరణం, ఊబకాయం,ధూమపానం,మద్యపానం, పొగాకు నమలడం,రేడియేషన్ కి గురి కావడం లాంటి కారణాల వల్ల క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. క్యాన్సర్ సోకగానే మరణం సంభవించినట్లు కాదని అర్థం చేసుకుని క్యాన్సర్ కు అధునాతన చికిత్సలు అందుబాటులో వచ్చాయని గుర్తించాలి. క్యాన్సర్ సోకినట్లు ఎంత ముందుగా గుర్తిస్తే అందుకు తగిన చికిత్స తీసుకుని ప్రాణాలను దక్కించుకునే అవకాశం ఉంటుంది.

వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా…