అమెరికా నుంచి ఓ విమానం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి చేరింది. సాధారణ పరిస్థితుల్లో ఇది పెద్ద ప్రత్యేక విషయం కాదు. కానీ కరోనా మహమ్మారి నేపథ్యంలో ఓ అంతర్జాతీయ విమానం హైదరాబాద్ చేరడం ఆసక్తికరమే. ఖతార్ ఎయిర్ వేస్ నడుపుతున్న ప్రైవేట్ చార్టర్ 250 మందితో జూన్ 26న హైదరాబాద్ చేరింది. అమెరికాలోని చికాగో, న్యూయార్క్, డల్లాస్ సహా పలు నగరాలకు చెందిన భారతీయులను స్వదేశానికి చేర్చింది. అయితే ఇది ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో అయితే పెద్దగా చర్చనీయాంశం కాకపోయేది. కానీ అమెరికాలో చిక్కుకుపోయిన భారతీయులను సొంత దేశానికి చేర్చడానికి ఓ సాధారణ వ్యక్తి చేసిన ప్రయత్నం మూలంగా ఇంత పెద్ద సంఖ్యలో భారతీయులు సొంత గడ్డ మీద అడుగుపెట్టగలిగారు. సమస్యను గుర్తించి, దానికి తగిన పరిష్కారమార్గం చూసుకుని, అనేక మంది సహకారంతో ఇంత పెద్ద సంఖ్యలో అమెరికా నుంచి ఇండియాకు అనేక మందిని చేర్చిన వ్యక్తి ని పలువరు అభినందిస్తున్నారు.
ఇంత మంది భారతీయులను స్వదేశానికి తీసుకురావడం సాధారణ పరిస్థితుల్లో అయితే పెద్ద విశేషం కాదు. అయినప్పటికీ దానికి చాలా పెద్ద ప్రక్రియ ఉంటుంది. ఇరు దేశాల్లోనూ చట్టపరమైన, అధికారయుత అనుమతులు అనేక అవసరం. అందుకే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలంటే కేవలం సంకల్పం ఉంటే సరిపోదు. దానికి అనుగుణమైన అనేక అంశాలను పూర్తి చేసే సామర్ధ్యం కూడా ఉండాలి. విపత్తుల సమయంలో మరింత క్లిష్టమైన ఇలాంటి వాటిని పూర్తి చేయడం ద్వారా అసాధారణ ప్రక్రియను పూర్తి చేయడం వాషింగ్టన్ డీసీ నివాసి రవి పులి ద్వారా సాధ్యం అయ్యింది. పథమ్ పేరుతో చిన్నపిల్లలకు విద్యా సదుపాయాలు కల్పించే సంస్థకు సారధిగా, ఇంక్ వంటి మ్యాగజైన్స్ కూడా పలుమార్లు గుర్తించిన విజయవంతమైన వ్యాపారవేత్తగా ఉన్న రవి పులి భారతీయుల కోసం చేసిన ప్రయత్నం ఫలించడం చాలామందికి ఊరటనిచ్చింది. గతంలొ హైదరాబాద్ లో పర్యటించిన ఇవాంక ట్రంప్ నేతృత్వంలోని ప్రతినిధి బృందంలో సభ్యుడిగా రవి పులికి అనుభవం ఉంది. ఈ మిషన్ విజయవంతం కావడం తనకు అన్నింటికన్నా ఆనందాన్నిచ్చిందని ఓ రైతు కుటుంబంలో జన్మించి నాస్ డాక్ లో కూడా గుర్తింపు పొందే స్థాయికి ఎదిగిన రవి పులి అంటున్నారు. 23 ఏళ్ల క్రితం అమెరికాలో అడుగుపెట్టి ఆయన అంచెలంచెలుగా అభివృద్ధి కావడమే కాకుండా ఇలాంటి క్లిష్ట సమయాల్లో అనేకమందికి ఆసరగా నిలవడం అభినందనీయంగా మారింది.
అమెరికాలో వీసా హోదా కోల్పోయిన తర్వాత అక్కడ జీవనం చట్టవిరుద్ధం అవుతుంది. అంతేగాకుండా సీనియర్ సిటిజన్లు, ఆరోగ్య భీమాలేని గర్భిణీలు, వృద్ధ తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు స్వదేశానికి చేరాల్సిన అవసరం ఉంది. కానీ వారు సొంత గడ్డ మీద అడుగుపెట్టేందుకు అవసరమైన ఆర్థిక సహకారం వారికి చాలా అవసరం. తనను పలువురు బాధితులు సహకరించిన తర్వాత వారికి అండగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు రవి తెలిపారు. చివరకు సొంత కుటుంబీకుల అంత్యక్రియలకు కూడా హాజరుకాలేని స్థితిలో చిక్కుకున్న వారికి తోడ్పాటు అందించాలని వారంతా కోరినట్టు ఆయన అన్నారు. హెచ్ 1 వీసా గడువు పూర్తయిన వెంటనే వారు అమెరికాను వీడి వెళ్లాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో పలు సమస్యలు ఎదుర్కొంటారనే అవగాహన ఉన్న రవి పులి వారికి అవసరమైన సహాయం అందించాలనే నిర్ణయానికి వచ్చారు. అందుకు అనుగుణంగా “యుఎస్ ఇండియా సాలిడారిటీ మిషన్” ను ఏర్పాటు చేశారు. దానికోసం దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన ఆయన మిత్రబృందంలోని 30 మంది తోడ్పాటు అందించారు. వారంతా కలిసి 21 రోజుల పాటు అవిశ్రాంతంగా చేసిన ప్రయత్నాలతో చివరకు భారత ప్రభుత్వంతో పాటు ఖతార్ ప్రభుత్వం సహా అన్ని అనుమతులు పొందారు. ఖతార్ కి సంబందించిన రాయబార కార్యాలయాల్లో అనుమతుల కోసం రవి పులి రోజుల తరబడి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. చివరకు సౌకర్యవంతంగా ప్రయాణం చేసేందుకు బాధితులకు అవకాశం దక్కింది.
సామాజిక దూరం పాటిస్తూ విమానంలో జాగ్రత్తలు తీసుకున్నారు. అదే సమయంలో వృద్ధులు, గర్బిణీల విషయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బిజినెస్ క్లాస్ స్థాయిలో వారికి సదుపాయాలు కల్పించారు.
అమెరికాలో చిక్కుకున్న హైదరాబాదీ న్యాయవాదులు
హైదరాబాద్‌కు చెందిన దంపతులు రాజ్ సురేఖా ఇద్దరూ హైకోర్టులో న్యాయవాదులు. వారు అమెరికా పర్యటనకు వచ్చి, మార్చిలో భారతదేశానికి తిరిగి రావాల్సి ఉంది. కానీ అనూహ్యంగా లాక్డౌన్ ప్రకటించడంతో వారు అక్కడే చిక్కుకుపోయారు. దాంతో వారు శతవిధాలా ప్రయత్నం చేసినా స్వదేశానికి రాలేక తీవ్రంగా సతమతం అవుతున్న సమయంలో రవి పులి , అతని సంస్థను సంప్రదించారు. చివరకు వారికి మోక్షం కలగడంతో వారు సంతోషంగా స్వదేశానికి చేరేందుకు మార్గం సుగమం అయ్యింది. అదే విధంగతా న్యూయార్క్ నుంచి వచ్చిన నిహారిక అనే విద్యార్థి కూడా సంతోషంగా ఉందని తెలిపింది. యుఎస్ఐఎస్ఎమ్ బృందం చేసిన సహకారానికి రుణపడి ఉంటామని పేర్కొంది. కేరళకు చెందిన ప్రొఫెషనల్ జెర్రీ తో పాటుగా అతని కుటుంబం కూడా అమెరికాలో చిక్కుకుని, చివరకు రవి పులి కృషితో సొంతగడ్డ మీద అడుగుపెట్టేందుకు అవకాశం దక్కినందుకు ఆనందం వ్యక్తం చేసింది. మెక్సికోలో చిక్కుకున్న మరో కుటుంబం మరింత క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. బంధువులు చనిపోయనా కడ చూపు కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. విమానం కోసం వారు చికాగోకి ళ్లవలసి ఉండగా, వారు ఫ్లైట్ మిస్ అయ్యారు. దాంతో ఖతార్ ఎయిర్‌వేస్ విమానంలో వారు భారత్‌కు తీసుకెళ్లడానికి యుఎస్‌ఐఎస్ఎం బృందం వారిని డల్లాస్‌కు చేర్చింది. దాంతో ఈ విమాన ఏర్పాట్లు చేసి, తిరిగి భారతదేశానికి తీసుకువచ్చినందుకు వారంతా రవి పులికి కృతజ్ఞతలు తెలిపారు. ఇంతటి అసాధ్యమైన మిషన్‌ను విజయవంతంగా పూర్తి చేయడం పట్ల రవి పులి కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ వాషింగ్టన్, ఖతార్‌లోని భారత రాయబార కార్యాలయాలు, విదేశాంగ మంత్రిత్వ శాఖ, పౌర విమానయాన శాఖ తోడ్పాటు కూడా ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం సహకారం కూడా ఇలాంటి ప్రయత్నం విజయవంతం కావడం సాధ్యం కాదన్నారు. సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రయత్నంలో తోడ్పడిన అన్ని తెలుగు అసోషియేషన్లు, భారతీయ అసోసియేషన్లకూడా కృతజ్ఞతలు తెలిపారు. ఈ మిషన్ తమ బాధ్యతను మరింత పెంచిందని ఆయన అన్నారు. ఈ విజయం ద్వారా సంకల్పం ఉంటే ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కోవచ్చని నిరూపించిందన్నారు. పరిష్కారాలు వెదికి, కొత్త చరిత్ర సృష్టించడం మన చేతుల్లోనే ఉందని అభిప్రాయపడ్డారు.