అంతే కొన్నిసార్లు అదృష్టలక్ష్మి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చున్నప్పుడు బ్యాడ్ లక్ ఎన్ని సార్లు బెల్లు కొట్టినా మనకు వినిపించదు. దర్శకుడు క్రిష్, హీరో వైష్ణవ్ తేజ్ కి అచ్చం ఇలాంటి పరిస్థితి ఎదురవుతోంది. ఉప్పెన విడుదల కోసం ఎదురు చూస్తున్న సమయంలోనే ఈ ఇద్దరి కాంబినేషన్ లో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా క్రిష్ ఓ సినిమా చకచకా పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఇంత వేగంగా ఇది జరిగిపోయిందన్న సంగతి ఆన్ లైన్ మీడియా మీద అవగాహన లేని వాళ్లకు తెలియకపోవడం కూడా వాస్తవం. తీరా ఇప్పుడు చూస్తే ఉప్పెనేమో అదరగొట్టే వసూళ్లతో కొత్త రికార్డులు సృష్టించేసింది. దీంతో ఇక్కడ సీన్ మారిపోయింది.
ముందు క్రిష్-వైష్ణవ్ ల సినిమాను ఓటిటికి ఇచ్చేద్దాం అనుకున్న యూనిట్ ఇప్పుడు థియేట్రికల్ రిలీజ్ కోసం మనసు మార్చుకున్నట్టుగా సమాచారం. డిస్ట్రిబ్యూటర్లు కూడా అదే విధంగా ఒత్తిడి చేస్తున్నారని ఉప్పెన ఫలితం వల్ల మంచి ఓపెనింగ్స్ తో పాటు కంటెంట్ బాగుంటే రన్ కూడా వస్తుందని భరోసా ఇచ్చారట. ఎలాగూ క్రేజ్ ఉన్న కాంబినేషన్ కాబట్టి కలెక్షన్ల విషయంలో టెన్షన్ అక్కర్లేదని వాళ్ళ నమ్మకం. ఈ సినిమా కూడా ఉప్పెన తరహాలోనే ఒకరకమైన పల్లెటూరి నేపథ్యంలో సాగుతుంది. సుప్రసిద్ధ కొండపోలం నవల ఆధారంగా తీశారనే టాక్ ఉంది కానీ దానికి సంబంధించిన ఎలాంటి అధికార ధ్రువీకరణ లేదు.
డెబ్యూతోనే ఇంత సెన్సేషన్ చేసిన వైష్ణవ్ తేజ్ కృతి శెట్టిల డిమాండ్ ఇప్పుడు ఓరేంజ్ లో పెరిగిపోయింది. టాక్ తో సంబంధం లేకుండా టైటిల్ కు తగ్గట్టు కలెక్షన్లు తెచ్చిన ఈ సినిమా ఫైనల్ గా ఎంత గ్రాస్ తెస్తుందో అంతు చిక్కడం లేదు. అందుకే క్రిష్ మూవీకి ఇదంతా చాలా పెద్ద ప్లస్ అవుతోంది. ఇంకా టైటిల్ డిసైడ్ చేయలేదు కానీ ఉప్పెన క్రేజ్ దృష్ట్యా సింపుల్ గా అనిపిస్తునే పవర్ ఫుల్ గా ఉండేలా ప్లాన్ చేసుకున్నారట. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. పవన్ కళ్యాణ్ తో చేస్తున్న చారిత్రాత్మక చిత్రం గ్యాప్ లోనే క్రిష్ చాలా వేగంగా ఈ చిత్రాన్ని పూర్తి చేయడం లాక్ డౌన్ టైంలో ఒక రికార్డుగా చెప్పుకున్నారు