ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతు ఉద్యమం కాస్త బార్బడోస్ కు చెందిన ప్రముఖ పాప్ సింగర్ రిహాన ట్వీట్ తో ట్విట్టర్ వార్ గా మారిపోయింది. ఆమెతో పాటు పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్ బెర్గ్ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మేనకోడలు మీనా హారిస్, బ్రిటన్ ఎంపీ తన్మన్ జీత్ సింగ్ లాంటి విదేశీ ప్రముఖులు రైతు ఉద్యమం గురించి స్పందించడంతో కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. మా అంతర్గత వ్యవహారాల్లో మీ జోక్యం ఎందుకంటూ మండిపడింది. విదేశీ ప్రముఖులు చేసిన అభ్యంతరకరమైన ట్వీట్లను అనుమతించడంపై ట్విటర్‌కు కేంద్రం నోటీసులు పంపించింది.
విదేశీ సెలెబ్రెటీలు రైతు ఉద్యమంపై తమ స్పందనలను ట్విట్టర్ ద్వారా తెలపడంతో మన దేశంలో ఉన్న సెలబ్రిటీలు కూడా స్పందించారు. ముఖ్యంగా కంగనా రనౌత్ ఒకడుగు ముందుకు వేసి ఉద్యమం చేస్తున్న రైతులను ఉగ్రవాదులతో పోల్చడం తీవ్ర దుమారానికి దారి తీసింది. కంగనాతో పాటు బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, అజయ్ దేవ్‌గణ్, దర్శక నిర్మాత కరణ్ జోహార్, కంగనా రనౌత్, క్రికెటర్లు సచిన్ టెండూల్కర్,విరాట్ కోహ్లీ,ప్రజ్ఞాన్ ఓజాలు భారత దేశ అంతర్గత వ్యవహారాల్లో విదేశేయులెవరూ తలదూర్చవద్దని భారత దేశానికి సమస్య పరిష్కరించుకునే సత్తా ఉందని అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
విదేశీయులైతే స్పందించకూడదా?
రైతు ఉద్యమం భారత దేశ అంతర్గత విషయం కావొచ్చు. కానీ రైతులు చేస్తున్న ఉద్యమాన్ని ప్రపంచం గమనిస్తుందన్న విషయాన్ని కేంద్రం గుర్తించాలి. విదేశీయులను భారత దేశ అంతర్గత విషయాల్లో స్పందించవద్దని చెప్పే హక్కు కేంద్ర ప్రభుత్వానికి కానీ ఇతర సెలెబ్రిటీలకు కానీ ఉందా అని ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిజానికి మానవహక్కులకు హాని కలుగుతుంటే స్పందించే హక్కు ప్రపంచంలో ఉన్న ప్రతీ ఒక్కరికీ ఉంది. మనం ఇతరుల అంతర్గత వ్యవహారాల్లో స్పందిస్తే ఎవ్వరూ నోరు మెదపకూడదు కానీ మన అంతర్గత వ్యవహారాల్లో ఇతరులు స్పందిస్తే మాత్రం ఒప్పుకోకూడదు అన్నట్లు ప్రవర్తిస్తున్న ప్రభుత్వంపై కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.
విదేశీ అంతర్గత వ్యవహారంలో వేలు పెట్టకూడదని చెప్పిన హోంమంత్రి అమిత్ షాకు 1971లో భారత్ పాకిస్థాన్ ల మధ్య జరిగిన యుద్ధం గురించి గుర్తు లేదేమో. ఈస్ట్ పాకిస్తాన్(ప్రస్తుత బంగ్లాదేశ్) వెస్ట్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు భారత్ కల్పించుకుని పాకిస్థాన్ తో యుద్ధం చేసింది. అది ఆయా దేశాల అంతర్గత వ్యవహారం అని ఊరుకోలేదు. ఈస్ట్ పాకిస్థాన్ తరపున యుద్ధం చేసి బంగ్లాదేశ్ ఆవిర్భావానికి నాంది పలికింది.
1975లో భారత రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ దేశంలో అత్యవసర పరిస్థితి విధించినపుడు అధికారాన్ని తన చేతిలోకి తీసుకున్న ఇందిరాగాంధీ తన ప్రత్యర్థులను ముఖ్యంగా పద్మవిభూషణ్ జార్జ్ ఫెర్నాండెజ్ ను బరోడా డైనమైట్ కేసులో అరెస్టు చేయించడంపై ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ సంఘటనలను ఇందిరాగాంధీ తీసుకున్న నిర్ణయాలను ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండించాయి.
శ్రీలంక ప్రభుత్వానికి ఎల్టీటీఈకి మధ్య జరుగుతున్న యుద్ధాన్ని భారతదేశం ఖండించింది.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన Citizenship Amendment Bill కి ప్రధాన కారణం, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల్లో దాడులకు గురవుతున్న మైనారిటీలకు భారత దేశ పౌరసత్వం ఇచ్చి వారికి రక్షణ కల్పించడమే. దీన్ని నిశితంగా పరిశీలిస్తే ఆయా దేశాల్లో మైనారిటీలపై జరుగుతున్న దాడులు ఆయా దేశాల అంతర్గత వ్యవహారమే. కానీ మన ప్రభుత్వం ఏకంగా చట్టాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేసింది. దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగడంతో వెనక్కితగ్గింది.
ఫ్రాన్స్ టీచర్ శామ్యూల్ పాటీ ముస్లిం టెర్రరిస్టుల చేతిలో హత్యకు గురికావడాన్ని ప్రపంచ దేశాలు ఖండించాయి. భావ ప్రకటనా స్వేచ్ఛను హరిస్తున్నారని మనదేశంలో కూడా అనేకమంది ఆ ఘటనను ఖండించారు.
మే 25 2020 న జార్జ్ ప్లాయిడ్ హత్య ఆ దేశాన్ని కుదిపేసింది. నల్ల జాతీయుడిని అరెస్ట్ చేసి మోకాలితో మెడపై తొక్కి పోలీస్ అధికారి చంపడం సంచలనం రేకెత్తించింది. ఈ సంఘటనను ముక్తకంఠంతో ప్రపంచ దేశాలు ఖండించాయి. భారత్ కూడా ఖండించింది.
ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ తరపున భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రచారం చేయడం తీవ్ర దుమారాన్ని రేపింది. ఇతర దేశాలలో జరిగే ఎన్నికలు వాళ్ళ అంతర్గత వ్యవహారంగా భావించకుండా మోడీ ట్రంప్ తరపున ప్రచారం చేయడాన్ని పలువురు తప్పు పట్టారు.
వెనిజులా అధ్యక్షుడిని తాము గుర్తించబోమని భారత్ అధికారికంగా తేల్చిచెప్పింది. అధ్యక్షుని ఎన్నిక వాళ్ళ అంతర్గత వ్యవహారంగా భారత్ భావించలేదు.
తాజాగా కేంద్ర ప్రభుత్వం అంతర్గత విషయమని భావిస్తున్న నూతన వ్యవసాయ చట్టాలకు అమెరికా మద్దతు తెలిపింది. చర్చల ద్వారా రైతుల సమస్యలు పరిష్కరించుకోవాలని అమెరికా సూచించింది. దీన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందో లేక తమ అంతర్గత విషయాల్లో అమెరికా సలహాలు ఎందుకని భావిస్తుందా అన్నది ప్రభుత్వ పెద్దలు ట్వీట్లు చేస్తే తప్ప తెలియని పరిస్థితి..
ఇలాంటివి పరిశీలిస్తే భారత దేశం ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చి జోక్యం చేసుకున్నవి ఖండించినవి, అభినందించినవి చరిత్రలో కోకొల్లలుగా కనిపిస్తాయి. మానవ హక్కులు హాని కలిగితే స్పందించడం మనవ నైజం. ఇది మా అంతర్గత వ్యవహారమని చెప్పే హక్కు ఏ దేశానికి లేదు. పలువురు క్రికెటర్లు కూడా విదేశీయులు చేస్తున్న ట్వీట్లకు వ్యతిరేకంగా ట్వీట్లను చేస్తున్నారు. అమిత్ షా కుమారుడు జే షా బీసీసీఐ సెక్రెటరీగా పనిచేస్తున్నందున క్రికెటర్లు ఆయా ట్వీట్లను ప్రభుత్వానికి అనుకూలంగా చేస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా రైతుల విషయంలో స్పందిస్తున్న ప్రపంచ దేశాల ప్రముఖుల గొంతును నొక్కేయాలని చూడటం హాస్యాస్పదం మాత్రమే కాదు ప్రమాదం కూడా..