తిరుమలలో మధ్య తరగతి భక్తులకు కేటాయించే వసతి గదుల అద్దెలను పెంచుతూ తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) నిర్ణయం తీసుకుంది. గురువారం నుంచే పెంచిన ధరలను అమలు చేసింది. తిరుమలలో వివిధ వసతి సముదాయాల్లో 952 గదులు ఉన్నాయ్. పాంచజన్యంలో 383, కౌస్తుభంలో 229, నందకంలో 340 గదులు ఉన్నాయి. ఒక్కోగదికి నందకంలో రూ.600, పాంచజన్యం, కౌస్తుభంలలో రూ.500 అద్దె ఉండేది. గదుల నిర్వహణ ఖర్చులు పెరుగుతుండడంతో అద్దెలు పెంచాలని భావించిన టీటీడీ కొందరు అధికారులతో కమిటీ వేసిం ది. ఈ కమిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా మూడింటిలోనూ గదికి వెయ్యిరూపాయలు చొప్పున అద్దె నిర్ణయిస్తూ అమలులోకి తీసుకువచ్చారు. పాత ధరలతో రోజుకు రూ. 5,09,500 వసూలయ్యే మొత్తం గురువారం నుంచి రూ.9.51 లక్షలకు పెరుగుతోంది.