iDreamPost
android-app
ios-app

ఇదేంటి బుచ్చయ్య గారు, గెలిచిన వారంతా మావాళ్లే అంటే ఎలా..?

  • Published Feb 18, 2021 | 4:08 AM Updated Updated Feb 18, 2021 | 4:08 AM
ఇదేంటి బుచ్చయ్య గారు, గెలిచిన వారంతా మావాళ్లే అంటే ఎలా..?

రాజకీయం అన్నాక కాసంత పక్క చూపులుంటాయి. పక్క చూపులు అంటే తన పార్టీ వాళ్ళతో పాటు, పక్క నున్న పార్టీ వాళ్ళను కూడా కాస్తంత చూసుకుంటూ ఉంటారు. అయితే ఇది సంబంధిత వ్యవహారాల వరకు కొంత మేర ఆమోదం పొందేస్తుంటుంది. కానీ పక్క పార్టీ పేరుమీద విజయం సాధించినప్పటికీ తమ పార్టీ తరఫునేదో  గెలిచినట్లు వాళ్ళ దగ్గర కెళ్ళిమరీ శుభాకాంక్షలు చెప్పడం కాస్తంత విడ్డూరంగానే ఉంటుంది. అందులోనూ ఒక పార్టీలో సీనియర్‌ నాయకుడిగా ఉన్న వ్యక్తే అటువంటి పనులు చేస్తుంటే ఆ విడ్డూరం ఇంకా పెరిగిపోక మానదు.

ప్రభుత్వం వద్దు వద్దు అంటున్నా పెట్టిన పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ పరువు బాగానే పోయిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎన్నికలకు వెళ్ళే దమ్ములేకే వద్దంటున్నారు.. అంటూ ఢంకా భజాయించే ప్రయత్నం చేసిన నాయకులెవరూ ఇప్పుడు మైకుల ముందుకు రాకపోవడాన్ని వారు గుర్తు చేస్తున్నారు. అయితే ఇంకొందరు నాయకులు మాత్రం నిస్సిగ్గుగా పక్కవాడి విజయాన్ని తమ విజయంగానే రాసేసుకుంటున్నారు.

తెలుగుదేశం పార్టీలో చంద్రబాబుకంటే సీనియర్‌ని అని చెప్పుకునే రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి కూడా ఇప్పుడు అదే కోవలోకి చేరిపోయారు. తన వల్ల కాని, తనది కాని విజయాన్ని తనదిగా ప్రచారం చేసుకుంటూ తన సీనియారిటీకే మచ్చ తెచ్చేసుకుంటున్నారు. నియోజకవర్గంలో రూరల్, కడియం మండలాలు ఉన్నాయి. రాజమహేంద్రవరం సిటీలో విలీనం కారణంగా రూరల్‌ మండలంలోని పంచాయతీల్లో ఎన్నికలు జరగలేదు.

దీంతో కడియం మండలంలోని 9 గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించారు. అయితే ఇందులో సగానికిపైగా గ్రామాల్లో టీడీపీ నుంచి అభ్యర్ధుల్నే పెట్టలేదు. ఇది సీనియర్‌ నేతగా ఉన్న గోరంట్ల సామర్ధ్యాన్ని చాటి చెబుతోందంటున్నారు ఆయన ప్రత్యర్ధులు. తొమ్మిదింటిలోనూ కడియం, మాధవరాయుడుపాలెం గ్రామాల్లో మాత్రమే టీడీపీ తరపున నేరుగా సర్పంచ్‌ అభ్యర్ధులు పోటీ చేసి గెలిచారు. మరో రెండు చోట్ల జనసేనతో పొత్తు ‌ కారణంగా కడియపుసావరం, దామిరెడ్డిపల్లి గ్రామాల్లో గెలవగలిగారు. మిగిలిన అయిదింటిలోనూ వైఎస్సార్‌సీపీ సర్పంచ్‌ అభ్యర్ధులు నేరుగా విజయం సాధించారు.

వాస్తవం ఇలా ఉండగా గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాత్రం తన ఫేస్బుక్‌ పేజీలో మాత్రం అయిదు పంచాయతీల్లో టీడీపీ మెజార్టీ అంటూ పోస్టు చేసుకోవడం సోషల్‌ మీడియా వేదికగా ఘాటుగానే వివాదం చెలరేగుతోంది. అసలు అయిదు చోట్ల టీడీపీ నుంచి అభ్యర్దులే పోటీలో లేకపోగా, అయిదు విజయాలు ఎలా సాధ్యం? అంటూ ప్రశ్నిస్తున్నారు.

కడియపుసావరం, దామిరెడ్డిపల్లి, కడియపులంక గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ తరపున అభ్యర్దులను నిలపకుండా జనసేన నుంచి పోటీ చేసిన వారి వెంట టీడీపీవారు తిరిగారు. గోరంట్ల బుచ్చయ్యచౌదరి సైతం జనసేన కండువాలతో ప్రచారం చేసుకుంటున్న వారిని పచ్చ కండువాలు ధరించి మరీ కలిసి వచ్చారు. అయినప్పటికీ వారి విజయాన్ని కూడా తన ఖాతాలు వేసేసుకోవడం పట్ల సర్వత్రా విమర్శలు చెలరేగుతున్నాయి. ప్రచారం టైమ్‌లోనే జనసేన కండువాలతో ఉన్న వారి వెంట వెళ్ళడంపై చెలరేగిన విమర్శలు చల్లారకుండా మరోసారి గోరంట్ల తీరుతో సోషల్‌ మీడియాలో సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి.

సీనియర్‌గా చెప్పుకునే గోరంట్ల తీరే ఇలా ఉంటే, ఇక ఈయనకు జూనియర్‌గా ఉన్న చంద్రబాబు నాయుడు కూడా ఇదే తీరుతో చెప్పుకుంటున్నట్లున్నారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ససాక్ష్యాధారాలతో సహా 85శాతం గ్రామ పంచాయతీల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్ధులే విజయం సాధిస్తున్నారని అధికార పక్షం చెబుతున్నప్పటికీ, టీడీపీ అభ్యర్ధులు 39శాతం విజయం సాధించారంటూ చంద్రబాబు ప్రస్తావిస్తుండడాన్ని దీనికి రుజువుగా చెప్పుకుంటున్నారు. సీనియర్‌గా గోరంట్ల చూపిన దారిలోనే జూనియర్‌గా చంద్రబాబు కూడా అనుసరిస్తుండొచ్చనే వారు కూడా లేకపోలేదు.