తెలుగుదేశం పార్టీ వ్యవహారాన్ని ఇప్పటికే ప్రజలు గ్రహిస్తున్నా ఆపార్టీ నేతల్లో మాత్రం మార్పు వస్తున్న దాఖలాలు లేవు. రెండు నాలుకల ధోరణితో సాగుతున్న తీరుని సరిదిద్దుకోవడం లేదు. ఒకే విషయం మీద ఒకే కాలంలో రెండు రకాలుగా వ్యవహరించడం వారికే చెల్లిందన్నట్టుగా మారింది. తాజాగా ఏపీలో ఆర్టీసీ ఛార్జీల పెంపుదలపై టీడీపీ గొంతు విప్పింది. వైఎస్ జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ చంద్రబాబు నుంచి ఛోటా నేతల వరకూ అందరూ స్టేట్ మెంట్స్ ఇస్తున్నారు. నిరసనలకు కూడా దిగుతామని చెబుతున్నారు.
అదే సమయంలో పక్షం రోజులకు ముందు తెలంగాణాలో పెంచిన ఆర్టీసీ ఛార్జీల పట్ల చంద్రబాబు ఎందుకు సైలెంట్ గా ఉన్నారన్న దానికి టీడీపీ నేతల దగ్గర సమాధానం ఉన్నట్టు కనిపించడం లేదు. తెలంగాణాలో ఒకలా, ఏపీలో మరోలా ఎందుకు వ్యవహరిస్తున్నారన్నది జనం అర్థం చేసుకోలేరని టీడీపీ నేతలు భావిస్తున్నట్టు కనిపిస్తోంది. వాస్తవానికి తెలుగుదేశం జాతీయ పార్టీగా ప్రకటించుకుంది. ఏపీలో టీడీపీకి ప్రత్యేక కార్యవర్గం, అధ్యక్షుడు కూడా ఉన్నారు. తెలంగాణా ఎన్నికల్లో కూడా బరిలో దిగింది. అలాంటి సమయంలో చంద్రబాబు జాతీయ నేతగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రజలపై భారాలు పడుతున్నాయని భావిస్తే స్పందించాల్సి ఉంటుంది.
కానీ దానికి భిన్నంగా చంద్రబాబు తెలంగాణాలో ఆర్టీసీ ఛార్జీల పెంపుదల పట్ల మౌనం వహించి, ఏపీలో ఛార్జీల భారం పట్ల మాత్రం గొంతు చించుకోవడాన్ని జనం సమర్థించరన్న సంగతి ఆపార్టీ నేతలు గుర్తించడం మంచిదేమో అనిపిస్తోంది. ఇటీవల పెరిగిన డీజిల్ ఛార్జీలకు అనుగుణంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఆర్టీసీ ఛార్జీలు పెంచుతున్నారు. అందులో అందరికన్నా ఆలశ్యంగా ఏపీలో నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. దాదాపుగా ప్రజలపై భారం పడకుండా చూసేందుకు ప్రయత్నించామని, కానీ ఆర్టీసీకి భారంగా మారి, తప్పనిసరి పరిస్థితుల్లోనే భారం వేయాల్సి వచ్చిందని మంత్రి పేర్ని నాని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు మాత్రం ఒక్కో చోట ఒక్కో విధంగా వ్యవహరించడంతో ఆపార్టీ వాదనను ప్రజలు జీర్ణం చేసుకోలేని స్థితి ఏర్పడుతోంది.