టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా మార్చుకుని ప్రజలను మోసం చేశారని బీజేపీ రాష్ట్ర ఇంచార్జి సునీల్ దేవధర్ విమర్శించారు. అధికారం ఉందని.. అవినీతిని ప్రోత్సహించి.. కేంద్ర ప్రభుత్వ నిధులను దోచుకున్నారని ఆరోపించారు. ‘బాహుబలి సినిమాలో కట్టప్ప వలె తన మామ అయిన ఎన్టీఆర్‌ను వెనుపోటు పొడిచి.. టీడీపీని లాక్కొని.. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ప్రస్తుతం ఆయనను, టీడీపీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు’ అని విమర్శలు గుప్పించారు. నరేంద్ర మోదీ దేశ ప్రధానిలా గాకుండా సేవకునిగా పనిచేస్తున్నారని కొనియాడారు. వారసత్వ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకం అని… దేశ వ్యాప్తంగా అవినీతి రహిత పాలన అందించడం కేవలం బీజేపీకి మాత్రమే సాధ్యపడుతుందని పేర్కొన్నారు. గాంధీ సంకల్ప యాత్రలో భాగంగా ఇప్పటికే అనంతపురం, కడప జిల్లాల్లో పాదయాత్రలో పాల్గొన్నానని తెలిపారు.