iDreamPost
android-app
ios-app

దేవాదాయశాఖను రద్దు చేస్తామంటున్న సోము వీర్రాజు

  • Published Sep 23, 2021 | 3:22 PM Updated Updated Sep 23, 2021 | 3:22 PM
దేవాదాయశాఖను రద్దు చేస్తామంటున్న సోము వీర్రాజు

ఆలూ చూలూ లేకుండానే బిడ్డకు పేరు పెట్టినట్టుంది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు వ్యవహారం. తమ పార్టీకి రాష్ట్రంలో కనీస ఓట్లు రాబట్టే సత్తా లేకపోయినా వచ్చే ఎన్నికల్లో గెలిచేసినట్టు ఇప్పుడే మురిసిపోతున్నారు. తన మిత్రపక్షం జనసేనతో కలసి తాము అధికారంలోకి రాగానే దేవాదాయశాఖను రద్దు చేస్తామని ప్రకటించేశారు. అంతటితో ఆగకుండా ప్రముఖ ఆలయాలను స్వామీజీలకు, హిందూ ధార్మిక సంస్థలకు అప్పగించేస్తామని మరో విధాన నిర్ణయం కూడా తీసేసుకున్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రత్యేక ఆహ్వానితులను నియమించడానికి తమ పార్టీ వ్యతిరేకమని చెప్పారు. ఎందుకంటే ప్రభుత్వం ప్రత్యేక ఆహ్వానితులను నియమించడం వల్ల వారు జారీ చేసే పాస్‌లున్న వారితో ఆలయం నిండిపోతోందని, దీంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారన్నారని బాధ పడిపోయారు. మరి వారు మాత్రం ఆయన దృష్టిలో భక్తులు కాదేమో! టీటీడీలో రాజకీయ పెత్తనం సరికాదన్నారు. ధార్మిక సంస్థలపై కూడా రాజకీయ నాయకుల పెత్తనానికి బీజేపీ పూర్తిగా వ్యతిరేకమన్నారు. అందుకే అన్ని ప్రముఖ ఆలయాలను స్వామీజీలకు, హిందూ ధార్మిక సంస్థలకు అప్పగించేస్తామని సెలవిచ్చారు.

Also Read : కాకినాడ మేయర్ పై అవిశ్వాసం : బీజేపీది ఒకదారి.. ఆ పార్టీ కార్పొరేటర్లది మరో దారి

మరి వీరు అధికారంలోకి వచ్చాక తీసుకొనే ఈ నిర్ణయాలన్నీ రాజకీయ పెత్తనం కిందకు రావేమో!  ప్రస్తుతం టీటీడీ పాలకవర్గ సభ్యులుగా నియమితులైన వారి వ్యక్తిత్వాలపై కొన్ని మచ్చలు ఉన్నాయని చెబుతూ ఇది పలు సామాజిక మాధ్యమాల ద్వారా బయటకు వచ్చిందని కూడా ముక్తాయించారు.

ఇదేం లాజిక్కో..

అంతా అమ్మ వాటా.. అమ్మ నా వాటా అన్నట్టున్నాయి సోము వీర్రాజు వ్యాఖ్యలు. దేవాదాయశాఖను రద్దు చేసి, అన్ని ప్రముఖ ఆలయాలను స్వామీజీలకు, హిందూ ధార్మిక సంస్థలకు అప్పగించేస్తామనడం వరకూ బాగానే ఉంది. ఇది వింటే ఎవరైనా రాజకీయ పెత్తనాన్ని తగ్గించే ఉద్దేశంతో అలా చేద్దామనుకుంటున్నారని భావిస్తారు. కానీ అది సరికాదు అనిపిస్తోంది. వారిని తమ ప్రభుత్వ గుప్పెట్లో పెట్టుకుందామనేది ఆయన ఆలోచన అని అర్థమవుతోంది. ఎందుకంటే స్వామీజీలకు, హిందూ ధార్మిక సంస్థలకు ఆలయాలను అప్పగించేశాక వారు ఏమేం నిర్ణయాలు తీసుకుంటారో ఈయన ఇప్పుడే చెప్పేస్తున్నారు. ఇంక వారికి స్వేచ్ఛ ఎక్కడిది? ఇంతోటి దానికి దేవదాయశాఖను రద్దు చేస్తాం. ఇంకేదో చేస్తాం అని ప్రకటనలు ఇవ్వడం ఎందుకో?

ముందు గెలవాలి కదా..

బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఈయన ఊహిస్తున్న పనులన్నీ చేయాలంటే ముందు ఆ పార్టీ గెలవాలి అన్న సంగతి సోము మరచిపోయినట్లున్నారు. గడచిన ఎన్నికల్లో రాష్ట్రంలో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేకపోయిన ఆ పార్టీ ఏకంగా అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పేయడమే కాక ఏమేం చేస్తామో వివరిస్తూ జాబితా చదివేస్తున్నారు. నేల విడిచి సాము చేసినట్టు.. సోము వారు ఊహాల్లో కాకుండా నేలపై ఎప్పుడు నడుస్తారో..?

Also Read : కోవిడ్ మృతులకు పరిహారం.. రాష్ట్రాలపైకి నెట్టేసిన కేంద్రం