iDreamPost
android-app
ios-app

రెండు జిల్లాల పార్టీగా మిగిలిన జనసేన, అక్కడ కూడా అంతంతమాత్రమే

  • Published Sep 20, 2021 | 2:43 AM Updated Updated Sep 20, 2021 | 2:43 AM
రెండు జిల్లాల పార్టీగా మిగిలిన జనసేన, అక్కడ కూడా అంతంతమాత్రమే

ఆంధ్రప్రదేశ్ లో తామే అధికారం చేపడుతున్నామని, కాబోయే సీఎం తానేనంటూ చెప్పుకున్న పవన్ కళ్యాణ్ పరిస్థితి రానురాను పలుచన అవుతోంది. రాజకీయంగా జనసేన ప్రభావం నామమాత్రంగా మారుతోంది. ఏపీలో జరిగిన ఎన్నికల్లో కేవలం రెండు జెడ్పీటీసీ స్థానాలను ఆపార్టీ దక్కించుకుంది. ఎంపీటీసీల పరంగానూ 170కి పైగా సీట్లు గెలుచుకున్నప్పటికీ అందులో 90 శాతం స్థానాలు రెండు జిల్లాల్లోనే దక్కడం విశేషం. 5 జిల్లాల్లో అయితే ఒక్క ఎంపీటీసీ సీటు కూడా జనసేనకి దక్కకపోవడం గమనార్హం. మరో మూడు జిల్లాలు శ్రీకాకుళం, నెల్లూరు, అనంతపురంలో ఒక్కో ఎంపీటీసీ స్థానంతో సరిపెట్టుకుంది. దాంతో ఆపార్టీ కేవలం రెండు జిల్లాలకే పరిమితమయినట్టుగా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ సొంత సామాజికవర్గం ప్రభావితం చేయగల ప్రాంతాల్లోనే కొంత ఓట్లు వస్తున్నట్టు స్పష్టమవుతోంది.

2019 సాధారణ ఎన్నికల్లో జనసేనకి కేవలం ఒకే ఒక్క అసెంబ్లీ సీటు దక్కింది. అది కూడా పవన్ ఛరిష్మాతో పాటుగా రాజోలులో ఎమ్మెల్యేగా గెలిచిన రాపాక వరప్రసాద రావు వ్యక్తిగత ప్రయత్నాలు కూడా ఫలించడంతో విజయతీరానికి చేరింది. పవన్ కూడా రెండు చోట్ల ఓటమి పాలుకావడం జనసేనను కుంగతీసింది. ఇక ఆ తర్వాత మళ్లీ కోలుకుని ప్రజల్లో పట్టు నిలుపుకునే ప్రయత్నాలను జనసేన దాదాపుగా విస్మరించింది. అడపాదడపా అధినేత ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టడం, ఒకటీ అరా స్టేట్మెంట్స్, ట్విట్టర్ పోస్టులు మినహా జనసేనాని జనాలకు చేరువకాలేకపోయారు. ఇటీవల నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో కొంత కార్యక్రమాలకు ప్రయత్నాలు చేసినా అవేమీ ఫలితానివ్వడం లేదని తేలిపోయింది.

ఇక జగన్ కి అడ్డుకట్టవేస్తామంటూ బీజేపీతో జతగట్టినా జనసేనకు దక్కిన మేలు కనిపించడం లేదు. ఇరు పార్టీలు కలిపి పోటీ చేసినప్పటికీ బీజేపీకి ఒక్క జెడ్పీటీసీ కూడా దక్కలేదు. జనసేనకు మాత్రం తూర్పు గోదావరిలో కడియం, పశ్చిమ గోదావరి జిల్లాలో వీరవాసరం జెడ్పీటీసీలు దక్కినా, బీజేపీ వల్ల రాష్ట్రంలో అదనపు ప్రయోజనం మాత్రం కనిపించడం లేదు. ఇక జనసేనను ఆధారంగా చేసుకుని ఎదుగుదామని ఆశించిన బీజేపీకి కూడా పెద్దగా ఒరిగింది కూడా లేదు. దాంతో ఈ రెండు పార్టీల వ్యవహారం ఇప్పుడు ఆసక్తిగా మారుతోంది. అదే సమయంలో కేవలం కాపు కులస్తుల ఓట్లు ప్రభావితం చేయగల ప్రాంతంలో మాత్రమే పవన్ కళ్యాణ్ పార్టీ ప్రభావం కనిపించడంతో పాక్షిక కులపార్టీగా మిగిలిపోతున్నట్టు కనిపిస్తోంది.

ఉభయ గోదావరి జిల్లాల్లోనే 150కి పైగా ఎంపీటీసీలు గెలిచిన జనసేన ఆ తర్వాత గుంటూరు జిల్లాలో 10 ఎంపీటీసీలతో డబుల్ ఫిగర్ దక్కించుకుంది. కృష్ణా జిల్లాలో 9 స్థానాలకు పరిమితమయ్యింది. ఈ నాలుగు జిల్లాలు దాటి గెలిచిన సీట్లు కేవలం ఐదు మాత్రమే. దాంతో కాపులు మాత్రమే జనసేనకు ఆధారంగా ఉంది.

ఈ పరిస్థితుల్లో జనసేన రాజకీయంగా ఇక రాణించే అవకాశం కనిపించడం లేదు. పైగా పవన్ కళ్యాణ్ ప్రభావం రానురాను పడిపోవడమే తప్ప నిలదొక్కుకునే మార్గం కూడా కానరావడం లేదు. ఈ నేపథ్యంలో జనసేన తరుపున అక్కడక్కడా గెలిచిన ఎంపీటీసీ లు కూడా ఎన్నాళ్ల పాటు ఆపార్టీ వెంట నడుస్తారన్నది సందేహంగా మారింది. జనసేన రాజకీయాలు జనాలను చేరడం ఇక కష్టమేనని రూఢీ అవుతోంది.