హైస్కూల్ ముందునుండి నడుస్తూ వెళ్తున్నా. స్కూల్ లాస్ట్ బెల్ కొట్టే టైమ్ అయింది. అప్పటికే హైస్కూల్ ముందు పోకిరీ కుర్రాళ్లు బయటకు వచ్చే ఆడపిల్లల కోసం వేచి చూస్తున్నారు. అందులో ఒకడు తన ఫ్రెండ్ తో, మామా… ఈరోజు నా ఫిగర్ సూపర్ డ్రెస్ వేసింది తెలుసా..ఎంత బాగుందో లంగా వోణీలో, అన్నాడు.. ఈ మాట నా చెవిన పడింది.. తన లవర్ అంత బాగుంటుందా అని నాక్కూడా మనసులో తెలియని కుతూహలం కలిగి అక్కడే ఉండి గమనిస్తున్నాను.. ఈలోపు స్కూల్ నుండి పిల్లలు బయటకు వస్తున్నారు.. అక్కడ ఉన్న పోకిరీలు వాళ్ళ లవర్స్ కోసం వెతుక్కుంటున్నారు. లవర్ ఉన్న పోకిరీ కుర్రాళ్ళు, తమ లవర్ల కోసం వెతుక్కుంటుంటే, ఆ పోకిరీ కుర్రాళ్ళ ఫ్రెండ్స్ మాత్రం కొత్త పిల్లల్ని, ఎలా ట్రాప్ చేయాలా అని ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ, బయటకు వచ్చే స్కూల్ పిల్లలకు పిచ్చి సైగలు చేస్తున్నారు..,కొందరు కుర్రాళ్ళు మాత్రం తమ ఫ్రెండ్స్ తో ఈరోజు నీ చెల్లి ఏంటి మామా ఇంత అందంగా ఉందని అంటూ ఆడపిల్లల్ని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు..
ఈలోపు లంగా వోణి అమ్మాయి రానే వచ్చింది.. నవ్వుతూ తన లవర్ దగ్గరకు వెళ్ళింది. నాకు ఆ సంఘటన చూసాక చాలా బాధ కలిగింది ఎందుకంటే తన వయసు ఇంచుమించు 13 సంవత్సరాలు ఉండొచ్చు. 8వ తరగతి విద్యార్థిని అయి ఉంటుంది.. వాడిని చూస్తే 30సంవత్సరాల లోపు వయసు ఉండొచ్చు అని అర్థం అవుతుంది. ఒక చిన్న పిల్లని ట్రాప్ చేసిన వాడిని చూస్తే నాకు అసహ్యం వేసింది. నా మదిలో ఒక టీనేజ్ గర్ల్ ట్రాప్ లో పడటానికి గల కారణాలు ఏంటి అనే ఆలోచనలు తిరుగుతున్నాయి. వాటి గురించి తీవ్రంగా ఆలోచించడం మొదలు పెట్టాను. ఒక అమ్మాయి ఎప్పుడైతే టీనేజ్ లో అడుగు పెట్టిందో అప్పటినుంచి తనకి నిబంధనలు మొదలవుతాయి.. నువ్ అక్కడికి వెళ్లకూడదు,అలా వెళ్లకూడదు,అలా ఉండకూడదు, ఇలా ఉండాలి,ఇలా మాట్లాడాలి.. ఇలా నిద్ర పోవాలి, వయసులో ఉన్నావ్.. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని, ఇంట్లో పేరెంట్స్ ఎక్కువగా నిబంధనలు పెడతారు. కాబట్టి అమ్మాయికి టీనేజ్ లో పంజరంలో లో ఉన్న భావన కలుగుతుంది.. దానికి తోడు ఇప్పుడు వస్తున్న ప్రతి మూవీ ప్రేమించకపోతే లైఫ్ వేస్ట్., ప్రేమలో అత్యంత ఆనందంగా ఉండొచ్చని పసి మనసుల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తూ కలుషితం చేస్తున్నాయి. పెద్దల్ని ఎదిరించి ప్రేమించుకోవాలని ఆ సినిమాలు చూపిస్తాయి కానీ, ప్రేమంటే ఏంటో మాత్రం ఆ సినిమాలు చెప్పవు. ప్రేమంటే కేవలం ముద్దులు, కౌగిలింతలు, కమిట్ అవడాలు అని మాత్రమే ఎక్కువ సినిమాలు చూపిస్తాయి. కుటుంబ సభ్యులంతా కలిసి, ఆ సినిమాలు, కుతంత్రాలతో నిండిన సీరియల్స్ చూసి ఆనందపడతారు.
కానీ ఆ దృశ్య మాధ్యమాలు టీనేజ్ పిల్లలపై తీవ్ర దుష్ప్రభావాలు చూపిస్తాయి. ఈలోపు వయసులో వచ్చే హార్మోన్ల వల్ల కూడా టీనేజ్ లో ఆడపిల్లలు, మగవారికి దగ్గరవ్వాలని కోరుకుంటారు. కానీ పేరెంట్స్ టీనేజ్ లో ఉన్న ఆడపిల్లలకు బయట తిరిగే స్వేచ్ఛ ఇవ్వరు. కాబట్టి టీనేజ్ పిల్లలు అదంతా ఒక పంజరంలా,ఇంటిని ఒక నరకంల ఫీల్ అవుతారు.. అప్పటికే ట్రాప్ ఐన కొందరు ఆడ పిల్లలు, చిన్నచిన్న బహుమతులను,తమ ఫ్రెండ్స్ కి చూపించి తమ బాయ్ ఫ్రెండ్స్ ఇచ్చారని వాళ్ళు తమని ఎంత బాగా చూసుకుంటున్నారో ఎన్ని గిఫ్ట్స్ ఇస్తున్నారో, అని గొప్పలు చెప్పడం కూడా ఆడ పిల్లలు ట్రాప్ అవడానికి ఒక కారణంగా ఉంటుంది. అయితే ఇంట్లో పేరెంట్స్ తమని తమ భావాల్ని అర్థం చేసుకోవడంలేదని తమ ఫీలింగ్స్ పంచుకోవడానికి ఒక తోడు ఉంటే బాగుంటుందని మనసులోనే భావించి,తోడు కోసం మనసులోనే ఎదురు చూస్తూ ఉంటారు. ఆడపిల్లల బలహీనతలు ఆసరాగా చేసుకుని వారిని ట్రాప్ చేయడంలో డాక్టరేట్స్ చేసిన పెద్దలు, పనిలేని పోకిరీ వెధవలు, చాలా మంది హైస్కూల్ చుట్టూ చక్కర్లు కొడుతూ ఉంటారు. ఆడపిల్లలు స్కూల్ లోపలికి వెళ్లే టైం & వచ్చే టైం తెలుసుకుని ఆడపిల్లల చుట్టూ తిరుగుతూ, వారిని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. పిల్లలకు ఇష్టం అయిన చాక్లెట్లు,చిన్న చిన్న బొమ్మలు ఇచ్చి వారిని ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు.
పిల్లలు మొదట్లో ఎక్కువగా ట్రాప్ అయ్యేది ఆటో డ్రైవర్లకు. స్కూలుకు తీసుకెళ్లి తీసుకు వచ్చే ఆటోడ్రైవర్లు ఎక్కువగా పిల్లలకు దగ్గరవుతారు. పిల్లలకు నచ్చే సినిమా పాటలు ఆటోల్లో ప్లే చేస్తూ అమ్మాయిల పర్సనల్ విషయాలు తెలుసుకుంటూ,వారికి చిన్న చిన్న బహుమతులు ఇస్తూ చిన్నపిల్లల్ని ఆకర్షిస్తారు. కొందరు ఆడపిల్లలు మాత్రం తన ఫ్రెండ్ తో ప్రేమ వ్యవహారాలు నడిపే వ్యక్తుల ఫ్రెండ్స్ కి, అట్రాక్ట్ అవుతారు. చిన్న పిల్లలకు ఎలాంటి కబుర్లు చెప్తే అట్రాక్ట్ అవుతారో తెలిసిన వ్యక్తులు చాలామంది ఉంటారు. వాళ్ళు ఈజీగా పిల్లల్ని ట్రాప్ చేస్తారు. కొందరు టీనేజ్ పిల్లలు తమ బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి ఇంట్లో చెప్పకుండా సినిమాలకు,పార్కులకు కాఫీ షాప్ లకు వెళ్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పార్కులను సినిమా థియేటర్లను గమనిస్తే ఈ విషయం అర్ధం అవుతుంది. కానీ కొందరు వ్యక్తులు మాత్రం మరింతగా పిల్లల్ని ప్రభావితం చేసి,వారితో సెక్సువల్ గా కలుస్తూ,వారికి తెలియకుండా వీడియోస్ తీసి పిల్లల్ని బ్లాక్మైల్ చేస్తు నరకం చూపిస్తుంటారు. మరికొంతమంది టీనేజ్ పిల్లలు మరింత ముందుకు వెళ్లి ప్రేమ అనుకుని న్యూడ్ వీడియోలు తీసి బాయ్ ఫ్రెండ్ కి పంపుతూ, తమ అమాయకత్వాన్ని బయట పెట్టుకుంటున్నారు.
పిల్లలు అమాయకులు, ఎవరైనా ప్రేమగా మాట్లాడుతూ అనురాగం కురిపిస్తే దాని వెనుక ఉన్న కపట ఉద్దేశ్యం గుర్తించలేని అమాయకత్వం వారిది. కాబట్టి వారికి మంచికి చెడుకి ఉన్న తేడాని ప్రేమకి,మోసానికి ఉన్న తేడాని చెప్తూ పెంచాలి. ముఖ్యంగా సినిమాల్లో చూపించేది ప్రేమ కాదని అదంతా అబద్ధం అని వారికి అర్థం అయ్యేలా పేరెంట్స్ వివరించాలి. ముఖ్యంగా స్కూల్ బయట పిల్లల్ని ట్రాప్ చేసేవాళ్ళు ఎక్కువగా ఉన్నారని గుర్తించి,పిల్లలకు అలాంటివారి గురించి వివరించి వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి.తల్లిదండ్రులు ముందే జాగ్రత్తగా ఉంటే తమ బంగారు తల్లులు మోసపోయిన తర్వాత బాధ పడాల్సిన అవసరం ఉండదు. పసి పిల్లల్లో కూడా ఆడతనాన్ని వెతుక్కుంటున్న రోజులు ఇవి. కాబట్టి మన పిల్లల్ని ప్రేమ(ఆకర్షణ) అనే వల నుండి కాపాడుకోవడానికి తల్లిదండ్రులు ప్రయత్నం చేయాలి… ప్రేమ అనేది మానసికంగా పూర్తి పరిణతి వచ్చిన తర్వాత వస్తుందని వారికి అర్థం అయ్యేలా చెప్తూ పెంచాలి.. ప్రేమ పేరుతో ఎలా మోసాలు జరుగుతాయో ఎలా ట్రాప్ చేస్తారో చిన్న వయసులోనే పిల్లలకు వివరించాలి. లేకుంటే మన పిల్లల గొయ్యి మనమే తవ్వుతున్నట్లు లెక్క.స్కూల్ లో పిల్లలు మారుతూ ఉంటారు కానీ పోరంబోకులు లోకల్ కాబట్టి మారరు. పిల్లలకు ప్రేమకు,ఆకర్షణకు ఉన్న తేడాను క్లియర్ గా చెప్తూ పెంచాలి. ఒక ఫ్రెండ్ లా తమ ఫీలింగ్స్ చెప్పుకునేంత చనువును పిల్లలకు ఇవ్వాలి. పిల్లలు ట్రాప్ లో పడకుండా జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత పేరెంట్స్ దే.. ఎందుకంటే మన పిల్లలే మన ఆస్తి…