ఆంధ్రప్రదేశ్ లో ఆది నుంచి ప్రత్యేకత కనిపిస్తుంది. ప్రధానంగా ప్రజల వ్యవహారశైలిలో ఉన్న ఆ ప్రత్యేకత రాజకీయాల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కుల రాజకీయాలకు పెద్ద పీట వేసే ఇక్కడి ప్రజలు మతాధారంగా మనుగడ కోసం ప్రయత్నం చేసేవారిని పెద్దగా ఆదరించిన దాఖలాలు లేవు. కార్గిల్ యుద్ధం సహా ఇతర కారణాలతో కొన్ని సార్లు బీజేపీకి పట్టం కట్టినప్పటికీ అది కూడా మతతత్వ విధానాలను ఆదరించినట్టు కాదని ఆ వెంటనే స్పష్టమయ్యింది. చివరకు దేశమంతా మోడీ, మతం సహా ఇతర అనేక అంశాల చుట్టూ తిరిగినా ఏపీ ప్రజలు మాత్రం ఒక్క శాతం ఓట్లను కూడా అందించేందుకు సిద్ధం కాలేదు. చివరకు స్వయంగా మోడీ వచ్చి ప్రచారం చేసిన గుంటూరు, రాజమండ్రి వంటి ప్రాంతాల్లో ఆపార్టీకి డిపాజిట్లు కూడా దక్కని స్థితి ఏర్పడింది.
మత సామరస్యానికి, సర్వ మత సమ్మేళనానికి ఏపీ ప్రజలు కొంత ప్రాధాన్యతనిస్తారు. అలాంటి ప్రజల మధ్య విభజన కోసం నేతల మత విశ్వాసాలను ఆధారంగా చేసుకోవాలని చూసిన ప్రతీసారి చెంపపెట్టు తప్పలేదు. వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో ఏడుకొండలకు ఏదో అయిపోయందంటూ ఆయన్ని వ్యక్తిగతంగా ఎదుర్కోలేని కొందరు మతాన్ని ముడిపెట్టి ఆరోపణలు గుప్పించారు. అయినప్పటికీ ఆయన సీఎంగా చేసిన పనులకే ప్రజలు పట్టం కట్టారు. వరుసగా రెండుసార్లు ఆయన నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ తిరుగులేని ఆధిక్యతను సాధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రావడమే కాదు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాల ప్రతిష్టాపనకు తోడ్పడింది.
అయినా పాఠాలు నేర్చుకోని కొందరు ప్రస్తుతం మళ్లీ మత రాజకీయాలను తమ మనుగడ కోసం మందుకు తెస్తున్నారు. ఏపీలో ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలకు ఒడిగడుతున్నారు. ఆక్రమంలో అవాస్తవాలను ఆధారంగా చేసుకుని, అపోహలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అడ్డగోలుగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. అలాంటి ప్రచారాలన్నీ ఇప్పటికీ బూమరాంగ్ అయ్యాయి. దానికి బాద్యులుగా కొందరు శిక్ష కూడా అనుభవించే పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ వెనక్కి తగ్గకుండా ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్పడం ద్వారా నిజం చేయాలనే గోబెల్స్ సూత్రాన్ని ఆచరిస్తున్నారు. అందుకు అనుగుణంగానే అంతర్వేది రథాన్ని ఆధారంగా చేసుకుని మతవిద్వేషాలకు ప్రయత్నం చేశారు. చివరకు హైదరాబాద్ సహా తెలంగాణా ప్రాంతీయులను కూడా తోడ్కొని వచ్చి రచ్చ చేయాలని చూశారు. రాళ్లు కూడా రువ్వారు. ఇతర మతాలకు చెందిన ప్రార్థనా మందిరాలపై దాడి చేసి రెచ్చగొట్టే యత్నం చేశారు
కానీ తీరా చూస్తే అవన్నీ నిరుపయోగం మారిపోయాయి. మరోసారి ఏపీ ప్రజలు తమ దూరదృష్టిని ప్రదర్శించారు. మత విద్వేషాల ఉచ్చులో ఇరుక్కోవడానికి తాము సిద్దంగా లేమని చాటిచెప్పారు. మతాల పేరుతో మనుషుల్ని విడదీయాలని చూసిన వారికి బుద్ధి చెప్పారు. అంతా సామరస్యంగా వ్యవహరించారు. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం స్పందించాలని ఆశించిన వారికి జగన్ నిర్ణయం సంతృప్తినిచ్చింది. కొత్త రథం నిర్మాణానికి కోటి రూపాయల ఖర్చుతో రంగంలో దిగడం, అదే సమయంలో కాలిపోయిన కేసులో సీబీఐ విచారణకు ఆదేశించడంతో విపక్షాల నోళ్లు మూతపడ్డాయి. సామాన్యుల ఆశలు నెరవేరాయి. దాంతో మత విభజన కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదని విద్వేషకులు కొంత ఖంగుతినాల్సి వచ్చింది.
జగన్ మతం ఆధారం చేసుకుని ఒక మతానికి భద్రత లేదనే ప్రచారం ఉధృతంగా చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్న విషయాన్ని సోషల్ మీడియా కూడా గుర్తించింది. దానికి తగ్గట్టుగానే అంతర్వేది అంశంలో మత సామరస్యానికి అనుగుణంగా స్పందించింది. విద్వేషాలు రాజేయడం కాకుండా అలాంటి ప్రయత్నం చేసిన వారందరికీ బుద్ధి చెప్పేలా ప్రతిస్పందన వచ్చింది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఇలాంటి చిన్న చిన్న అంశాలతో పెద్ద చిచ్చు రాజేసిన అనుభవం ఉన్న వారికి ఈ మత సామరస్యత ముకుతాడు వేసిందనే చెప్పాలి. అయినప్పటికీ వెనక్కి తగ్గకుండా బెజవాడ ఇంద్రకీలాద్రిపై రథం సింహం బొమ్మ మాయమయ్యిందనే మరో నిరాధార కథనం ముందుకు తెచ్చారు.
తద్వారా అమరావతి భూముల కుంభకోణంలో కేసులు పెడుతున్న వేళ ప్రజల దృష్టిని మరల్చడం, రెండోది ప్రజల్లో అపోహలు పెంచడమనే రెండు లక్ష్యాలతో ఇలాంటి ప్రయత్నాలు చేసినట్టు కనిపిస్తోంది. అయినప్పటికీ దేవాదాయ శాఖ అధికారులు వెంటనే అప్రమత్తం కావడం, ప్రజలు కూడా ఇలాంటి అంశాల్లో ఆలోచించేందుకు సిద్ధం కావడంతో ఏపీలో మత రాజకీయాలకు చోటు దక్కడం లేదు. తద్వారా ఏపీలో మతాల కన్నా రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమానికి ప్రజలు కూడా ప్రాధాన్యతనిస్తున్నారనే విషయం స్పష్టమవుతుంది.