ఇప్పటి జెనరేషన్ కు నక్సలిజం అంటే పెద్దగా అవగాహన ఉండకపోవచ్చు. కృష్ణవంశీ సిందూరం చూసి ఓహో ఇలా ఉండేవారా అని అనుకోవడం తప్పించి నిజంగా వాళ్ళ ఉద్దేశాలు ఏమిటో, సంవత్సరాల తరబడి అలా తుపాకులు పట్టుకుని అడవుల్లో ఉంటూ పోలీసులతో వ్యవస్థతో యుద్ధాలు ఎందుకు చేస్తారో అర్థం కావడం కష్టమే. అందులోనూ ఇప్పుడు ఇలాంటి ఉద్యమాలు తెలుగు రాష్ట్రాల్లో ఒకటి అరా ప్రాంతాల్లో తప్ప దాదాపు బలహీనపడ్డాయి. ముఖ్యంగా వీటిలో కీలక పాత్ర పోషించాల్సిన యువత ఉపాధి వేటలో పడి వీటి వైపు మళ్లేందుకు ఇష్టపడకపోవడంతో క్రమంగా ఈ నక్సల్ అనే కాన్సెప్ట్ తెరవెనుకకు వెళ్లిపోయింది.
అయితే దీన్ని ఆధారంగా చేసుకునే ఇప్పుడు రెండు సినిమాలు రాబోతున్నాయి. ఒకటి మెగాస్టార్ చిరంజీవి ఆచార్య. రెండు రానా విరాటపర్వం. చిరు మూవీలో కమర్షియల్ అంశాలు ఎక్కువగా ఉంటే రానా మూవీ అధిక శాతం సీరియస్ గా సాగుతూ కోర్ పాయింట్ మీద ఎక్కువ చర్చిస్తుంది. రెండింట్లో ఉన్న కామన్ థీమ్ మాత్రం నక్సలిజమే. ఆ మధ్య అప్పుడెప్పుడో పవన్ కళ్యాణ్ జల్సాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని దీని మీదే రన్ చేశాడు. అయితే కామెడీ ఎక్కువైపోవడంతో పాటు ఎంటర్ టైన్మెంట్ యాంగిల్ జోడించడంతో దాన్ని లోతుగా ఆలోచించిన వాళ్ళు తక్కువ.
కానీ ఆచార్య, విరాటపర్వంలో అలా కాదు. ఇద్దరి హీరోల లక్ష్యాలు చాలా బలంగా ఉంటాయి. మరి ఇప్పటి ప్రేక్షకులకు అంతగా తెలియని ఈ నక్సలిజం గురించి అర్థమయ్యేలా మెప్పించేలా ఎలా చెబుతారనేది ఆసక్తికరంగా మారింది. ఏ మాత్రం పోలికలు ఉన్నా లేట్ గా వచ్చేవాళ్లకు ఇబ్బందే. ఆల్రెడీ విడుదల తేదీలు ఫిక్స్ అయ్యాయి కానీ ఆఖరి నిమిషం దాకా ఏం జరుగుతుందో చెప్పలేం. ఒకే కాన్సెప్ట్ మీద బ్లాక్ బస్టర్స్ డైరెక్టర్ కొరటాల శివ, ఒకే సినిమా అనుభవం ఉన్న వేణు ఊడుగుల తలపడటం ఆసక్తి కలిగించే అంశం. మరి సీనియర్ జూనియర్ లాంటి చిరు రానాలు నక్సలైట్లుగా ఎలా కనిపిస్తారో వేచి చూడాలి