చంద్రబాబు యాధాలాపంగా అంటారో లేక ఉద్దేశ్యపూర్వకంగా అంటారో కానీ చరిత్ర కొలనులో రాయి వేసి ప్రకంపనాలు పుట్టిస్తారు.
నిన్న కృష్ణా జిల్లా సమీక్షా సమావేశంలో పార్టీలో గ్రూపు తగాదాలు సద్దుమణగకుంటే కఠిన చర్యలు తీసుకునంటానని,క్రమశిక్షణ తప్పినందుకు “ఆప్తుడైన మోహన్ బాబును కూడా సస్పెండ్ చేశా …పార్టీయే నాకు ముఖ్యం” అన్నారు.
చంద్రబాబుకు సన్నిహితులు ఎవరయినా ఉన్నారా?అని తరచుగా చర్చ జరుగుతుంటుంది.చంద్రబాబు ఇప్పుడు ఏకంగా మోహన్ బాబు తనకు ఆప్తుడు అన్నారు. దీనితో చంద్రబాబుతో మోహన్ బాబు వివాదాలు మరోసారి చర్చకు వచ్చాయి.
మోహన్ బాబు ఎన్టీఆర్ కు అనుచరుడు,శిష్యుడు,ఆప్తుడు కూడా.లక్ష్మి పార్వతితో ఎన్టీఆర్ వివాహాన్ని అడ్డుకోవటానికి ఎన్టీఆర్ సంతానం,చంద్రబాబు వర్గం గట్టిప్రయత్నాలు చేసింది. తిరుపతిలో మేజర్ చంద్రకాంత్ సినిమా శతదినోత్సవ సభ జరుగుతుండగా మోహన్ బాబు లక్ష్మి పార్వతిని వేదిక మీదికి తీసుకెళ్లారు.ఎన్టీఆర్ లక్ష్మి పార్వతిని వివాహం చేసుకుంటున్నానని ప్రకటించి ఆవిడ మెడలో దండ వేశారు. అది ఎవరూ ఊహించని పరిణామం,చంద్రబాబుకు మింగుడుపడని సంఘటన. లక్ష్మి పార్వతితో ఎన్టీఆర్ వివాహం గురించి ముందుగా తెలిసినా తనకు చెప్పలేదని చంద్రబాబు మోహన్ బాబు మీద మండిపడ్డారు.ఇద్దరు బాబుల మధ్య అంత ఆప్యాయత ఉండేది.
చంద్రబాబు,మోహన్ బాబు మధ్య ఎలాంటి సాన్నిహిత్యం లేదా?
ఒకే జిల్లా,ఒకే నియోజకవర్గం నుంచి వచ్చిన చంద్ర బాబు,మోహన్ బాబుల మధ్య సాన్నిహిత్యం ఉండేది. చంద్రబాబు 1992లో “హెరిటేజ్” సంస్థను ప్రారంభించినప్పుడు మోహన్ బాబు కూడా అందులో పెట్టుబడిపెట్టారు.మోహన్ బాబుతో పాటు అప్పటి టీడీపీ నాయకులు బోళ్ల బుల్లిరామయ్య ,చుండ్రు శ్రీహరి(హరి కృష్ణ వియ్యంకుడు),మోహన్ బాబు మరియు మోటపర్తి శివరామ వరప్రసాద్(పనామ లీక్స్ లో ఆరోపణలు ఉన్న చార్టెడ్ అకౌంటెంట్)హెరిటేజ్లో డైరెక్టర్లుగా ఉండేవారు. కాలక్రమేణా ఒక్కక్కరు తప్పుకొని లేక తప్పించబడి హెరిటేజ్ చంద్రబాబు సొంత సంస్థగా మారిపోయింది.
చంద్రబాబుకు మోహన్ బాబుకు ఎక్కడ చెడింది?
లక్ష్మిపార్వతి పెళ్లి సమయం నుంచి ఇద్దరు బాబుల మధ్య అభిప్రాయబేధాలు వచ్చినా పెద్ద విబేధాలు లేవు. వైశ్రాయ్ కుట్రలో మోహన్ బాబు చంద్రబాబు వైపు నిలిచారు. రజినీకాంత్ ను ఎన్టీఆర్ వద్దకు తీసుకెళ్లి లక్ష్మిపార్వతిని దూరంగా పెట్టమని చెప్పించాడు. చర్చల తరువాత రజినీకాంత్ “దుష్ట శక్తి” అని లక్ష్మి పార్వతిని అన్నాడు. వైశ్రాయ్ సంఘటనకు కొన్ని నెలల ముందే మోహన్ బాబును ఎన్టీఆర్ రాజ్యసభకు పంపించటం గమనార్హం.
ఎన్టీఆర్ ను గద్దె దించిన తరువాత చంద్రబాబు వర్గం నిజాం కాలేజి గ్రౌండులో పెద్ద బహిరంగ సభ జరిగింది. ఆ సభలో మోహన్ బాబు మాట్లాడుతూ ఎమ్మెల్యేలు తనవద్దకొచ్చి కన్నీరుపెట్టుకోవటంతో సరే ఎన్టీఆర్ ను దించుదామని అన్నానని చెప్పారు. చంద్రబాబు ఇలాంటి వాళ్ళను ఎంతమందిని వాడుకొని ఉంటాడు!చంద్రబాబు బహిరంగంగానే ఎప్పుడు అనే “కత్తిరించేస్తాను”ను ఆరోజు మనసులో అనుకోని ఉంటాడు.
మోహన్ బాబు మీద క్రమశిక్షణ చర్యలు
1997 మే నెల చివరి రోజుల్లో టీడీపీ నాయకుడు చంద్రబాబు సన్నిహితుడైన అప్పటి తిరుపతి మున్సిపల్ చైర్మన్ శంకర్ రెడ్డిని SV university VC బంగ్లాలో కొట్టాడు. శంకర్ రెడ్డి,మోహన్ బాబుకు ఇవ్వవలసిన డబ్బులను ఇవ్వకుండ ఇబ్బంది పెట్టాడంట.
బొజ్జల గోపాల కృష్ణారెడ్డి మద్దతు ఇవ్వటంతో శంకర్ రెడ్డి మోహన్ బాబు మీద కేసు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత డీజీపి గౌతమ్ సావంగ్ ఈ సంఘటన జరిగినప్పుడు చిత్తూర్ జిల్లా SP గా ఉండేవారు. ఆయన ఆదేశాలతో మోహన్ బాబును పోలీసులు ఆరెస్ట్ చేశారు .
ఎన్టీఆర్ ను దించి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తొలిరోజుల్లో పరిస్థితి ఇప్పటిలా ఉండేది కాదు.ప్రజలు ఎవరిని ఎప్పుడు ఎలా ఆదరిస్తారోనన్న సంశయం ఎక్కువగా ఉండేది. మోహన్ బాబు .రేణుకా చౌదరి ఇలాంటి ఫైర్ బ్రాండ్ నాయకులతో ఆచి తూచి వ్యవహరించాల్సి వొచ్చేది.
1995లో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి పార్టీ మీద పూర్తి పట్టుకోసం చంద్రబాబు ప్రయత్నించేవారు. ఎవరైనా పార్టీ మాట ధిక్కరిస్తే సహించేవాడు కాదు,స్పాట్లో సస్పెండ్ చేసేవాడు.టీడీపీకి చెందిన మున్సిపల్ చైర్మన్ను టీడీపీకే చెందిన రాజ్యసభ సభ్యుడు కొట్టాడని పత్రికల్లో వచ్చింది. తిరుపతిలో బందు కూడా జరిగింది. అప్పట్లో ఇప్పటిలా అడ్డంగా మాట్లాడే సంస్కృతి లేదు. మొత్తానికి మూడు నాలుగు రోజుల తర్జన భర్జనలు తరువాత సోలిపేట రామచంద్రా రెడ్డి,మింటే పద్మనాభం,రుమాండ్ల రామచంద్రయ్య (ముగ్గురు వేరు వేరు సంవత్సరాల్లో రాజ్యసభకు ఎన్నికయ్యారు ) లతో ఒక విచారణ కమిటీ వేశారు.
మీరు కమిటీ వేస్తే నేను వచ్చేది ఏంటి?నా రూటే సపరేటు అంటూ మోహన్ బాబు రెండుసార్లు విచారణకు హాజరు కాలేదు.చివరికి మూడోసారి పిలిస్తే వెళ్లి మీరు నన్ను విచారణ చెయ్యటం ఏంటి?నా స్థాయి ఏంటి అంటూ సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడు.
మోహన్ బాబు మెలోడ్రామా
క్రమశిక్షణ సంఘం ముందు హాజరయిన మోహన్ బాబు టీడీపీలో అవినీతిపరులకు,బ్రోకర్లకు విలువ పెరిగిందని,పార్టీ అవినీతికి నిలయం అయ్యిందని దీనికి వ్యతిరేకంగా తానూ పోరాడతానని చెప్పాడు.
1997 గాంధీ జయంతి రోజున మోహన్ బాబు టీడీపీతో సహా అన్ని రాజకీయపార్టీల్లో అవినీతి అంతం తన లక్ష్యం అని ప్రకటించి ఎన్టీఆర్ విగ్రహం ముందు ఒకరోజు దీక్ష చేశాడు. ఈ దీక్షలో ప్రాయశ్చిత్తం పేరుతొ మోహన్ బాబు డ్రామా సృష్టించారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచానని దానికి క్షమించాలని ఎన్టీఆర్ విగ్రహాన్ని వేడుకున్నారు.టీడీపీ అవినీతి నిలయంగా మారిందని చంద్రబాబు మీద అవినీతి ఆరోపణలు చేశారు. కొత్త పార్టీ పెడతానని కూడా మోహన్ బాబు ప్రకటించారు. ఈ పరంపర కొనసాగి తుదకు మోహన్ బాబు టీడీపీ నుంచి బహిష్కరణకు గురయ్యాడు.చంద్రబాబు వర్గం టీడీపీ వలన దక్కిన రాజ్య సభ స్థానానికి రాజీనామా చేసి మాట్లాడాలని ఛాలెంజ్ చేశారు. అన్నగారు ఇచ్చిన రాజ్యసభ సీటును వీడనని మోహన్ బాబు పూర్తికాలం కొనసాగారు.
టీడీపీ నుంచి మోహన్ బాబు బహిష్కరణ తరువాత కొంత హడావుడి చేసిన మోహన్ బాబు తరువాత రాజకీయాలను వదిలి సినిమాల మీద పూర్తిగా దృష్టిపెట్టారు. 1997 నవంబరులో శ్రీరాములయ్య సినిమా షూటింగ్ ప్రారంభోత్సవంలో పరిటాల రవి లక్ష్యంగా జరిగిన జరిగిన బాంబు దాడిలో పరిటాల రవితో పాటు,మోహన్ బాబు తప్పించుకున్నాడు.ఈదాడి మోహన్ బాబుకు సానుభూతి తెస్తుందేమోనని బాబు భయపడ్డారు కానీ మోహన్ బాబు రాజకీయంగా స్తబ్దుగా ఉండిపోయారు.
రాజ్యసభ సభ్యుడికి కేంద్రం ఇచ్చే నిధులతో ఎంపీలు తమ పరిధిలో నిధులు వినియోగిస్తుంటారు. మోహన్ బాబు ఎంపీ నిధులతో తన శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజి కి కంప్యూటర్లు కొన్నారు. దీని మీద సీఎం పేషీ అధికారులు తనిఖీ చేశారు. కానీ ప్రైవైట్ లేక ప్రభుత్వ కాలేజీలకు ఎంపీ నిధులతో కంప్యూటర్లు కొని ఇవ్వొచ్చని నిబంధన ఉందట. దీనితో మోహన్ బాబు మీద ఎలాంటి కేసు నమోదు కాలేదు. అలాంటి నిబంధన లేకుండా ఉండి ఉంటే మోహన్ బాబుకు చంద్రబాబు కక్ష సాధింపు ఎలా ఉంటుందో తెలిసేది.
దాదాపు నాలుగైదు సంవత్సరాలు చంద్రబాబును కలవని మోహన్ బాబు 2003లో విష్ణు తొలి సినిమా షూటింగ్ ప్రారంభోత్సవానికి పిలిచారు. ఇద్దరు బాబులు కౌగలించుకొని మంచి మిత్రులం అని చెప్పారు.
2003 తరువాత అప్పుడప్పుడు చిరంజీవి మీద, చంద్ర బాబు మీద చమక్కులు వేస్తూ వార్తల్లో నిలిచిన మోహన్ బాబు 2018 చివరిలో వైసీపీ లో చేరారు. అంటే రాజ్యసభ కాలం ముగిసిన 17 సంవత్సరాల తరువాత మోహన్ బాబు రాజకీయ పార్టీ జండా కప్పుకున్నారు.
ఇది మోహన్ బాబు రాజకీయ చరిత్ర,చంద్ర బాబుతో ఉన్న విబేధాలు & సాన్నిహిత్యం… ఒక వయస్సు వచ్చిన తరువాత పాత గొడవలు మర్చిపోవటం సహజం,మంచిది కూడా . కానీ లేని సాన్నిహిత్యాన్ని ప్రకటించుకోవడం అనవసరం.