జమ్మూ కశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితులను అక్కడి ప్రజలు ఎల్లకాలం భరించలేరని, తప్పనిసరిగా ఈ స్థితి మారాలని జర్మనీ స్పష్టం చేసింది. భారత్‌తో ప్రభుత్వ స్థాయి చర్చల అనంతరం జర్మనీకి చెందిన జర్నలిస్టులతో మాట్లాడిన చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ఈ విషయమై తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వివరించారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీతో జరిపే ‘పరిమిత సమావేశం’లో తాను ప్రస్తావిస్తానని అంటూ దీనికి ముందు అక్కడి పరిస్థితులు మెరుగుపరచేందుకు ఏఏ చర్యలు తీసుకొంటున్నారో, భారత ప్రభుత్వ ప్రణాళికలేంటో తెలుసుకుంటానని ఆమె చెప్పారు. కశ్మీర్‌పై భారత వైఖరి తనకు తెలుసనని ఆమె పేర్కొన్నారు. ఐరోపా దేశాల కూటమిలో కీలక దేశమైన జర్మనీ అధినేత నుంచి ఈ మాటలు రావడం విశేషమని దౌత్యవర్గాలంటున్నాయి. కాగా- కశ్మీర్‌లో పరిస్థితులను, పాక్ కుయత్నాలను, సాధారణ స్థితిని తెచ్చేందుకు తాము తీసుకుంటున్న చర్యలను మోదీ ఆమెకు వివరించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే కశ్మీర్ విషయం ప్రభుత్వ ప్రతినిధుల స్థాయి చర్చల సమావేశంలో ప్రస్తావనకు రాలేదు.