15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల పోలింగ్ గురువారం ప్రారంభం అయింది. ఉదయం 7 గంటలకే ఓటర్లు బారులు తీరారు. గత సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన17 మంది శాసనసభ్యులు తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయడంతో జేడీ(ఎస్), కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. దీంతో అప్పటి స్పీకర్ రమేష్ కుమార్ వీరిపై అనర్హత వేటు వేశారు. దీంతో ఎమ్మెల్యే లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ గ్రీన్ సిగ్నల్ లభించడంతో బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. మస్కి, రాజరాజేశ్వరి నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితా తప్పుల తడక గా ఉందని ఎన్నికలు వాయిదా వేశారు. 15 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్, జేడీ(ఎస్) పార్టీల అభ్యర్థులు బరిలో నిలిచారు.
ఉప ఎన్నికల సందర్భంగా బెంగళూరు పోలీసు కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ ను అమలు చేస్తున్నారు. అతానీ, కాగ్వాద్, గోకక్, ఎల్లాపూర, హిరికెరూర్, రాణిబెన్నూర్, విజయనగర, చిక్ బళ్లాపుర, హోస్కేటే, కేఆర్ పేట, హున్సూర్, మహాలక్ష్మీ లేఅవుట్, కేఆర్ పురం, శివాజీనగర్, యశ్వంత్ పూర్ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల పోలింగ్ పోలీసుల భారీ బందోబస్తు మధ్య సాగుతోంది. 323 ఫ్లైయింగ్ స్క్వాడ్, 578 పోలీసు బృందాలు బందోబస్తు నిర్వహిస్తున్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు.
ఉప ఎన్నికల్లో గెలుపు కోసం మూడు పక్షాలు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయి.పర్యవసానంగా పలుచోట్ల ఘర్షణ వాతావరణం నెలకొన్నది.నిన్న నలుగురు బీజేపీ కార్యకర్తల మీద హత్యాయత్నం చేశారంటూ మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ మనవడు సూరజ్ రేవన్నపై పోలీసులు కేసు నమోదు చేశారు. హసన్ జిల్లాలోని చన్నరాయపట్న పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది. జేడీఎస్ నుంచి బీజేపీలోకి మారిన కార్యకర్తల ఇళ్లపై దాదాపు 150–200 మంది వచ్చి దాడి చేశారని, ఆస్తులను ధ్వంసం చేశారని బీజేపీ ఆరోపించింది. గాయపడిన తమ కార్యకర్తలను ఆస్పత్రికి తరలించామని చెప్పారు. సరైన సమయానికి పోలీసులు రాకపోయి ఉంటే పరిస్థితి మరింత చేజారేదని అన్నారు. దీంతో సూరజ్ సహా ఆరు మందిపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. అయితే ఈ ఆరోపణలను జేడీఎస్ ఖండించింది.
ఈ 15 స్థానాలలో బీజేపీ కనీసం ఆరు స్థానాలు గెలవాలి లేని పక్షంలో యడ్యూరప్ప ప్రభుత్వం మైనారీటీలో పడుతుంది.