డిసెంబర్ 5న రాష్ట్రముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనంతపురం రానున్నారు. అనంతపురం జిల్లా పెనుకొండ సమీపం లో నెలకొల్పిన కియా మోటార్స్ గతంలో సీఎం చేతుల మీదుగా ప్రారంభం కావాల్సి ఉండగా అనివార్య కారణాలతో సీఎం కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. కాగా ఈ దఫా కియా మోటర్స్ కంపెనీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, జిల్లా ఎస్పీ సత్య యేసుబాబు, కియా మోటార్స్ లీగల్ హెడ్ జుడ్ అధికారులతో సమీక్షించారు.
ముఖ్యంగా కియా కంపెనీ లో నిర్వహించే ప్రారంభోత్సవ కార్యక్రమాలను జూడ్ కలెక్టర్ కు వివరించారు. 5వ తేదీ ఉదయం 11 గంటల నుండి 2.30 గంటల వరకు ప్లాంట్ టూర్, ప్రారంభోత్సవ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. సీఎం రాక సందర్భంగా ఏర్పాట్లు పక్కాగా చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పుట్టపర్తి ఎయిర్పోర్ట్, కియా కంపెనీ లో కార్యక్రమాల ఏర్పాట్లను నిర్వహించేందుకు సీనియర్ అధికారులకు విధులు కేటాయించాల్సిందిగా డీఆర్వో సుబ్బారెడ్డిని ఆదేశించారు. భద్రతా అంశాలపై ఎస్పీతో చర్చించారు.