ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన పరిపాలనతో విజయవంతమయ్యారు. ప్రజల మన్ననలు పొందారు. అవినీతి నిర్మూలనకు రాజీలేని నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ప్రభుత్వాన్ని విజయవంతంగా నడుపుతున్న వైఎస్ జగన్ ఎక్కువ సమయం పాలన చేయడంలోనే నిమగ్నమవుతున్నారు. పార్టీ కోసం తగినంత సమయం కేటాయించడంలేదు. పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలకు తగినంత గుర్తింపు రావడంలేదు.
పైన పేర్కొన్న మాటలు ఇటీవల కాలంలో తరచూ వినిపిస్తున్నాయి. ఎన్నికలు ముగిసి, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుతో ఏడు నెలలైంది. ఐదేళ్ల పాలనా కాలంలో ఏడు నెలలు చాలా తక్కువ సమయం. అయినా సీఎం జగన్ తొలి రోజు నుంచే పానలలో తనదైన ముద్ర వేస్తున్నారు. స్పష్టమైన, వేగవంతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వాటిని నిర్థిష్ట సమయంలో నిబద్ధతతో అమలు చేస్తున్నారు.
ఎన్నికల మెనిఫెస్టోను బైబిల్‌గా, ఖురాన్‌గా, భగవద్గీతగా భావిస్తామని ఎన్నికల ముందే చెప్పిన వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ మాటలను అక్షరం పొల్లుపోకుండా ఆచరిస్తున్నారు. తాను మాటల ముఖ్యమంత్రిని కాదని చేతల వ్యక్తినని ఇప్పటికే రుజువు చేసుకున్నారు. రాజకీయంలో తరం మారిందనే సంకేతాలు పంపేలా మెనిఫెస్టోలో పెట్టిన అంశాలను పగ్గాలు చేపట్టిన ప్రారంభంలోనే అమలు చేశారు. 151 సీట్లు ఇచ్చి తనపై ప్రజలు ఉంచిన విశ్వాసాన్ని మరింత పెంచుకున్నారు.
ఎన్నికల ఫలితాల అనంతరం జూన్ 7వ తేదీన నిర్వహించిన వైఎస్సార్‌శాసన సభాపక్ష సమావేశంలో 151 మంది ఎమ్మెల్యేలను ఉద్దేశించి సీఎం జగన్ కీలక ప్రశంగం చేశారు. పార్టీ, ప్రభుత్వం రెండు కళ్లు అని ఆ సమావేశంలో చెప్పారు. ఈ రెండింటిలో ఏ ఒక్కటీ లేకున్నా మనుగడ సాధ్యం కాదని స్పష్టం చేశారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా పని చేయాలని మార్గనిర్ధేశం చేశారు. స్థానిక ఎన్నికల్లో గెలవడం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేసుకోవచ్చన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు 50 శాతం ఓట్లు ఇవ్వగా వచ్చే ఎన్నికల్లో అంతకు మించి ఓట్లు శాధించాలని లక్ష్యం నిర్ధేశించారు.
ఫలితాలు ముగిసిన వారం రోజులకు నిర్వహించిన శాసన సభా పక్ష సమావేశంలో సీఎం జగన్ చెప్పిన మాటలు ప్రభుత్వం నిర్వహణలో 100 శాతం పక్కాగా అమలు చేస్తున్నారు. కానీ పార్టీ విషయంలో ఆంత శ్రద్ధ కనిపించడంలేదన్నది ఏపీ రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తున్న విశ్లేషకులు చెబుతున్నమాట. పార్టీ కార్యకర్తల్లో కూడా ఇదే రకమైన భావన ప్రారంభమవుతోంది. ఎన్నికలకు ముందు పార్టీ ఒక్కటే. ఎన్నికల తర్వాత పార్టీతోపాటు ప్రభుత్వం. ఈ రెండింటì కి సమానమైన ప్రాధ్యానత్య దక్కడంలేదన్నది వైఎస్సార్‌సీపీ సానుభూతి పరులు చెబుతున్న మాట. ఇందుకు వారు పలు అంశాలను ప్రస్తావిస్తున్నారు.
ఎన్నికలు ముగిసి ఏడు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు సీఎం జగన్ పార్టీ కార్యకర్తలతో సమావేశమవ్వలేదు. ఎన్నికలకు మందు పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ, వారికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన జగన్ ప్రభుత్వం ఏర్పడ్డాక కార్యకర్తలకు దూరం అయ్యారని చెప్పొచ్చు. ముఖ్యమంత్రి హోదాలో జగన్‌ను కలిసేందుకు అవకాశం ఉండడంలేదు. ఈ నేపథ్యంలో పార్టీ సమావేశాలు నిర్వహించి ఉంటే పార్టీ అధ్యక్షుడిగా జగన్‌కు దగ్గరగా ఉన్నామన్న భావన కార్యకర్తలో ఉంటుంది.
గెలిచిన నియోజకవర్గాలే కాదు ఓడిపోయిన నియోజకవర్గాల్లో కూడా పార్టీ తరఫున సమీక్షా సమావేశాలు నిర్వహించలేదు. ఓటమికి గల కారణాలను ముఖ్యనేతలతో అంతర్గతంగా చర్చించినా.. కార్యర్తల నుంచి ఓటమికి గల కారణాలు, లోపాలు, వాటిని అధిగమించేందుకు చేయాల్సిన పనులపై సలహాలు తీసుకోలేదు. రాజమహేంద్రవరం, పర్చూరు నియోజకవర్గాల్లో కో ఆర్డినేటర్లను మార్చారు కానీ కార్యకర్తలతో మాత్రం సమావేశమవ్వలేదు. సీఎం జగన్ కాకపోయిన పార్టీ ముఖ్యనేతుల, లేదా ఆ జిల్లాల ఇన్‌చార్జిలు, రీజనల్ కో ఆర్డినేటర్లు కూడా సమావేశాలు నిర్వహించకపోవడం ఇక్కడ గమనించాల్సిన విషయం.
పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్యకారణం కార్యకర్తలు అన్న విషయం ఎవరైనా సరే ఒప్పుకోవాల్సిందే. అదే విషయం సీఎం జగన్ శాసనసభా పక్ష సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలకు చెప్పారు. కానీ ఆచరణలో మాత్రం కార్యకర్తలకు ఇచ్చే ప్రాధాన్యం కనిపించడంలేదు. ఎన్నికలు ముగిసిన వెంటనే తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించింది. అనంతరం జిల్లాల పర్యటన కూడా ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పూర్తి చేశారు. 2003 నుంచి 2014 వరకు 11 ఏళ్లపాటు అధికారానికి దూరంగా ఉన్నా కూడా టీడీపీ తిరిగి అధికారంలోకి వచ్చిందంటే ఆ పార్టీకి ఉన్న బలమైన క్యాడరే ప్రధాన కారణం.
అవమానాలు, అణచివేతలు, వేధింపుల మధ్య పుట్టిన వైఎస్సార్‌సీపీ తొలి ఎన్నికల్లో అధికారంలోకి రాకపోవడంతో ఇక పని అయిపోయిందనుకున్నారు. కానీ పార్టీ అధ్యక్షుడిగా జగన్ దృఢ సంకల్పం, పార్టీ కార్యకర్తల తెగింపు, ఉద్యోగాలను కూడా వదిలేసి పార్టీ కోసం పని చేసిన తీరుతో 9 ఏళ్ల సుదీర్ఘ పయనం తర్వాత వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చింది.
గత ఎన్నికల్లో నగదు ఖర్చు చేసిన వారున్నారు. సమయం వెచ్చిన వారున్నారు. పార్టీ కోసం బంధువులను ఎదిరించిన వారున్నారు. పార్టీ కోసం రక్తం చింధించిన వారున్నారు. ఉద్యోగాలు వదిలేసి పని చేసినవారున్నారు. వారంలో ఐదు రోజులు ఉద్యోగం చేసి వారంతంలో రెండు రోజులు పార్టీ కోసం పని చేసేందుకు బెంగుళూరు, హైదరాబాద్, చెన్సై నగరాల నుంచి రాష్ట్రంలోని పల్లెలకు వచ్చిన ఉద్యోగులున్నారు.
చంద్రబాబు ప్రభుత్వం కేసులు పెడితే జైలుకు వెళ్లినవారున్నారు. వీరే పార్టీకి అసలైన బలం. ఇప్పుడు వారందరినీ కాపాడుకోవాల్సిన అవసరం పార్టీకి ఎంతో ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పార్టీ కార్యర్తలతో జిల్లాల వారీగా అయినా సీఎం జగన్ సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని వైఎస్సార్‌సీపీ సానుభూతి పరులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఒక్క మాటలో చెప్పాలంటే… 2003 ఎన్నికల్లో గెలిచిన వెంటనే ఓ బహిరంగ సభలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక మాట చెప్పారు. ‘‘ పార్టీ కోసం 9 ఏళ్లుగా కార్యర్తలు పని చేశారు. అధికారపార్టీ పెట్టిన కేసులు ఎదుర్కొని పార్టీ కాపాడుకోవడంలో వారు ఆర్థికంగా చాలా నష్టపోయారు. అలాంటి కార్యకర్తలను జిల్లా ఇన్‌చార్జి మంత్రులు గుర్తించండి. వారికి కాంట్రాక్టులిచ్చి ఆర్థికంగా నిలదొక్కునేలా చేయండి. వారికి అన్ని విధాలా అండగా ఉండండి’’ అని కార్యకర్తల్లో ఎనలేని భరోసా, ధైర్యాన్ని నింపారు. ఇప్పుడు ఆయన తనయుడు కూడా వైఎస్సార్‌సీపీ కార్యకర్తల్లో ధైర్యాన్ని, భరోసాను నింపాల్సిన సమయం.