1996లో వచ్చిన కమల్ హాసన్ బ్లాక్ బస్టర్ మూవీ భారతీయుడుకి సీక్వెల్ గా రూపొందుతున్న ఇండియన్ 2 షూటింగ్ లాక్ డౌన్ ఎత్తేసి నాలుగు నెలలు అవుతున్నా ఇంకా పునఃప్రారంభం కాలేదు. ఇంతకీ కొనసాగుతుందా లేదా అనే అనుమానాలు కూడా ఇండస్ట్రీలో బలంగా ఉన్నాయి. పైకేమో అరవై శాతం పూర్తయ్యిందంటున్నారు. కానీ ఆ బ్యాలన్స్ ఫినిష్ చేసే సూచనలు మాత్రం కనిపించడం లేదు. దర్శకుడు శంకర్ ఇప్పటికే ఇతర హీరోలతో తన కొత్త ప్రాజెక్టు దిశగా అడుగులు వేస్తున్నట్టు చెన్నైలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఆయన లిస్టులో ఫస్ట్ మన రామ్ చరణే ఉన్నాడట. ఓ లైన్ కూడా వినిపించినట్టు వినికిడి.
గతంలో ఇదే తరహాలో కమల్ హాసన్ ఎంతో అట్టహాసంగా శభాష్ నాయుడు అనే సినిమాను సగం దాకా తీసుకొచ్చి ఆపేశాడు. దశావతారం సినిమాలో క్యారెక్టర్ ని స్ఫూర్తిగా తీసుకుని దాన్నే ఫుల్ లెన్త్ రోల్ గా డెవలప్ చేశారు. అందులో శృతి హాసన్ కూడా నటించింది. అయితే ఇది జరుగుతున్న టైంలోనే కమల్ ఇంట్లోనే ఓ ప్రమాదానికి గురి కావడం, ఎక్కువ కాలం బెడ్ రెస్ట్ లో గడపాల్సి రావడంతో ఇది కాస్తా అటకెక్కింది. మళ్ళీ కంటిన్యూ చేసే ఉద్దేశం లేదన్నట్టుగా దాన్నలాగే వదిలేశారు. ఇప్పుడు ఇండియన్ వ్యవహారం చూస్తుంటే కూడా అదే సందేహం రావడం సహజం. కానీ యూనిట్ మాత్రం మౌనంగా ఉంది.
ఇదే కాదు ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం కూడా మరుదనాయగంని కోట్లాది రూపాయల బడ్జెట్ తో మొదలుపెట్టి కొంతభాగం షూటింగ్ చేసి అచ్చం ఇదే తరహాలో ఆర్థిక కారణాలు చూపించి ఆపేశారు. ఇళయరాజా కంపోజ్ చేసిన మ్యూజిక్ లో కొంతభాగం యుట్యూబ్ లో అందుబాటులో ఉంది కూడా. మరి ఇండియన్ 2 ని కూడా ఇదే తరహాలో శభాష్ నాయుడు, మరుదనాయగం బాటలో పట్టిస్తారేమో అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కమల్ ప్రస్తుతం ఖైదీ-మాస్టర్ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విక్రమ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీని షూట్ వేగంగా జరుగుతోంది. దీపావళికి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి