Idream media
Idream media
పంచాయతీ ఎన్నికల ఫలితాలతో టీడీపీ పరువు పోతుండడంతో ఏదో రకంగా గారడీ చేసి ఆ పార్టీకి ప్రజల్లో ఆదరణ ఉందని చాటుకోవడానికి సైబర్ నేరాలను కూడా ప్రోత్సహిస్తోందనే ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. ఆయా పార్టీ నేతలు, ఆ పార్టీకి వంత పాడే మీడియాలో అసలు లెక్కలకు బదులు తప్పుడు లెక్కలను చూపెడుతున్న వైనాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమక్షంలో ఫొటోలతో సహా చూపించారు. అయితే.. ఏకంగా అధికార పార్టీకి చెందిన వెబ్ సైట్ ను పోలిన విధంగా నకిలీ వెబ్ సైట్ సృష్టించి తెలుగుదేశానికి అధిక స్థానాలు, వైసీపీకి తక్కువ స్థానాలను అప్ లోడో చేస్తూ ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నట్లు వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటీవల ysrcppolls.in వెబ్‌సైట్‌ను రూపొందించిందని, అయితే కొందరు వ్యక్తులు ysrcppolls.com తయారు చేసి తప్పుడు సమాచారాన్ని పొందుపరిచారని, తప్పుడు వెబ్‌సైట్ క్రియేట్ చేసిన వారిపై సైబర్ నేరాల చట్టం కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇప్పటికే సీబీసీఐడీ అధికారులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
ఇప్పుడు తాజాగా ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చేస్తున్న ఆరోపణలు రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. వైసీపీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెబ్‌సైట్‌కు ఫేక్‌గా టీడీపీ మరో వెబ్‌సైట్‌ను సృష్టించిందని, చంద్రబాబునాయుడు ఫేక్ వెబ్‌సైట్‌తో ప్రజలను మోసం చేయటానికి ప్రయత్నిస్తున్నారని సజ్జల మండిపడ్డారు. టీడీపీ ఫేక్ వెబ్‌సైట్‌పై సీఐడీకి పార్టీ తరఫున ఫిర్యాదు చేశామని తెలిపారు. చంద్రబాబు ప్రజల తీర్పును చాలా నీచంగా వక్రీకరిస్తున్నారని, అసత్యాలు, అబద్దాలను బరితెగించి ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ సీఎం జగన్ పాలనలో అందరకీ సంక్షేమ ఫలాలు అందాయి. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పే ఇందుకు ఉదాహరణ. రెండో విడత ఎన్నికల్లో కూడా 80 శాతం విజయం సాధించాం. 2649 మంది వైఎస్ఆర్‌సీపీ మద్దతుదారులు గెలిచారు. టీడీపీ 538, బీజేపీ 5, జనసేన 35, ఇతరులు 98 మంది గెలిచారు. పార్టీ వెబ్‌సైట్‌లో పార్టీ మద్దతుదారుల ఫోటోలు కూడా ఉంచుతున్నాం. రెండో దశ ఎన్నికల ఫలితాలపై కూడా ..చంద్రబాబు పచ్చి అబద్దాలు చెబుతున్నారు. మీడియా ద్వారా చర్చకు రమ్మని సవాల్ విసిరాం”. అని చెబుతున్నారు.
ఈ ఎన్నికల ఫలితాల్లో రాష్ట్రంలో టీడీపీ పూర్తిగా కనుమరుగైందని, టీడీపీ నేతలు పార్టీ నుంచి వెళ్లిపోకూడదని.. టీడీపీలోని నేతలను భ్రమలో పెట్టాలనే చంద్రబాబు ఉద్దేశమని, అసత్యాలు, అబద్దాలను బరితెగించి చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. సాక్షాత్తూ చంద్రబాబు తీసుకొచ్చిన ఎస్‌ఈసీనే ..ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని చెబుతున్నారు. ‘‘ప్రజాస్వామ్యం ఎక్కడ ఖూనీ అయిందో చంద్రబాబు చెప్పాలి. ఓటమిని కూడా సెలబ్రేట్ చేసుకున్న నేత కూడా చంద్రబాబు ఒక్కరే. మరో 30 ఏళ్లు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాలన కావాలని ప్రజలు భావిస్తున్నారు. వచ్చే రెండు దశల ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్‌సీపీ మద్దతుదారులదే గెలుపు. రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్‌సీపీదే విజయం’’ అని అన్నారు.
సజ్జల ఆరోపించినట్లు అది తెలుగుదేశం పనా..? కాదా..? అనేది పక్కన బెడితే ఫలితాల ప్రచారం కోసం ఇతర పార్టీకి చెందిన వెబ్ సైట్ ను పోలిన విధంగా ఫేక్ వెబ్ సైట్ ను సృష్టించడం రాజకీయాలలో కొత్త ట్రెండ్ కు అద్దం పడుతున్నాయి. ప్రజల తీర్పును పక్కన బెట్టి.. ఎవరికి వారు తమ పార్టీకే ఎక్కువ సీట్లు వచ్చాయని చెప్పుకుని మాయ చేయడానికి కొత్త తరహా దారులను ఎంచుకోవడం చర్చనీయాంశం అవుతోంది. వాస్తవానికి ఎన్నికల సంఘం దీనిపై చాలా సీరియస్ గా స్పందించాల్సిన అవసరం ఉంది. ఫలితాలను ఇలా ఎవరికి వారు నచ్చిన విధంగా ప్రకటించుకోవడం కారణంగా ఓట్లు వేసిన ప్రజలు గందరగోళానికి గురవుతారు. వైసీపీ నేతల ఫిర్యాదుపై సీబీసీఐడీ అధికారులు విచారణ చేపడుతున్నారు. మరి ఎన్నికల సంఘం ఈ నకిలీ వెబ్ సైట్లలోని నకిలీ ఫలితాలపై స్పందిస్తుందో లేదో చూడాలి.