అసలే అమెరికా. నోరు తెరిస్తే ఇంగ్లీష్…నోరు మూస్తే ఇంగ్లీష్. కళ్లు తెరిస్తే ఇంగ్లీష్….కళ్లు మూస్తే ఇంగ్లీష్. ఆ దేశంలో ఉచ్ఛ్వాసనిశ్వాసాలు కూడా ఇంగ్లీష్‌లోనే. మరి అలాంటి వెళ్లిన మతంతో…తిరిగి అదే మతంతో తిరిగి వస్తారా? ఏమో…మన మాతృభాషాభిమానులు, వీరాధివీర ప్రతిపక్ష నేతల ఆందోళన చూస్తుంటే అనుమానమే అనిపిస్తోంది.
ఆకలిగొన్న వారికి అన్నం కావాలి గానీ, దేవుడితో పనేం ఉందని మన మొట్టమొదటి ప్రధాని జవహర్‌లాల్‌నెహ్రూ చెప్పింది, ఎప్పుడో పదేళ్ల బాల్యంలో చదివిన నాకు ఇప్పటికీ నా మనసుపై చెదరని జ్ఞాపకంగా ముద్ర వేసింది. అవును మనిషికి అన్నిటికంటే అత్యంత ప్రధానమైంది ఆకలి తీర్చుకోవడమే. ఆ తర్వాతే ఏమైనా. అందుకే మనిషి కనీస అవసరాలుగా కూడు, గూడు, గుడ్డగా మన పెద్దలు ఊరికే చెప్పలేదు.అమెరికా విశ్వవిద్యాలయాలకు భారతీయ విద్యార్థులు పోటెత్తుతున్నారనే వార్త, ప్రస్తుతం ఆంగ్లమాధ్యమంపై తీవ్ర చర్చకు దారి తీసిన నేపథ్యంలో కాస్త ఆసక్తి కలిగించింది. ఏందా కథా అని వివరాలు తెలుసుకునేందుకు వార్తలోకి తల పెట్టాను.
అమెరికా రాయబార కార్యాలయం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం ఈ ఏడాది ఉన్నత చదువుల కోసం తన దేశానికి వచ్చిన విద్యార్థుల సంఖ్య అక్షరాలా 2 లక్షలు దాటింది. ఒక్క అమెరికాకే ఇంత మందైతే ఇక ఇంగ్లండ్, ఆస్ర్టేలియా, కెనడా తదితర దేశాలకు వెళ్లేవారి సంఖ్య, అమెరికాతో పోల్చుకుంటే తక్కువ కావచ్చుగానీ బాగానే ఉంటారు. ఏడాదికేడాది ఈ సంఖ్య పెరుగుతుండటాన్ని ఎలా చూడాలి? ఎలా అర్థం చేసుకోవాలి.
2014లో లక్ష మార్కు దాటినట్టు గణాంకాలు చెబుతున్నాయి. దేశ భక్తికి ప్రతీకగా చెప్పుకునే పార్టీ పాలిస్తున్న దేశం నుంచి ఇంత పెద్దసంఖ్యలో ఇతర దేశాలకు ఎలా వెళ్లగలుగుతున్నారు. గతంలో ఒకసారి నేను ఇదే విషయమై ఒక సామాజిక కార్యకర్తను అడిగాను. అప్పుడా మిత్రుడు నన్నో ప్రశ్న వేశాడు. “అయ్యా నువ్వు ఇంట్లోకి టీవీ లేదా ఇతరత్రా వస్తువులు కొనాలంటే షాప్‌నకు వెళ్లి ఏమని అడుగుతావని ప్రశ్నించాడు. మళ్లీ ఆయనే అందుకున్నాడు. మంచి కంపెనీ పేరు చెప్పి వస్తువులను చూపమంటావా? లేక మేడిన్ ఇండియావి మాత్రమే చూపమంటావా?” అని అడిగాడు.
“అన్నా మంచి కంపెనీ వస్తువులను చూపాలని” అడుగుతానని జవాబు చెప్పాను. “మరి ఒక వస్తువు విషయంలోనే నీవు అన్ని జాగ్రత్తలు తీసుకుంటే….ఒక జీవితానికి సంబంధించి విద్యార్థులు ఆ మాత్రం ఆలోచించరా” అని తనదైన శైలిలో విశ్లేషించాడా మిత్రుడు.
నాకెందుకో ఆయన చెప్పినదే సరైన సమాధానం అనిపించింది. ఎందుకంటే కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న కేంద్రీయ విద్యాలయాల్లో విద్యార్థులకు చదువు చెప్పేందుకు తగినంత మంది ఉపాధ్యాయులు లేకపోవడం, మరోవైపు కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు పిల్లలు కట్టే ఫీజుల్లోనే వేతనాలు ఇవ్వాల్సి వస్తోంది. ఈ లెక్కన మన దేశభక్తి పార్టీకి విద్యావ్యవస్థపై ఎంత మక్కువో అర్థం చేసుకోవచ్చు. నేటి పాలకులకు తిరిగి అధికారంలోకి ఎలా రావాలనే తపన తప్ప, ప్రజల జీవన ప్రమాణాలను పెంచాలనే కనీస స్పృహ కూడా కరువైంది.
ఒక్క భారతీయ విద్యార్థులనే కాదు ప్రపంచంలోని అనేక దేశాల విద్యార్థులు ఏటా భారీగా అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో చేరడానికి అక్కడ సాంకేతిక ఉపాధి అవకాశాలు తేలిగ్గా లభించడమే ప్రధాన కారణంగా పత్రికల్లో రాస్తున్నారు. మనిషి సహజంగా సుఖాన్వేషి. జీవితాన్ని లగ్జరీగా గడిపేందుకు తమ నైపుణ్యానికి తగ్గ అవకాశాలు ప్రపంచంలో ఏ మూలనా ఉన్న అక్కడికి పరుగెడుతాడు. కాకపోతే అమెరికాలో మిగిలిన దేశాల కంటే ఎక్కువ అవకాశాలు ఉండటం వల్ల అక్కడికి వెళ్లగలుగుతున్నాడు. గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత శాశ్వతంగా అక్కడే ఉండేందుకు ఆ దేశ నిబంధనల ప్రకారం గడువు లోపు ఉద్యోగంలో స్థిరపడేందుకు ప్రయత్నిస్తున్నారు.
గత కొన్నేళ్లుగా మరీ ముఖ్యంగా అమెరికా వెళ్లే వారి సంఖ్య పెరుగుతోందని మనం చదువుకున్నాం కదా. మరి ఎంత మందిని అమెరికా క్రిస్టియన్లగా మార్చిందో భారతీయ రాయభార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేస్తే బాగుంటుంది. అమెరికాలో స్థిరపడేందుకు లేదా అక్కడ కొలువు సంపాదించుకునే అవకాశాలు రాక దేశభక్తులుగా మిగిలిపోతున్న వారే ఎక్కువ.