iDreamPost
android-app
ios-app

ఇంగ్లీష్లో బోధనని వ్యతిరేకించడం వల్ల లాభపడేది ఎవరు ?

  • Published Nov 12, 2019 | 5:01 AM Updated Updated Nov 12, 2019 | 5:01 AM
ఇంగ్లీష్లో బోధనని వ్యతిరేకించడం వల్ల లాభపడేది ఎవరు ?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పాఠశాలల్లో ఇంగ్లీష్ మాధ్యమాన్ని తప్పనిసరి చేయాలన్న నిర్ణయంపై  రాజకీయనాయకులు ప్రజల్లో భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు దీన్ని మంచి పరిణామంగా ఆహ్వానిస్తుంటే మరికొందరు ఈ చర్యవల్ల తెలుగు భాష ఉనికి ప్రమాదంలో పడుతుందని వాపోతున్నారు. నిజానికి ఈ చర్యవల్ల  తెలుగు భాష ప్రమాదంలో పడుతుందా..? కొందరు అంటున్నట్లు మన భాషని అందరు మర్చిపోతారా అని విశ్లేషిస్తే … తెలుగు భాష ఇంగ్లిష్ భాషతో చాలాకాలం క్రితమే కలిసిపోయింది. కొన్ని పదాలను ఇంగ్లిష్ లో తప్ప తెలుగులో పలకలేని పరిస్థితి ఏర్పడింది. మనం మాములుగా మాట్లాడే  పదాలయిన, బస్సు, ట్రైన్, రోడ్డు,బ్యాంకు లాంటి పదాలు మన తెలుగు భాషలోకి చొచ్చుకుపోయాయి. ఒకవేళ ఎవరైనా నేను ‘ధూమశకటంలో’ ప్రయాణం చేస్తున్నాను అంటే తెల్లమొహం వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆఖరికి మారుమూల పల్లెల్లో కూడా  అచ్చ తెలుగు పదాలయిన  అమ్మ నాన్నని కూడా మమ్మి డాడీ అని పిలవడం ఇప్పుడు పరిపాటిగా మారిపోయింది. ఇలా మన భాషలో  ఇంగ్లీష్ భాషాపదాలు ఎప్పుడో కలిసిపోయి కొత్త భాషగా మారింది.  

ఇప్పుడు మన వాడుకలో ఉన్న భాష, తెలుగు ఇంగ్లిష్ కలగలిపి కొత్త భాషగా ఆవిర్భవించిన తెంగ్లీష్ భాషగా పిలుచుకోవచ్చు. అయితే కేవలం తెలుగు మాధ్యమంలో చదువుకోవడం వల్ల  అటు ఇంగ్లిష్ పూర్తిగా రాక ఇటు తెలుగు సరిగా నేర్చుకోక,ఎంతో ప్రతిభ ఉన్నా సరే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ లేక పోటీ ప్రపంచాన్ని ఎదుర్కొలేక చతికలపడిన నిరుద్యోగులు మన రాష్ట్రంలో కోట్లలో ఉన్నారు. నిరుద్యోగులను కదిలిస్తే వారి దగ్గర నుండి వచ్చేమాట ఇదే. ఇంగ్లీష్ నేర్చుకోవడంలో నిర్లక్ష్యం వల్ల  ఇలా నిరుద్యోగులుగా మిగిలిపోయాం అని చెప్తారు. వారి మాటలను పరిగణలోకి తీసుకుని ఆలోచిస్తే ఇప్పటి పోటీ ప్రపంచంలో ఇంగ్లీష్ ఆవశ్యకత అర్ధం అవుతుంది. 

కానీ కొందరు రాజకీయ నాయకులు మరియు పౌరుల వాదన ప్రకారం ఇది తెలుగు భాషకి తీవ్ర నష్టాన్ని చేకూరుస్తుందని ఇప్పటికే మిణుకుమిణుకుమంటున్న తెలుగు భాషకి ఇది గొడ్డలి పెట్టు అని వ్యతిరేకిస్తున్నారు. తెలుగుభాషకు పరాయి భాషల వల్ల  తీవ్ర నష్టం చేకూరుతుందని ఇప్పుడు ఇంగ్లీష్ మాధ్యమంలో బోధన తప్పనిసరి చేస్తే తెలుగుభాషకి తీరని లోటు అని అభిప్రాయపడుతున్నారు. మరికొందరైతే ప్రపంచంతో పోటీ పేరుతొ తెలుగు భాషని చితిపై పడుకోబెడుతున్నారని వాపోతున్నారు. ఎంతో  అభివృద్ధి చెందిన దేశాలయిన స్వీడన్, దక్షిణ కొరియా, చైనా,జపాన్ లో ఇంగ్లీష్ భాష ఎక్కువగా వాడరని ఇంగ్లీష్ భాష అవసరం లేకుండానే ఆయా దేశాలు అభివృద్ధి  చెందాయని ఉదాహారణలతో చూపుతున్నారు. 

 పై రెండు వాదనలు నిజమే అయినప్పటికీ ఇంగ్లీష్ భాషని ప్రాంతీయ భాషల్లో కలిపేసుకున్న మన దేశంలో, విధ్యార్థులు ఇంగ్లీష్ భాషపై పట్టు సాధించాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రతి కంపెనీలో ఇంగ్లీష్ ద్వారా కమ్యూనికేట్ చేయడం నిత్యకృత్యమైంది. ఎవరు ఎన్ని వాదనలు వినిపించినా ఇంగ్లిష్ భాషల్లో బోధనని ఆహ్వానిస్తే విధ్యార్థుల్లో ఇంగ్లీష్ భాషపై, కమ్యూనికేషన్ స్కిల్స్ పై పట్టు పెరిగి ఉద్యోగావకాశాలు పెరుగుతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఇంగ్లిష్ మాధ్యమంలో బోధనని ఆహ్వానించడం వల్ల అంతిమంగా ప్రజలకు లాభం కలిగే అవకాశం ఎక్కువగా ఉంది