గత ఎన్నికల్లో చిత్తూరు జిల్లా మొత్తం క్లీన్ స్వీప్ చేసినంత పని చేసింది వైఎస్సార్ సీపీ. మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం తప్ప మిగతా 13 స్థానాలూ కైవసం చేసుకుంది. ప్రస్తుతం కుప్పంలోనూ టీడీపీకి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో సొంత జిల్లాపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా టీడీపీకి కొరకరాని కొయ్యగా మారిన పుంగనూరు విషయంలో చర్చల మీద చర్చలు జరుపుతున్నారు. అక్కడ పార్టీ ఇన్ చార్జ్ గా ఎవరిని నియమించాలనే దానిపై చిత్తూరు జిల్లా నేతలతో గురు, శుక్రవారాల్లో సమావేశమై చర్చించారు. ఈ క్రమంలో పుంగనూరు టీడీపీ ఇన్ చార్జ్ గా చల్లా రామచంద్రారెడ్డి అలియాస్ చల్లా బాబును నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది.
రామచంద్రుడితో రామచంద్రుడు ఢీ?
నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో కొత్తగా ఏర్పాటైంది పుంగనూరు నియోజకవర్గం. అప్పటి నుంచి వరుసగా గెలుస్తూనే ఉన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. గత రెండు ఎన్నికల్లో అభ్యర్థులను మార్చినా టీడీపీ రాత మాత్రం మారలేదు. దీంతో ప్రత్యామ్నాయాలపై రెండున్నరేళ్ల ముందు నుంచే చంద్రబాబు ఫోకస్ పెట్టారు. టీడీపీ నుంచి 2014లో పోటీ చేసిన వెంకటరమణ రాజు, 2019లో పోటీ చేసిన అనూషారెడ్డి.. ఎన్నికల తర్వాత పెద్దగా జనాల్లో లేరని స్థానిక నేతలు చెబుతున్నారు. అక్కడ కావాల్సినంత కేడర్ ఉన్నా నడిపించాల్సిన సరైన లీడర్ టీడీపీకి లేరని అంటున్నారు. దీంతో దశాబ్దాల నుంచి పార్టీని నమ్ముకుని ఉన్న చల్లా రామచంద్రారెడ్డికి ఇన్ చార్జ్ గా నియోజకవర్గ బాధ్యతలు అప్పగించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే జరిగితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో చల్లా రామచంద్రారెడ్డి ఢీకొనే అవకాశం ఉంది.
Also Read : వరదాపురం సూరి మళ్లీ టీడీపీలోకి?పరిటాల కుటుంబం ఒప్పుకుంటుందా?
26 ఏళ్లకే రాజకీయాల్లోకి..
టీడీపీ ఆవిర్భావం నుంచి చల్లా కుటుంబం పార్టీలో ఉంది. రొంపిచెర్లకు చెందిన చల్లా ప్రభాకరరెడ్డి 1983, 1985లో పీలేరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా వరుసగా రెండు సార్లు గెలిచారు. ఆయన సేవలను గుర్తించిన ఎన్టీఆర్.. 1986లో టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమించారు. 1989లో ప్రభాకరరెడ్డి చనిపోవడంతో 26 ఏళ్ల వయస్సులో రాజకీయాల్లోకి చల్లా రామచంద్రారెడ్డి అలియాస్ చల్లా బాబు ఎంటర్ అయ్యారు. 1989 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతిలో ఓడిపోయారు. పెద్దిరెడ్డికి ఇదే తొలి గెలుపు కాగా, చల్లాకుటుంబానికి ఇదే తొలి ఓటమి. కానీ తర్వాతి ఎన్నికల్లో చల్లా రామచంద్రారెడ్డికి టికెట్ దక్కలేదు. 1994 ఎన్నికల్లో జీవీ శ్రీనాథరెడ్డిని పీలేరు నుంచి నిలబెట్టారు. దీంతో ఆయన గెలుపు కోసం చల్లా పని చేశారు.
Also Read:జమ్మలమడుగు టీడీపీ కొత్త ఇంచార్జ్ ఎవరు?
తర్వాత జరిగిన స్థానిక ఎన్నికల్లో గెలిచి రొంపిచెర్ల ఎంపీపీగా చల్లా బాబు పనిచేశారు. ఆది నుంచి పార్టీలో ఉంటూ.. విధేయుడిగా పేరు తెచ్చుకున్న చల్లా బాబును 2001లో రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నియమించారు. అప్పటి నుంచి 2004 దాకా ఆయన ఆ పదవిలో కొనసాగారు. తర్వాత పార్టీలో జిల్లా స్థాయిలో పలు హోదాల్లో పని చేశారు. 2009లో జరిగిన అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో రొంపిచెర్ల మండలం పుంగనూరు నియోజకవర్గం కిందకు రాగా ఆయన టికెట్ కోసం చివరి క్షణం వరకు ప్రయత్నించారు. కానీ వెంకటరమణరాజుకు టికెట్టు దక్కింది. 2014లో కూడా వెంకటరమణరాజు పోటీ చేశారు.
Also Read:అమరీందర్ ,సిద్దు ముఠా గొడవలతో APP ను గెలిపిస్తారా?
ఇక 2019లో వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించి మంత్రి అయిన అమర్నాథ్ రెడ్డి మరదలు(సోదరుడి భార్య) అనూషారెడ్డికి టికెట్ ఇచ్చినా ఫలితం మారలేదు. అనుషారెడ్డికి కూడా చల్లా రామచంద్రారెడ్డి సహకరించారు. ఇప్పుడు వాళ్లిద్దరూ సైలెంట్ గా ఉన్నా.. చల్లానే చురుగ్గా ఉన్నారు. 1989 తర్వాత జరిగిన ఆరు అసెంబ్లీ ఎన్నికల్లో తనకు పోటీకి అవకాశం దక్కకున్నా పార్టీలోనే ఉన్నారు. 2018లో రామచంద్రారెడ్డికి టీటీడీ పాలకమండలి సభ్యుడిగా చంద్రబాబు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు పుంగనూరు ఇన్ చార్జ్ పదవి రేసులో ముందున్నారు.
పుంగనూరు నియోజకవర్గంలో టీడీపీని బలోపేతం చేయాలని ప్రయత్నిస్తున్న చంద్రబాబు గురు, శుక్రవారాల్లో చిత్తూరు జిల్లా నేతలతో భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఎవరికి ఇవ్వాలి, ఇన్ చార్జ్ గా ఎవరిని నియమించాలనే దానిపై చర్చించారు. నేతల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఇన్ చార్జ్ గా నియమించే విషయంలో పలమనేరుకు చెందిన మాజీ మంత్రి అమర్ నాథ రెడ్డి, గత ఎన్నికల్లో పోటీ చేసిన అనూషారెడ్డి, చల్లా రామచంద్రారెడ్డి పేర్లను చంద్రబాబు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరి చల్లా రామచంద్రారెడ్డికి ఈ సారైనా అవకాశం వస్తుందా?
Also Read : బద్వేలు టీడీపీ అభ్యర్థి ఎంపికలో ఆతృత ఎందుకు?