iDreamPost
android-app
ios-app

సత్తా చాటిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి.. ఒక్క దెబ్బకు మూడు పిట్టలు..

సత్తా చాటిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి.. ఒక్క దెబ్బకు మూడు పిట్టలు..

వైసీపీ యువనాయకుడు, కర్నూలు జిల్లా నందికొట్కూరు వైసీపీ కో ఆర్డినేటర్‌ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పంచాయతీ ఎన్నికల్లో తన సత్తాను చాటారు. మూడో విడత పంచాయతీ పోరులో భాగంగా నందికొట్కూరు నియోజకవర్గంలోని 77 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో 62 పంచాయతీల్లో వైసీపీ మద్ధతుదారులు జయకేతనం ఎగురవేశారు. ఒక చోట బీజేపీ, మిగతా చోట్ల టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు.

ఎస్సీ రిజర్డ్వ్‌ నియోజకవర్గమైన నందికొట్కూరులో గత ఎన్నికల్లో ్ల వైసీపీ తరఫున పోటీ చేసిన ఆర్థర్‌ గెలిచారు. వైసీపీ విజయంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిదే ప్రధాన పాత్ర. ఎన్నికల ప్రచారం అంతా తానై నడిపించారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత బైరెడ్డికి, ఎమ్మెల్యే ఆర్థర్‌కు మధ్య విభేదాలు తలెత్తాయి. వీరిద్దరి మధ్య ఆధిపత్యపోరు నడుస్తోంది. పంచాయతీ సర్పంచ్‌ సీట్ల విషయంలోనూ వివాదాలు చెలరేగాయి. పట్టుబట్టి తన వర్గం వారికి సర్పంచ్‌ సీట్లు సాధించుకున్న బైరెడ్డి.. వారిని గెలిపించి నియోజకవర్గంపై తనకున్న పట్టును నిరూపించుకున్నారు.

టీడీపీలో మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతలు ఉన్నా.. ఆ పార్టీ చెప్పుకొదగ్గ స్థానాలు కూడా సాధించలేకపోయింది. గౌరు సుచరిత, మాండ్ర శివానంద రెడ్డి కుటుంబాలు పంచాయతీ ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయాయి. దశాబ్ధాల తరబడి రాజకీయాలు చేస్తున్న గౌరు, మాండ్ర కుటుంబాలు.. సిద్ధార్థ రెడ్డి దూకుడు ముందు తేలిపోయాయి.

పంచాయతీ ఎన్నికల్లో సొంత పెదనాన్నకు కూడా బైరెడ్డి సిద్ధారెడ్డి షాకిచ్చారు. బైరెడ్డి సొంత గ్రామమైన పగిడ్యాల మండలం పాతముచ్చుమర్రిలో తొలిసారి పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఎప్పుడూ ఇక్కడ పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవమవుతుంటాయి. కానీ ఈ సారి మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి, ఆయన తమ్ముడు కుమారుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిలు వేర్వేరు పార్టీలలో ఉండడంతో పోటీ అనివార్యమైంది. బైరెడ్డి రాజశేఖరరెడ్డి బీజేపీలో ఉన్నారు. రాజశేఖరరెడ్డి, సిద్ధార్థ రెడ్డిలు తమ వర్గం తరఫున సర్పంచ్‌ పదవికి అభ్యర్థులను నిలబెట్టారు. దీంతో తొలిసారి ముచ్చుమర్రి గ్రామ ప్రజలు పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికలకు ముందు రాజశేఖరరెడ్డి, సిద్ధార్థ రెడ్డి వర్గాల మధ్య హోరాహోరీగా సాగిన పోరు.. ఫలితాల్లో మాత్రం వార్‌ వన్‌సైడ్‌ అయింది. వైసీపీ తరఫున సిద్ధార్థ రెడ్డి బలపర్చిన అభ్యర్థి ఆంజనేయులు 831 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

ఒకే దెబ్బకు మూడు పిట్టలన్నట్లుగా.. సొంత పార్టీలోని ప్రత్యర్థిని, ప్రతిపక్ష పార్టీలోని ప్రత్యర్థిని, కుటుంబంలోని రాజకీయ ప్రత్యర్థిని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మట్టికరిపించారు.