అమ్మలో “అ”.. నాన్న లో “న్న” తల్లిదండ్రుల్లో సగం అన్న అంటారు. అమ్మ నాన్నల తర్వాత తోబుట్టువుకు అన్నీ తానై చూడాల్సిన బాధ్యత అన్నకే ఉంటుంది. అందుకే తన చెల్లెలి పెళ్లిరోజున చెల్లెలి ముఖంలో సంతోషం చూడాలనుకున్న ఆ అన్న ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చాడు. పెళ్లిలో అన్నీ ఉన్నా.. అన్న అన్నీ తానై చూసుకున్నా ఇంకా ఏదో తెలియని లోటు కనిపించింది ఆ చెల్లెలికి. అదే తండ్రి లేని లోటు. చెల్లెలి ముఖంలో బాధని గమనించిన ఆ సోదరుడు పెళ్లిలో నాన్నలేని లోటును తీర్చాలనుకున్నాడు. చనిపోయిన తండ్రి సజీవంగా ఉన్నట్లు మైనంతో ఆయన రూపాన్ని పునఃసృష్టించాడు. సరిగ్గా పెళ్లి సమయానికి మండపంలోకి నాన్న ప్రతి రూపాన్ని తీసుకొచ్చి అందరి కళ్లల్లో ఆశ్యర్యం నింపాడు.
వీల్ చైర్ లో తండ్రి వస్తుండటాన్ని చూసిన పెళ్లికూతురు కళ్లల్లో భావోద్వేగం కన్నీటి వరదైంది. అది మైనపుబొమ్మ అని తెలిసినా.. నాన్న రూపాన్ని అచ్చం నాన్న బ్రతికి ఉన్నట్లే చూసి భావోద్వేగానికి గురైంది. ఒక్క పెళ్లికూతురేంటి.. బంధువులు, కుటుంబ సభ్యులు, అతిథులందరి కళ్లలోనూ పట్టలేని ఆనందం ఓ వైపు.. పంటిబిగువున ఉంచిన దుఃఖం మరోవైపు కొట్టొచ్చినట్లు కనిపించింది. తండ్రిరాకతో పెళ్లిమండపంలో ఆనంద భాష్పాలు రాలాయి. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అయింది కానీ.. ఈ సంఘటన ఎక్కడ జరిగిందన్న వివరాలు మాత్రం తెలియరాలేదు. కొడుకు తన తండ్రిపై ఉన్న ప్రేమను చాటిన తీరుకు నెటిజన్లు ఫిదా అయి.. ప్రశంసలు కురిపిస్తున్నారు.
78614