ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం మద్యపాన నిషేధం వైపు వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే మద్యం దుకాణాల సంఖ్యను తగ్గించడం, పనివేళలు కుదించడం వంటి నిర్ణయాలు తీసుకున్న జగన్ సర్కార్.. తాజాగా బార్ల సంఖ్యను తగ్గించాలని నిర్ణయించింది. ఉన్న వాటిలో సగం బార్లను జనవరి నుంచి తగ్గించాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం జగన్ నిర్ణయంతో ప్రస్తుతం ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 839 బార్లకు గాను నూతన ఏడాది ప్రారంభం నుంచి 420 కనుమరుగు కానున్నాయి.
పని వేళలు తగ్గింపు..
మిగిలి ఉన్నబార్ల వల్ల ప్రజలు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండే ప్రాంతాలలోనే ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. బార్ల లైసెన్స్ ఫీజును భారీగా పెంచనున్నారు. ప్రస్తుతం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు బార్లు తెరిచి ఉంచుతుండగా నూతన బార్ల విధానంలో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే బార్లు తెరిచి ఉండేలా నూతన పాలసీ లో మార్పులు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన నూతన బార్ల విధానాన్ని రూపొందించనున్నారు.
పాత విధానాం రద్దు..
గత సర్కూరుకు ముందు బార్లకు, మద్యం దుకాణాలకు ప్రతి రెండేళ్లకు ఒక సారి లైసెన్సులు నూతనంగా జారీ చేసేవారు. ఐతే 2017 లో టీడీపీ సర్కారు బార్ల లైసెన్సు ను 5 ఏళ్లకు ఇచ్చింది. ఈ నిర్ణయం వల్ల దాదాపు 300 కోట్ల రూపాయలు ముడుపుల రూపంలో చేతులు మారాయని అప్పట్లో ప్రచారం జరిగింది. అందుకే రెండేళ్ల కాలపరిమితిని 5 ఏళ్లకు పెంచారని అప్పటి ప్రభుత్వం లోని ప్రజా ప్రతినిధులే వ్యాఖ్యానించారు. ప్రస్తుత జగన్ సర్కార్ సగం బార్లను ఎత్తి వేయడమే కాకుండా.. ప్రజలకు మేలు జరిగేలా నూతన పాలసీ తేనుంది.
మహిళా సంక్షేమం- ప్రజా ఆరోగ్యమే ధ్యేయం..
ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్ తన పాదయాత్రలో ఎంతో మంది మహిళల కష్టాలు విన్నారు. తమ భర్తలు తాగుడుకు బానిస కావడంతో ఎన్నో కష్టాలు పడుతున్నామని ఆయనకు చెప్పుకుని కన్నీటిపర్యంతమయ్యారు. ఈ కష్టం నుంచి తమను గట్టెక్కించాలని వేడుకున్నారు. వారి కష్టాలను స్వయంగా చూసిన జగన్.. తాము అధికారంలోకి రాగానే దశల వారీగా మద్య నిషేధం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇచి్చన మాట మేరకు తొలుత 43 వేల బెల్ట్‌షాపులను తొలగించారు. ఆ తర్వాత 4,380 మద్యం దుకాణాలలో 20 శాతం దుకాణాలు (880) తొలగించారు. మిగిలిన 3,500 దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. ఆ దుకాణాలు కూడా ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే నిర్వహిస్తున్నారు.