రోజూ ఏదో ఒక అంశంలో వాడివేడిగా నడుస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు బుధవారం కూడా అలానే సాగాయి. ఈసారి స్పీకర్ కు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కు మధ్య మాటల తూటాలు పేలాయి.
తెలుగు మీడియం స్కూళ్లపై తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని టిడిపి నేతలు పట్టుబట్టగా స్పీకర్ వెంటనే స్పందించి ఇదేమైనా డ్యాన్స్ అనుకున్నారా అంటూ మాట్లాడారు. వెంటనే లేచి మాట్లాడిన చంద్రబాబు స్పీకర్ తో వాగ్వాదానికి దిగారు. మర్యాదగా ఉండాలని చంద్రబాబు చెప్పగా.. సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. తన పట్ల అనుచితంగా మాట్లాడారని.. స్పీకర్ కుర్చీని అవమానించారని బాబు మండిపడ్డారు. ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తే మంచిది కాదని చంద్రబాబును స్పీకర్ హెచ్చరించారు. ఇంత అనుభవం ఉన్నా స్పీకర్ చైర్ ను చంద్రబాబు గౌరవించడం లేదన్నారు. తనపై చేసిన వ్యాఖ్యలను బాబు వెంటనే వెనక్కు తీసుకోవాలని స్పీకర్ డిమాండ్ చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలపై అధికార పక్షం మండిపడింది. చంద్రబాబును సభ నుండి వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
చర్చ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ చంద్రబాబు తన బినామీ నారాయణతో ప్రైవేట్ విద్యాసంస్థలు పెట్టించి ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేశారన్నారు. బాబు హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమం విద్యార్థులు 65 శాతం ఉంటే.. ప్రైవేట్ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం విద్యార్థులు 94 శాతం మంది ఉన్నారని చెప్పారు.