సెంటిమెంటుతో గెలిచిన అబ్బాయి – Nostalgia

పాతికేళ్ల క్రితం టైటిల్ లో అబ్బాయి సెంటిమెంట్ మహా జోరుగా ఉండేది. కలెక్టర్ గారి అబ్బాయి, ప్రెసిడెంట్ గారి అబ్బాయి, కృష్ణగారి అబ్బాయి, చుట్టాలబ్బాయి ఇలా ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాల్లో అబ్బాయ్ అనే పదం కీలక పాత్ర పోషించింది. ఆ తర్వాత ఈ ట్రెండ్ తగ్గిపోయింది కానీ వచ్చినన్ని రోజులు మాత్రం మంచి చిత్రాలే వచ్చాయి. దానికో ఉదాహరణ జైలర్ గారి అబ్బాయి. 1994వ సంవత్సరం. బలరామకృష్ణులు, ఆశయం లాంటి సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసుకుంటూ వచ్చిన జగపతిబాబుకు ‘గాయం’తో బ్రేక్ దొరికాక సోలో హీరోగా సినిమాలు చేసేందుకు స్టార్ దర్శకులు సైతం పోటీ పడ్డారు. ఉన్నట్టుండి బిజీ అయిపోయారు బాబు.

ఆ టైంలో రాఘవేంద్రరావు లాంటి దిగ్గజం కూడా ‘అల్లరి ప్రేమికుడు’ని స్వంత బ్యానర్ మీద నిర్మించి దర్శకత్వం వహించారు. కానీ అది మ్యూజికల్ గా పేరు తెచ్చుకుంది కానీ కమర్షియల్ గా ఆశించిన విజయం సాధించలేదు. అప్పుడు చేసిందే ఈ జైలర్ గారి అబ్బాయి. కుటుంబ కథాచిత్రాలను చక్కగా తీస్తారని పేరున్నదర్శకులు శరత్ పరుచూరి బ్రదర్స్ అందించిన స్క్రిప్ట్ ని మల్టీ స్టారర్ గా తీయాలని నిర్ణయించుకున్నారు. బావ బావమరిది లాంటి సూపర్ హిట్లతో సెకండ్ ఇన్నింగ్స్ ని జోరుగా కొనసాగిస్తున్న కృష్ణంరాజు గారిని ప్రధాన పాత్రలో జయసుధ ఆయనకు జోడిగా తీసుకుని రమ్యకృష్ణను హీరోయిన్ గా ఎంచుకున్నారు.

క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న జైలర్ చక్రపాణి(కృష్ణంరాజు)ది అందమైన కుటుంబం. కానీ ఉన్న దిగులంతా ఊరినిండా గొడవలు పడే కొడుకు రాజా(జగపతిబాబు)గురించే. సంఘవిద్రోహ శక్తులు పన్నిన కుట్రవల్ల ఏ తప్పు చేయకపోయినా రాజా ఓ నేరంలో నిందితుడిగా ఉరిశిక్ష దాకా వెళ్లాల్సి వస్తుంది. మరి తన జైలుకే ఖైదీగా వచ్చిన రాజాను చక్రపాణి దుర్మార్గుల కబంధ హస్తాల నుంచి ఎలా బయటికి తీసుకొచ్చాడు అనేదే కథ. మంచి ఎమోషన్స్ తో పాటు ఫ్యామిలీ డ్రామా పండించిన శరత్ టేకింగ్ కి ప్రేక్షకులు సక్సెస్ ని అందించారు. 1994 జూలై 19న మోహన్ బాబు అల్లరి పోలీస్ తో పోటీ పడిన జైలర్ గారి అబ్బాయి అనూహ్యంగా పైచేయి సాధించింది. రాజ్ కోటి పాటలు ఆడియో పరంగా కూడా హిట్ అయ్యాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఈ సినిమాకు కృష్ణంరాజు గారికి నంది అవార్డు దక్కింది.

Show comments