లింగోజీగూడ ఉప ఎన్నికల్లో ఊహించని ఫలితం

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో జరిగిన లింగోజీగూడ డివిజన్‌ ఉప ఎన్నికల్లో బీజేపీకి గట్టి షాక్‌ తగిలింది. ఆ పార్టీ ఊహించని ఫలితం ఇక్కడ వెల్లడైంది. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ జయకేతనం ఎగురవేసింది. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఈ డివిజన్‌ ను బీజేపీ గెలుచుకుంది. బీజేపీ ఆకుల రమేష్‌గౌడ్‌ కార్పొరేటర్‌గా గెలిచారు. అయితే ఆయన కరోనా వైరస్‌ కారణంగా ప్రాణాలు కోల్పోవడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.

వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీ ఎన్నికలతోపాటు లింగోజిగూడ డివిజన్‌కు ఉప ఎన్నిక జరిగింది. గత నెల 30వ తేదీన పోలింగ్‌ జరగ్గా.. ఈ రోజు ఓట్ల లెక్కింపు చేపట్టారు. బీజేపీ తరఫున రమేష్‌గౌడ్‌ కుమారుడు అఖిల్‌ గౌడ్‌ పోటీ చేశారు. టీఆర్‌ఎస్‌ పోటీకి దూరంగా ఉంది. కాంగ్రెస్‌ తరఫున రాజశేఖరరెడ్డి బరిలో నిలుచున్నారు. బీజేపీ అభ్యర్థిపై రాజశేఖరరెడ్డి 1276 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

పోలింగ్‌కు ముందు ఉప ఎన్నికపై హైడ్రామా నడిచింది. తన తీరుకు భిన్నంగా ఈ ఉప ఎన్నికలో ఏకగ్రీవానికి సహకరించాలని బీజేపీ నేతలు టీఆర్‌ఎస్‌తో మంతనాలు జరిపారు. మంత్రి కేటీఆర్‌ కూడా సానుకూలంగా స్పందించి పోటీకి దూరంగా ఉన్నారు. బీజేపీ తరఫున ఆయన కాంగ్రెస్‌ నేతలకు ఫోన్‌ చేసి ఏకగ్రీవం కోసం విఫలయత్నం చేశారు. కాంగ్రెస్‌ ససేమిరా అనడంతో పోటీ అనివార్యమైంది.

డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో లింగోజిగూడ డివిజన్‌లో 48 శాతం పోలింగ్‌ నమోదవగా.. ఈ సారి కోవిడ్‌ భయాల నేపథ్యంలో పోలింగ్‌ భారీగా తగ్గింది. 47,379 ఓట్లకు గాను కేవలం 28 శాతం మాత్రమే పోలయ్యాయి. మొత్తం 13 వేలకుపైగా ఓట్లు పోలవగా.. కాంగ్రెస్‌ అభ్యర్థి రాజశేఖర్‌రెడ్డికి ఏడు వేలకుపైగా ఓట్లు పోలయ్యాయి. ఈ డివిజన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిన ఎంపీ రేవంత్‌ రెడ్డి తమ పార్టీ అభ్యర్థి తరఫున ముమ్మర ప్రచారం చేశారు. తాజా గెలుపుతో జీహెచ్‌ఎంసీలో కాంగ్రెస్‌ కార్పొరేటర్ల సంఖ్య మూడుకు చేరుకుంది.

Show comments