Idream media
Idream media
1961 నాటి సినిమా రంగం పత్రికలు (వెల 60 పైసలు) PDF కనిపిస్తే అలా తిరిగేశాను. ఈ తరం ప్రేక్షకుల ఊహకు అందని తమాషా విషయాలు దాంట్లో ఉన్నాయి.
తాపీ చాణక్య ఆనాటి ప్రముఖ డైరెక్టర్. ఆయన సినిమా జర్నలిస్టుల గురించి ఏమన్నారంటే..
పరిశ్రమలో ఎవరి గురించైనా , తెలిసినా, తెలియక పోయినా నోటికొచ్చింది రాస్తే దాన్నే సినిమా జర్నలిజం అంటారు.
ఇష్టానుసారం రాసే జర్నలిస్టులు అప్పుడూ ఉన్నారు. ఇప్పుడూ ఉన్నారు. విమర్శను సహించలేని తనం ఎప్పుడూ ఉంటుంది.
బి.సరోజాదేవికి తెలుగు రాదు. అయినా ఆమె టాప్ హీరోయిన్. ఆమె పలికే ముద్దుముద్దు మాటలే జనానికి నచ్చేశాయి.
థియేటర్ల దుస్థితి అని ఒక శీర్షిక ఉండేది.
రామచంద్రాపురంలోని థియేటర్లో నేల క్లాస్‌లో ప్రేక్షకులకి ఉమ్మి వేసే అలవాటు ఉండడం వల్ల నేలకి వెళ్లలేని స్థితి. బెంచీకి వెళితే నల్లుల దాడి, కుర్చీకి వెళితే మేకులు తగులుకుని బట్టలు చిరిగిపోతున్నాయి. సినిమా చూడడం ఎలా? ఇది ఒక ప్రేక్షకుడి గోడు.
పలమనేరులో ఒకే థియేటర్ ఉంది. 15 గ్రామాల వాళ్లు కొత్త సినిమాకి వస్తే సైకిళ్లు పెట్టడానికి స్థలం లేదు.
ఆలూరులో ఉన్న ఒకే థియేటర్‌లో ఎప్పుడూ పాత సినిమాలే వస్తాయి. ఆరేడు సార్లు రీల్ కట్ అవుతుంది. లేదంటే కరెంట్ పోతుంది. టీ, సోడా వాళ్లు ప్రేక్షకుల్ని తొక్కుతూ అమ్మకాలు సాగిస్తున్నారు.
గద్వాల్‌లో సాయిబాబా, విక్రమ్ అని రెండు థియేటర్లు ఉన్నాయి. రెండూ బీడీల పొగ కంపుతో నిండి ఉంటాయి.
ఇది కాకుండా ప్రేక్షకుల ఉత్తరాలు ఉంటాయి.
బ్లాక్ అండ్ వైట్ సినిమాలో రక్తం నల్లగా ఎందుకు కనిపిస్తుందని ఒకాయన సందేహం.
హీరోహీరోయిన్లు కౌగిలించుకున్న పోస్టర్లనీ చించి వేసి సంస్కృతిని కాపాడాలని ఒకాయన పిలుపు.
థియేటర్లలో టీ, సిగరెట్ అమ్మేవాళ్లు చిల్లర ఇచ్చేటప్పుడు చెల్లని నాణేలు ఇస్తున్నారని ఒకాయన గోడు.
సినిమా తారలకి ఉత్తరాలు రాసి ఫొటోలు పంపమని అడిగితే 15 పైసల స్టాంపులు పంపితే పంపుతామన్నారని ఒకాయన ఫిర్యాదు.
కడప జిల్లా ఒకప్పుడు నాటకాలకు ప్రసిద్ధి. ప్రొద్దుటూరు శేష్‌మహల్‌లో దోపిడి (సాంఘిక నాటకం) ప్రదర్శించారు. ఆ నాటి ప్రముఖ నటుడు శివరావు వచ్చి నటించారు.
ఆశ్చర్యం ఏమంటే ఫిబ్రవరి 12, 1960లో జమ్మలమడుగు టౌన్‌లో శ్రీకృష్ణతులాభారం నాటకం ఆరున్నర గంటలు ప్రదర్శించారు. ఒకే కృష్ణుడు , ఒకే నారదుడు (రెండో కృష్ణుడు లేడు).
ఇప్పటి హీరోలు సంవత్సరానికి ఒక సినిమాలో నటించడానికి అపసోపాలు పడుతున్నారు. 1960లో ఎన్టీఆర్ 7, ఏఎన్ఆర్ 6 సినిమాల్లో హీరోలు.
సినిమా రివ్యూల టైప్‌లో సినిమాలపై ప్రేక్షకుల అభిప్రాయాలు కూడా ప్రచురించేవాళ్లు. మా బాబు అనే సినిమాలో అక్కడక్కడ డైరెక్షన్ దెబ్బ తినిందని ఒకాయన అభిప్రాయం.
రుణానుబంధం సినిమాలో నాగేశ్వరరావుకి పోర్షన్ తగినంత లేదు. కొన్ని సీన్స్‌లో మ్యూజిక్ వినిపించలేదని గూడెం నుంచి రాంబాబు సమీక్ష.
ఇవి కాకుండా యాడ్స్ కూడా చిత్రవిచిత్రంగా ఉన్నాయి.
మనకి ఇష్టమైన పువ్వు పేరు పోస్ట్‌కార్డుపై రాసి జలంధర్‌లో ఉండే ఒక జ్యోతిష్కుడికి రూ.1.25 పైసలు మనియార్డర్ చేస్తే జాతకం రాసి పంపిస్తాడట. పంపితే మనది డబ్బు పోగొట్టుకునే జాతకమే.
అమృత్‌సర్‌లో ఉండే వాడికి ఆరు రూపాయలు పంపితే 84 Bed Room Photos పంపుతాడట. అవి మనం రాత్రిపూట మాత్రమే చూడాలట.
అలీఘర్‌లో ఉండేవాడికి రూ.8.80 పైసలు పంపితే 50 సార్లు పేలే ఆటోమేటిక్ పిస్టల్ , 50 గుండ్లు , పిస్టల్ సంచి పంపుతాడు.
ఇంకొకడికి రెండు రూపాయలు పంపితే మ్యాజిక్ ఉంగరం పంపుతాడట, కలలు నిజమవుతాయట. నిజం కాకపోతే వెయ్యి రూపాయలు బహుమతి ఇస్తాడట.
మనకి టీవీలో ఇప్పుడు మధ్యాహ్నం వచ్చే ఆంజనేయస్వామి తాయత్తు యాడ్‌కి ఇది ఫస్ట్ వెర్సన్.
సినిమా రంగం పత్రిక స్పెషాలిటీ ఏమంటే అన్నీ జనాల్ని మోసం చేసే యాడ్స్ మాత్రమే వేసేవాళ్లు.