Idream media
Idream media
ఈ ఏడాది ఆసీస్ గడ్డపై జరగనున్న టెస్ట్ సిరీస్‌ను భారత్ గెలవడం కష్టసాధ్యమని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైక్ అథర్టన్ జోస్యం చెప్పాడు. ఆస్ట్రేలియా పర్యటనకు నాణ్యమైన పేస్ బౌలింగ్ దళం, సరైన వ్యూహాలు లేకుండా వెళితే భారత్ భారీ పరాభవాన్ని ఎదుర్కోక తప్పదని హెచ్చరించాడు.
గత కొన్నేళ్లుగా ఇండియాలో కొత్తగా చాలా మంది ఫాస్ట్ బౌలర్లు పుట్టుకొస్తున్నారని మైక్ అథర్టన్ పేర్కొన్నాడు. నేటితరం భారత పేస్ బౌలర్‌లలో వేగం పెరిగింది. నేను చూసిన భారత జట్టుకు, ప్రస్తుత టీమ్‌కు చాలా తేడా ఉందని తెలిపాడు. నేను అంతర్జాతీయ క్రికెట్ ఆడే రోజులలో భారత్ ఎక్కువగా స్పిన్ బౌలింగ్‌పై ఆధారపడేది. మా కాలం(1993)లో కూడా ఇండియాకు మంచి ఫాస్ట్ బౌలర్లు ఉన్న,నేడు ఉన్నంత బలంగా పేస్ బౌలింగ్ దళం అప్పట్లో లేదన్నారు. ప్రస్తుతం బలమైన పేస్ బౌలింగ్‌తో భారత్ పటిష్టంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డాడు. తమ పేస్ బౌలింగ్‌తో టీమిండియా కంగారులను కంగారు ఎత్తితే వారిపై ఆధిపత్యం చలాయించవచ్చని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ సలహా ఇచ్చాడు.
భారత్ బ్యాటింగ్ బలం గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదని మైక్ అథర్టన్ వ్యాఖ్యానించడం గమనార్హం. గత ఏడాది నుండి ఓపెనర్ రోహిత్ శర్మ ఎర్రబంతితో కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. అతనికి జతగా ఓపెనింగ్ బరిలోకి దిగే మయాంక్ అగర్వాల్ యావరేజ్ కూడా బాగుందని పేర్కొన్నాడు. టీమిండియా టాప్ ఆర్డర్ చతేశ్వర పుజారా,విరాట్ కోహ్లీలతో బలంగా ఉంది. మొత్తం మీద భారత్ బ్యాటింగ్ విభాగం పటిష్టంగానే ఉందని ఆయన వ్యాఖ్యానించాడు. కానీ పేస్ బౌలింగ్‌తో ఆసీస్ బ్యాట్స్‌మన్‌ల భరతం పట్టకపోతే బ్యాటింగ్ విభాగం ఎంత బలంగా ఉన్న విజయం సాధించడం కష్టమని అథర్టన్ అభిప్రాయపడ్డాడు.
ఇక గతేడాది కంగారు గడ్డపై సాధించిన టెస్ట్ సిరీస్ విజయాన్ని భారత్ పునరావృతం చేయాలంటే పేస్ బౌలర్లు రాణించాలని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా టెస్టులలో ఉపయోగించే కూకాబుర్రా బంతులు త్వరగా మెరుపును కోల్పోయి బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉందన్నాడు.
ఐసీసీ షెడ్యూలు ప్రకారం వచ్చే అక్టోబర్-నవంబర్‌లలో ఆస్ట్రేలియా గడ్డపై టీ-20 ప్రపంచకప్ జరగాలి.తర్వాత భారత్, ఆసీస్‌తో నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఆడాల్సి ఉంది.
గత సీజన్ (2018-19)లో తొలిసారిగా కంగారూ గడ్డపై భారత్ 2-1 తేడాతో టెస్టు సిరీస్‌ను గెలుపొందింది. ఈ విజయముతో ఆసీస్ గడ్డపై టెస్ట్ సిరీస్ గెలిచిన తొలి ఆసియా జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. అయితే మే మొదటి వారంలో ఐసీసీ విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత్ నుంచి ఆస్ట్రేలియా టాప్ ర్యాంక్‌ను కొల్లగొట్టింది.