ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించి కేంద్రమంత్రులుగా పనిచేసిన వారిలో జేడీ శీలం ఒకరు. 1999లో ఐఏఎస్ కు వలంటరీ రిటైర్మంట్ ఇచ్చి కాంగ్రెస్ లో చేరిన జేడీ శీలం, అదే ఏడాది బాపట్ల లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడారు. 2004లో ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. యూపీఏ-2 హయాంలో కేంద్రమంత్రి గా పనిచేశారు. 2014 తర్వాత ఏపీ పీసీసీ చీఫ్ నియామక వార్తలు వచ్చిన ప్రతిసారి జేడీ శీలం ప్రస్తావన కూడా మీడియాలో వినిపించేంది.
ప్రస్తుతం జేడీ శీలం రాజకీయాలపై అంతగా ఆసక్తి చూపుతున్నట్లు లేరు. రాజ్యసభ పదవీకాలం ముగిసినప్పటి నుంచి రాష్ట్రంలో పార్టీ పరంగా పర్యటిస్తున్న సందర్భాలు లేవు. సమకాలీన రాజకీయ అంశాలపై స్పందిస్తున్న దాఖలాలు కూడా తక్కువే. ఎన్డీయే-1 ప్రభుత్వ ఆర్థిక నమూనా పై తీవ్ర విమర్శలు గుప్పించిన JD శీలం ప్రస్తుతం అదే దూకుడు కొనసాగించడం లేదు. గతంతో పోల్చుకుంటే ఎన్డీయే-2 విధానాలపై మాట్లాడిన సందర్భాలు అరకొరగానే ఉన్నాయి. బాపట్ల పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో వ్యక్తిగత పర్యటనలకే జేడీ శీలం పరిమితమయ్యారు.
Also Read : జగన్ ఏం చెప్పారో.. అదే చేస్తున్నారు..
గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పుసులూరులో జన్మించిన జేడీ శీలం.. ఉన్నత విద్యను అభ్యసించారు. ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చదివిన జేడీ శీలం.. కొంతకాలం పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్ గానూ పనిచేశారు. 1983లో ఐపీఎస్ కు ఎంపికయ్యారు. తర్వాతి ఏడాది ఐఏఎస్ సాధించారు. కర్ణాటక ఐఏఎస్ క్యాడర్ గా పనిచేసిన జేడీ శీలం.. ఎస్.ఎం. కృష్ణ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన రాజకీయ కార్యదర్శిగా పనిచేశారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలో బాపట్ల పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. కమ్యూనిటీ భవనాలు కట్టించారు. అలాగే తాగునీటి సౌకర్యాలను మెరుగుపరిచారు.
పార్టీ మారే ఉద్దేశం లేదు : జేడీ శీలం
తమది మొదటి నుంచి కాంగ్రెస్ కుటుంబమని..పార్టీ మారే ఉద్దేశం లేదని గతంలోనే జేడీ శీలం చెప్పారు. ఎన్నికల సమయంలో చాలా పార్టీల నుంచి ఆహ్వానం వచ్చినప్పటికీ తిరస్కరించానని 2019 ఎన్నికలకు ముందు చెప్పారు. మరి ప్రస్తుతం రాజకీయాలకు గుడ్ బై చెప్పారా..?. లేదా కాంగ్రెస్ పునర్వవైభవం కోసం తెర వెనుక శ్రమిస్తున్న టీమ్ లో ఈ మాజీ బ్యూరోక్రాట్ కూడా ఉన్నరా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read : లగడపాటి పొలిటికల్ రీ ఎంట్రీ …?
బాపట్ల నుంచి జేడీ శీలం ఓటమి..
13 ఏళ్ల ఐఏఎస్ సర్వీసును వదులుకుని 1999లో కాంగ్రెస్ లో చేరిన జేడీ శీలం, అదే ఏడాది బాపట్ల ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓటమి చెందారు. .ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి దగ్గుబాటి రామానాయుడు విజయం సాధించారు. 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి చేతిలో రామానాయుడు ఓడారు. 2009లో టీడీపీ అభ్యర్థి మాల్యాద్రి శ్రీరామ్ పై కాంగ్రెస్ అభ్యర్థి పనబాక లక్ష్మి విజయం సాధించారు. తర్వాత ఆమె కేంద్రమంత్రిగా పనిచేశారు. 2014లో టీడీపీ తరఫున మాల్యాద్రి శ్రీరామ్ విజయం సాధించగా, కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన పనబాక లక్ష్మి మూడో స్థానానికి పరిమితమయ్యారు. వైసీపీ అభ్యర్థి వరికూటీ అమృతపాణి రెండో స్థానంలో నిలిచారు.
2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి నందిగం సురేశ్, టీడీపీ అభ్యర్థి మాల్యాద్రి శ్రీరామ్ పై విజయం సాధించారు. బాపట్ల పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా వేమూరు, బాపట్ల, రేపల్లె గుంటూరు జిల్లా పరిధిలో ఉన్నాయి. పర్చూరు, అద్దంకి, చీరాల, సంతనూతలపాడు ప్రకాశం జిల్లాలో పరిధిలో ఉన్నాయి. వేమూరు, సంతనూతలపాడు నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వడ్ స్థానాలు.
Also Read : జలగం వెంగళరావు కుటుంబం రాజకీయంగా ఏమి చేస్తుంది ?