వినుకొండ పట్టణంలో విష్ణుకుండిన నగర్ వద్ద NSP కాలువ పై ఉన్న ఎన్టీఆర్ , పరిటాల విగ్రహాలను పోలీసులు ఇటీవల తొలగించడం వివాదాస్పదం అయ్యింది . వైసీపీ వారు దురుద్దేశ్యపూర్వకంగా తొలగించారు అని టీడీపీ నేతలు ఆరోపిస్తుండగా, వినుకొండ టీడీపీ నేత , మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మరో అడుగు ముందుకేసి వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మంత్రి పదవి ఆశతో జగన్ ఆదేశానుసారం విగ్రహాన్ని పడగొట్టించారని ఆరోపించారు .
నిజానికి టీడీపీ హయాంలో NSP కాలువ పై అక్రమంగా నిర్మించిన ఎన్టీఆర్ , పరిటాల విగ్రహాలను తొలగించాలని స్వయంకృషి పత్రిక ఎడిటర్ , సామాజిక కార్యకర్త దళారి ఏడుకొండలు అనే వ్యక్తి 2019 జనవరిలో కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఆ అక్రమ నిర్మాణాలని తొలగించటానికి చర్యలు తీసుకోవాల్సిందిగా కోర్టు వినుకొండ మునిసిపల్ కమిషనర్ ని ఆదేశించింది . అయితే దగ్గర్లో ఎన్నికలు ఉండటంతో ఎన్టీఆర్ విగ్రహం కూల్చివేత వ్యతిరేక ప్రభావం చూపొచ్చన్న ఆందోళనతో అప్పటికి అధికారంలో ఉన్న టీడీపీ నేతలు అధికారుల పై ఒత్తిడి చేసి సదరు అక్రమ నిర్మాణాల తొలగింపు కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు .
ఈ విషయం పై మరోసారి కోర్టు మెట్లెక్కిన పిటిషనర్ విగ్రహాలు తొలగించమన్న ఆదేశాలు అమలు కాని వైనాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చాడు . ఈ యావత్తు అంశంలో అక్రమంగా నిర్మించిన విగ్రహాలు తొలగించకుండా స్టే ఇవ్వమని కానీ , నిర్మాణాలు క్రమబద్ధీకరణ చేయమని కానీ టీడీపీ పార్టీ లేదా నాయకులు కోరకపోవడం ఎన్టీఆర్ పట్ల వారికున్న చిత్తశుద్ధిని ప్రశ్నార్ధకం చేసింది .
2019 ఎన్నికల్లో ఓటమితో నైరాశ్యంలో ఈ విషయాన్ని విస్మరించారు అనుకున్నా వైసీపీ అధికారం చేపట్టాక అమరావతి , నిమ్మగడ్డ తొలగింపు , ఇంగ్లీష్ మీడియం విద్య , రాజధాని వికేంద్రీకరణ బిల్లు లాంటి పలు అంశాల పై ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు మెట్లెక్కిన టీడీపీ నేతలకు తమ పార్టీ వ్యవస్థాపకుడు అయిన ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు అంశం పై కోర్టులో పోరాడాలన్న ఆలోచన రాకపోవటం చూస్తుంటే ఎన్టీఆర్ పట్ల వారికున్న అభిమానం ఓట్ల రాజకీయం కోసం తప్ప మరెందుకూ కాదని అనిపించక మానదు .
కోర్టు ఆదేశాలు అమలు కావట్లేదు అంటూ పిటిషనర్ రెండవసారి కోర్టుని ఆశ్రయించిన పిమ్మట గత ఆదేశాలను అనుసరించి ఐదు రోజుల్లో NSP కాలువ పై నిర్మించిన అక్రమ విగ్రహాలని తొలగించాలని లేని పక్షంలో కోర్టుకి వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ ని కోర్టు ఆదేశించడం జరిగింది . కోర్టు ఆదేశాలను అనుసరించి రెండు రోజుల క్రితం సంబందిత అధికారులు ఆయా విగ్రహాలను తొలగింపజేశారు .
అయితే ఈ విగ్రహాల తొలగింపు స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కుట్ర అని టీడీపీ నేతలు చేసిన ఆరోపణల్లో ఎంత మాత్రం నిజం లేదు . ఇటీవల అరోగ్య సమస్యలతో హాస్పిటల్ లో చేరిన వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గుండెకు స్టెంట్ వేయడంతో గత పది రోజుల్నుండీ తొలుత హాస్పిటల్ లో , తర్వాత నరసరావుపేటలోని స్వగృహంలో విశ్రాంతి తీసుకొంటూ నియోజకవర్గానికి , అధికార కార్యకలాపాలకు దూరంగా ఉండగా , కోర్టు ఆదేశాల మేరకు జరిగిన విగ్రహాల తొలగింపు బ్రహ్మనాయుడు కుట్ర అని , దీని వెనక వైసీపీ అధినేత జగన్ ఉన్నాడని టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆరోపించడం ,టీడీపీ శ్రేణుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం బాధ్యతారాహిత్యమే కాక దురుద్దేశ్యపూర్వకం కూడా అని చెప్పొచ్చు .
వైసీపీ అధికారం చేపట్టిన నాటి నుండీ పలు అసత్య ఆరోపణలతో వైసీపీ ప్రతిష్ట దిగజార్చాలని ప్రయత్నిస్తూ పలుమార్లు భంగపడిన టీడీపీ మరోసారి అసత్య ప్రచారం చేయబోయి అభాసుపాలయ్యినట్లైంది ..