ఇప్పుడున్న పరిస్థితుల్లో విడుదల విషయంలో ముఖాముఖీ పోటీని వీలైనంత తగ్గించుకోవడం మంచిది. లేదంటే ఓపెనింగ్స్ పంచుకుని ఏదైనా టాక్ తేడా వస్తే అసలుకే మోసం తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సినిమా హిట్ అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. అలా కాకుంటేనే అసలు సమస్య. అందులోనూ మీడియం రేంజ్ హీరోలు ఈ ప్లానింగ్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ముందు ఏప్రిల్ 16 న ఫేస్ టు ఫేస్ ఢీ కొట్టాలని డిసైడ్ అయిన నాని నాగ చైతన్య సినిమాల్లో ఒకరు వెనక్కు తగ్గారని ఫిలిం నగర్ హాట్ టాపిక్. ఇంకా అఫీషియల్ గా చెప్పలేదు కానీ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టుగా సమాచారం.
దీని ప్రకారం టక్ జగదీశ్ వారం పాటు వాయిదా పడి ఏప్రిల్ 23న వస్తుంది. లవ్ స్టోరీ ఏప్రిల్ 16కే కట్టుబడుతుంది. ఇక్కడ నాని నిర్మాతలు త్యాగం చేశారా లేక చర్చల్లో చైతు ప్రొడ్యూసర్లకు లాభం చేకూరిందా అనేది పక్కనబెడితే ఇది ఆహ్వానించదగిన పరిణామం. ఒకవేళ ఒకే రోజు పోటీ పడితే ఖచ్చితంగా వసూళ్లను పంచుకోవాల్సి ఉంటుంది. ఒకే సినిమా చూడాలనుకున్న ప్రేక్షకుడు రెండోది టాక్ ని బట్టి డిసైడ్ చేస్తాడు. ఇది ఎలా చూసుకున్నా రిస్క్ అనిపించేదే. అలా కాకుండా టక్ జగదీష్ వారం గ్యాప్ తీసుకోవడం వల్ల రెండింటికి మేలే జరుగుతుంది. అందులోనూ ఇవి యూత్ అండ్ ఫామిలీస్ ని టార్గెట్ చేసుకున్నవి.
లవ్ స్టోరీకి శేఖర్ కమ్ముల దర్శకుడు కావడంతో పాటు సాయి పల్లవి హీరోయిన్ గా నటించడం అంచనాలు పెంచేసింది. బిజినెస్ కూడా క్రేజీగా జరుగుతోంది. మజిలీ తర్వాత చైతు చేసిన మూవీ కూడా ఇదే. అందుకే ఫ్యాన్స్ లో మంచి హైప్ ఉంది. మరోవైపు వి డిజిటల్ డిజాస్టర్ అయ్యాక సాలిడ్ కం బ్యాక్ కోసం నాని ఆశలన్నీ టక్ జగదీశ్ మీదే ఉన్నాయి. అందులోనూ శివ నిర్వాణ దర్శకుడు కావడం దీనికో సాఫ్ట్ కార్నర్ తెచ్చి పెట్టింది. ఇప్పుడీ న్యూస్ అధికారికం చేస్తే ఇద్దరు హీరో అభిమానులు రిలాక్స్ అవ్వొచ్చు. ఇదే బాటిలో మరికొన్ని సినిమాలు కూడా డేట్లను రీ షెడ్యూల్ చేసే పనిలో ఉన్నట్టు మరో ప్రచారం కూడా ఉంది.