ఆరు నెలలకు పైగా వెండితెర వినోదానికి దూరమైన సినిమా ప్రేమికులు ఎదురు చూస్తున్న శుభ ఘడియలు రాబోతున్నాయా అంటే ఔననే అంటున్నాయి డిస్ట్రిబ్యూషన్ వర్గాలు. థియేటర్లు తెరవడానికి ఇంకా అనుమతులు ఇవ్వనప్పటికీ దాదాపు చర్చలు ఓ కొలిక్కి వచ్చాయట. ఒకేసారి అన్ని తెరవకుండా దశలవారిగా అనుమతులు ఇస్తారని తెలిసింది. ఇప్పటికే అన్నిరకాల జాగ్రత్తలతో సిద్ధంగా ఉన్న మల్టీ ప్లెక్సులకు ప్రాధాన్యం దక్కే అవకాశం ఉంది. దీనికి దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 15 ముహూర్తంగా డిసైడ్ చేసినట్టుగా సమాచారం. ఇప్పటికే నిర్మాతల సమాఖ్యతో పాటు డిస్ట్రిబ్యూటర్ కౌన్సిల్ ప్రభుత్వానికి పలుమార్లు విన్నపాలు చేసింది.
మెట్రో ట్రైన్లతో సహా అన్ని రంగాలకు మినహాయింపు ఇచ్చినప్పుడు 2 లక్షల కుటుంబాలకు పైగా ఆధారపడిన థియేటర్ల మీద మాత్రం శీతకన్ను వేయడం భావ్యం కాదని వాళ్ళ అభ్యర్ధన. ఇప్పటికే నెలకు 1500 కోట్ల చొప్పున మొత్తం నష్టం 9000 కోట్ల దాకా ఉండొచ్చని ట్రేడ్ అంచనా. ఇది ఇలాగే కొనసాగితే మనుగడ ఇంకా ప్రమాదంలో పడుతుందని వాళ్ళు హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 85 దేశాల్లో థియేటర్లు తెరుచుకున్నాయి. చైనా, కొరియా, యుకే, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, సింగపూర్, మలేషియా, యుఎఈ, యుఎస్, శ్రీలంక లాంటి చోట్ల టెనెట్ లాంటి సినిమాలు డైరెక్ట్ రిలీజై ఇప్పటికే వెయ్యి కోట్ల దాకా కొల్లగొట్టాయి.
ఇండియాలో మాత్రం పరిస్థితి మునుపటిలాగే ఉంది. మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో కరోనా ఇంకా హెచ్చు స్థాయిలోనే ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఈ విషయం ఇప్పటిదాకా వాయిదా వేస్తూనే వచ్చింది. సీటింగ్ కెపాసిటీకి సంబంధించిన ఆంక్షలు పాటిస్తూనే శానిటైజేషన్ జాగ్రత్తలు కూడా సంపూర్ణంగా తీసుకుంటామనే హామీ ఇస్తున్నాయి యాజమాన్యాలు. మరి ప్రచారంలో వచ్చినట్టు అక్టోబర్ 15 నుంచి థియేటర్లు తెరుచుకుంటే అంతకన్నా శుభవార్త ఏముంటుంది. అదే నిజమైతే డిసెంబర్ నుంచి స్టార్ హీరోల సినిమాలు హాల్లో సందడి చేస్తాయి. ఆ క్షణం కోసమే కదా వారు వీరు అనే తేడా లేకుండా ప్రేక్షక లోకం మొత్తం ఎదురు చూస్తోంది. ఇకపై రోజుకు నాలుగు ఆటలకు బదులు మూడు షోలే ఉండబోతున్నాయట. కొంత కాలం సెకండ్ షోని మర్చిపోవాల్సి రావొచ్చు. చూద్దాం