“తెలంగాణ గట్టు మీద సందమామయ్యో”… అంటూ ఈ నేలను పులకింప చేసిన కలం అది. “ఊరు మనదిరా.. ఈ వాడ మనదిరా.. పల్లె మనది రా.. ప్రతి పనికి మనం రా.. దొర ఏందిరో.. వాడి పీకుడేందురో”.. అంటూ గడీల రాజ్య నిరంకుశత్వంపై సమరం రగిలించిన కలమూ అదే. “పుడితే ఒక్కటి.. సస్తె రెండు.. రాజిగ ఒరి రాజిగో.. ఇగ ఎత్తురా తెలంగాణ జెండా.. రాజిగ ఒరి రాజిగ..” అంటూ తెలంగాణ ఉద్యమాగ్ని ఎగిసి పడేలా విప్లవ శంఖం పూరించిన కలము కూడా అదే. ఆ కలము పేరే గూడ అంజయ్య. ఆయనో ఎగిసి పడే పాటల పోరాట కెరటం. పల్లె వాసి జీవన పయనాన్ని కళ్ళ ముందు ఆవిష్కరించిన కథా సంపుటం.
నేడు గూడ అంజయ్య వర్థంతి. ఈ నేపథ్యంలో ఆ ప్రముఖ గేయ కవి, కథా రచయిత జీవితం సదా స్మరణీయం. 1955, నవంబర్ 1న లక్షమ్మ, లక్ష్మయ్య దంపతులకు జన్మించారు. ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం, లింగాపురం గ్రామం అంజయ్య స్వస్థలం. అందుకే పల్లె వాసుల వెతలే ఆయన రచనలకు ప్రేరణ. కవిగా, రచయితగా ఎన్నో పాటలు, కథలు రాసిన అంజయ్య వృత్తి రీత్యా ఫార్మసిస్ట్. బడికి పోతున్న సమయంలో దారిన ఓ రైతును పలకరించి నప్పుడు.. “ఊరిడిసి పోవన్న.. ఉరిపెట్టుకోవన్న”.. అన్నాడట. కష్టాలను అనుభవిస్తున్న ఆ రైతు నోట వచ్చిన మాటలే.. నా తొలి పాట సిరా చుక్కలని.. అంజయ్య తరచూ చెబుతుండేవారు.
కేవలం ప్రజాసమస్యల పైనే కాదు.. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాల్లోను తన పాటలతో జనాన్ని ఉర్రూతలూపారు. ఉద్యమానికి పురిగొలిపారు. 1975 ఎమర్జెన్సీ టైం లో కూడా తెలంగాణ నినాదం ఎలుగెత్తి జైలు జీవితం కూడా గడిపారు. మలిదశ ఉద్యమంలోనూ తన వంతు పాత్ర పోషించారు. రసమయి బాలకిషన్ తో కలిసి ధూమ్ ధామ్ ఏర్పాటు లో కీలక పాత్ర వహించారు. “ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరణమా” అంటూ విద్యార్థుల గుండెల్లో విప్లవ జ్యోతి రగిలించారు. ఆయన రాసిన “ఊరు మనదిరా” పాట 16 భాషల్లో అనువాదమైనదంటే.. ఆ అక్షరాలకున్న పవర్ అర్థం చేసుకోవచ్చు. 1970 నుంచి 1978 వరకూ అంజయ్య రచించిన, పాడిన పాటలతో “కవితా సంకలనం” పేరిట పుస్తకం విడుదల చేశారు. 1999 లో ఆయన స్వీయ రచనలో రూపొందించిన “ఊరు మనదిరా” పుస్తకం విడుదలైయింది.
ఆయన రాసిన పాటలు ఎన్నో సినిమాలకు ఊపిరి పోశాయి. ప్రేక్షకులను రంజింప చేశాయి. ఆరోగ్యం బాగా లేని రోజుల్లో కూడా.. తన జీవిత భాగస్వామి సహకారంతో చివరి వరకూ రచనలు రాస్తూనే ఉన్నారు. పొలిమేర, దళిత కథలు బహుళ ప్రాచుర్యం పొందాయి. ఎన్నో అవార్డులు అంజయ్యను వెతుకుంటూ వెళ్లాయి. 1988లో రజనీ తెలుగు సాహితీ సమితి అవార్డు, సాహిత్య రత్న బిరుదు, 2000లో గండె పెండేరా బిరుదు సత్కారం, 2004 లో నవ్య సాహిత్య పరిషత్ నుంచి డాక్టర్ మలయశ్రీ సాహితీ అవార్డు, తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎన్నో సాహితీ పురస్కారాలు ఆయనను వరించాయి. తుది వరకూ ప్రజా జీవన సమస్య లపై ఆయన కలం… సిరా చిమ్ముతూనే ఉంది. అనారోగ్యంతో బాధ పడుతూ.. రచనలకు, జీవితానికి ఇక సెలవంటూ అలిసిపోయింది. రంగారెడ్డి జిల్లా.. రాగన్నగూడలోని స్వగృహంలో జూన్ 21, 2016న అంజయ్య తుదిశ్వాస విడిచారు. అంజన్నగా ప్రజల గుండెల్లో స్థిర స్థాయిగా నిలిచిపోయారు.