ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలకు ఫుల్ డిమాండ్ ఉంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో జగన్ సర్కారు మీద పిల్ వేయడానికి ప్రాధాన్యత కనిపిస్తోంది. ప్రభుత్వంలో ఏదో చిన్న నియామకం నుంచి ఎక్కడయినా నిధులు కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయం వరకూ కాదేదీ పిటీషన్ కి అనర్హం అన్నట్టుగా మారింది. వందల కొద్దీ పిటీషన్లతో ఏపీ ప్రభుత్వం మీద న్యాయపోరాటం సాగించేందుకు కొందర ఆతృత పడుతున్నట్టు కనిపిస్తోంది.
విపక్షాలు ప్రజాదారణ పొందాలంటే ప్రజాక్షేత్రంలో పనిచేయాల్సి ఉంటుంది. కానీ ఏపీలో రెండు పార్టీల ముఖ్య నేతలు హైదరాబాద్ లో నివాసం ఉంటారు. చుట్టపు చూపుగా ఏపీకి వస్తుంటారు. తాము ఏపీలో అడుగుపెట్టాలనుకున్న సమయంలో ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు గానే ఏదోటి హంగామా చేయడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. కానీ తాము నిత్యం జనంలో ఉండాలనే లక్ష్యం వదిలేసినట్టు కనిపిస్తోంది. జనాలకు అండగా నిలవకుండా, తాము ఎదగలేమనే విషయం కూడా మరచిపోయినట్టున్నారు. అందుకు గానూ మీడియా సాధనంగా కొన్ని వక్రీకరణలకు పూనుకోవడం, దానికి అనుగుణంగా న్యాయస్థానాల్లో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేసేయడం ఓ ముఖ్యకర్తవ్యం అన్నట్టుగా మార్చుకున్నారనే అబిప్రాయం వినిపిస్తోంది.
ఉదాహరణకు స్థానిక ఎన్నికల విషయంలో ప్రభుత్వాలు కావాలనే జాప్యం చేస్తూ ఉంటాయి. ప్రతిపక్షాలు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఉంటాయి. ఇది సహజమైన రీతి. కానీ ఏపీలో దానికి భిన్నం. ప్రభుత్వం స్థానిక ఎన్నికలన్నీ వేగంగా పూర్తి చేయాలంటుంది. ప్రతిపక్షం మాత్రం ఎన్నికలు కుదరదని కోర్టుకి వెళుతుంది. ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఫలితాలు విడుదల చేయవద్దని మరో పిటీషన్ వేస్తూ ఉంటుంది. ఇలా ఎన్నికల ప్రక్రియను కూడా అడ్డుకోవడం కోసం పిటీషన్లు వేసిన కొత్త వ్యవహారం ఆంధ్రప్రదేశ్ కే సొంతం అన్నట్టుగా ఉంది.
దీనికి ప్రధాన కారణం పాలకపక్షం ప్రజా శ్రేయస్సుకి అనుగుణంగా చర్యలు తీసుకుంటూ జనంలో బలపడుతుంటే, విపక్షాలు అందుకు విరుద్ధంగా న్యాయస్థానాలను అడ్డుపెట్టుకుని పాలన సజావుగా జరగకుండా చేయాలనే సంకల్పమే అన్నది కాదనలేని సత్యం. అందుకు తగ్గట్టుగానే పాలనా వికేంద్రీరణ నుంచి అమరావతిలో అక్రమాల వరకూ అన్నింటికీ కోర్టు కేసులు చూస్తూ ఉంటాం. దమ్ముంటే అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ నిరూపించాలని డిమాండ్ చేస్తూనే ఏసీబీ నమోదు చేసిన కేసులు కొట్టేయాలని కూడా పిటీషన్లు వేయడం ఏపీలోనే గమనిస్తాం.
ఇదే మోతాదులో కాకపోయినా దేశమంతా ఇలాంటి సమస్య ఉన్నట్టు కనిపిస్తోంది. ఇటీవల ఏపీలో సీఎస్ గా రిటైర్ అయిన నీలం సాహ్నిని ఎస్ ఈ సీగా నియమిస్తే దాని మీద కూడా పిల్ వేశారు. వాస్తవంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారికే ఆ పోస్ట్ దక్కుతుంది. గతంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి కూడా అదే అర్హతతో అధికారం కట్టబెట్టారు. కానీ ఇప్పుడది నేరమన్నట్టుగా ఓ పిల్ దాఖలయ్యింది. ఇదే తరహాలో ఢిల్లీలో గుజరాత్ క్యాడర్ ఐపీఎస్ రాకేష్ ఆస్థాన నియామకం మీద కూడా పిల్ దాఖలయ్యింది.
దాంతో సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. పిల్ వేయడం ఓ పరిశ్రమగా మారిందనే ఘాటు విమర్శ చేసింది. అదే పనిగా పిల్స్ వేస్తూ ఇదో వృత్తిగా కొందరు మార్చుకున్న వైనం కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. దాంతో ఢిల్లీలో అప్పుడప్పుడూ వేసే ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం పట్ల ఇంత అసహనం కనిపిస్తే నిత్యం ఏపీలో ఇదే పనిగా పెట్టుకున్న తీరు చూస్తు ఏమంటారో అనే ప్రశ్న ఉదయిస్తోంది