చంద్రబాబు తీరు చాలా చిత్రంగా ఉంటుంది. ఆయనకు నచ్చితే ఎంతో కొనియాడే ఆయనే తనకు గిట్టని విషయాల్లో ఘాటుగా స్పందించారు. ఎంత ఘాటుగా అంటే గతంలో తాను చెప్పిన మాటలన్నింటినీ తోసిపుచ్చి యూటర్న్ తీసుకుని మరీ మాట్లాడేస్తారు. జగన్ కేసుల్లో సీబీఐ విచారణ కోసం తన మనుషులతో కోర్టులో కేసు వేయించిన చంద్రబాబు , తన వరకూ వచ్చే సరికి అసలు ఏపీలో సీబీఐకే అనుమతి లేదంటూ టర్న్ తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ అధికారం కోల్పోగానే సీబీఐ విచారణకు ఆయన డిమాండ్ చేస్తూ ఉంటారు.
ఇక కేసుల విషయంలో కూడా ఆయనది అదే తంతు. బహుశా యూటర్న్ లక్షణం చివరకు కోర్టులకు కూడా ఆయన వర్తించేలా కనిపిస్తున్నారు. అక్రమాలు వెలుగు చూసిన తర్వాత విచారణ జరగడం సహజం. ఇంకా చెప్పాలంటే అవసరం కూడా. సదరు అంశంలో ఏం జరిగిందనేది దర్యాప్తు జరిగితేనే వెలుగులోకి వస్తోంది. ఆ దర్యాప్తు ఆధారంగా చర్యలకు సంబంధించి అభ్యంతరాలు ఉండవచ్చు. విచారణ తర్వాత చర్యలు తీసుకోవద్దని కోర్టులకు వెళ్ళిన దాఖలాలు కూడా ఉన్నాయి. చర్యల స్థాయి తగ్గించాలని కోరిన ఘటనలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు చంద్రబాబు అసలు విచారణే వద్దంటున్నారు.
వాస్తవానికి కోర్టుల తీర్పులను అందరూ గౌరవించాల్సి ఉంటుంది. కానీ అసలు ఎటువంటి అక్రమాలు జరిగినా కేసులు పెట్టకూడదని, విచారణ చేయకూడదని చంద్రబాబు అనుచరులు కొందరు కోర్టులకెక్కుతున్న తీరు విడ్డూరంగా ఉంటుంది. చివరకు ప్రజల ప్రాణాలు తీసిన స్వర్ణా ప్యాలస్ ఘటనకు బాధ్యుల మీద విచారణ వద్దనడం మరీ విచిత్రం. అంతకుముందు అమరావతి అక్రమాల మీద కూడా విచారణను అడ్డుకునే ప్రయత్నం ఆయన చేస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఇప్పటికే ఖరీదైన లాయర్లతో ఏపీ హైకోర్టులో డాక్టర్ రమేష్ కేసులో విచారణను నిలుపుదల చేయిస్తూ తీర్పు రావడానికి చేసిన ప్రయత్నాలు అందరికీ తెలిసినవే. కానీ ప్రస్తుతం సుప్రీంకోర్ట్ దానిని తిరగదోడింది. చట్ట ప్రకారం విచారణ ఆవశ్యాన్ని జస్టిస్ నారిమన్ బెంచ్ స్పష్టం చేసింది. దాంతో డాక్టర్ రమేష్ వ్యవహారం ఇప్పుడు బాబుకి గుదిబండగా మారింది.
అంతకుముందు తుళ్లూరు మాజీ తహాశీల్దార్ అన్నేసుధీర్ బాబు కేసులో కూడా అదే తంతు. అమరావతిలో అక్రమాలు లేవంటే ఏ లోకంలో ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. చివరకు చంద్రబాబు తప్ప ఆయన చుట్టూ ఉన్న వాళ్లు కూడా అంగీకరించలేరు. అలాంటి అమరావతి అక్రమాలపై విచారణ కోసం తహాశీల్దార్ విషయంలో చర్యలకు పూనుకుంటే దానిని కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. తాడికొండ, మంగళగిరి ప్రజలే విశ్వసించలేదన్నది విశ్వమంతా తెలిసినా వాస్తవమే
అయినప్పటికీ న్యాయస్థానాలలో మాత్రం చిరవకు తుళ్లూరు కూడా అమరావతి పరిధిలో లేదని చెప్పడానికి సాహసించినట్టు ఆంధ్రజ్యోతి కథనమే సాక్ష్యంగా నిలుస్తోంది. అదే సందర్భంలో సీఐడీ విచారణపై హైకోర్ట్ ఇచ్చిన స్టేని కూడా సుప్రీంకోర్ట్ తోసిపుచ్చింది. అదే సమయంలో హైకోర్ట్ ఆదేశాలపై అసంతృప్తి వ్యక్తం చేసింది.
పదే పదే కొన్ని అంశాలలో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్న కోర్టు తీర్పుల పట్ల మొట్టికాయలు పడ్డాయంటూ వ్యాఖ్యానించే బాబు, ఆయన భజన మీడియా ఇలాంటి కేసుల్లో సుప్రీంకోర్ట్ స్పందనను దాచిపెట్టే ప్రయత్నం చేయడం దిగజారుడుతనానికి నిదర్శనంగా ఉంటుంది. చివరకు కోర్టుల విచారణను వద్దంటున్న బాబుకి మింగుడుపడని రీతిలో అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు వస్తున్న నేపథ్యంలో ఇది ఎవరికి మొట్టికాయ అన్నది చెప్పలేని సదరు మీడియాలో కక్కలేక మింగలేక అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. వాస్తవాలను దాచిపెట్టే ప్రయత్నంలో ఉన్నాయి. అయినప్పటికీ ప్రస్తుతం విచారణ కూడా జరక్కుండా అడ్డుకుంటున్న బాబు రాబోయే రోజుల్లో కోర్టులు కూడా వద్దనేంత వరకూ వెళ్లినా ఆశ్చర్యం లేదని కొందరు అనుమానించే పరిస్థితి వచ్చింది.
ఓవైపు తమ హయంలో అక్రమాలు లేవంటారు. ఆధారాలతో నిరూపించండి అంటారు. ఇప్పటికే క్యాబినెట్ సబ్ కమిటీ సహా పలు నివేదికల ఆధారంగా విచారణ జరుపుతామంటే అడ్డుపడతారు. నిప్పులా బతికామని చెప్పుకునే బాబు అండ్ కో ఇప్పుడు నిప్పుకి తప్పు పట్టిందో లేదో పరిశీలిద్దాం అంటే ససేమీరా అంటారు. చివరకు కోర్టులకు వెళ్ళి గతంలో స్టే లు తెచ్చుకున్నట్టుగానే ఇప్పుడు విచారణను నిలిపివేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటివి ఎక్కువ కాలం చెల్లదని బాబుకి అర్థమయ్యేలోగా ఆయన ఎన్ని టర్నులు తీసుకుంటారన్నది ప్రశ్నార్థకమే.