శుక్రవారం ప్రార్ధనల అనంతరం ఢిల్లీలోని జామామసీదు బైట ఆందోళనలు రేగాయి. మహ్మద్ ప్రవక్తపై బీజేపీ బహిష్కృత నేత నూపుర్ శర్మ, నవీన్ జిందాల్ వివాదాస్పద వ్యాఖ్యలపై, దేశవ్యాప్తంగా ముస్లిం సంఘాలు నిరసనలకు దిగాయి. పలు నగరాల్లో శుక్రవారం మసీద్‌లో నమాజ్ ముగిసిన వెంటనే ఆందోళనలకు దిగారు. కోల్ కత్తా, ప్రయాగరాజ్, షహరన్ పూర్ లో భారీ ఆందోళనలు కనిపించాయి.
దేశంలోనే అతిపెద్ద మసీదుల్లో ఒకటైన జామామసీద్ వెలుపల, భారీ ప్రదర్శనలు నిర్వహించారు. నిపూర్ శర్మను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. గంటసేపటి తర్వాత, ఆందోళన కారులను పోలీసులు చెదరగొట్టారు. జమామసీదు షాహీ ఇమామ్, ఈ నిరసన ప్రదర్శనలకు మసీదుకు ఎలాంటి సంబంధంలేదని అన్నారు. ఎలా జరిగిందో మాకు తెలియదు. ప్రార్ధనల అనంతరం కొందరు నినాదాలు చేశారు. మరికొందరు గుమికూడారని అన్నారు.
ఇక షహరన్ పూర్. మొరాదాబాద్, ప్రయాగరాజ్ తోసహా కొన్ని పట్టణాల్లో, నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ముందుజాగ్రత్తగా లక్నో, కాన్పూర్, ఫిరోజాబాద్ లో పోలీసు బలగాలను మోహరించారు. కాన్పూర్ లో గతవారం జరిగిన ఘర్షణల్లో 40 మంది గాయపడ్డారు. అందుకే ఈ ప్రాంతంలో పోలీసుల బందోబస్త్ ను పెంచారు.
ఇక ప్రయాగరాజ్ లో కొందరు పోలీసులపై రాళ్లురువ్వారు. పోలీసులు టియర్ గ్యాస్ ను వాడారు. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనూ ఉన్నాయి.
ఇక షహరన్ పూర్ లో అనుమతిలేకుండా ప్రదర్శన నిర్వహిస్తున్న నిరసనకారుల్లో 21 మందిని, పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం ప్రార్ధనల అనంతరం నిరసనలు రేగాయి. ఒక చోట వందలాది మంది చేరారు. ఆ ప్రాంతంలో షాపులను బలవంతంగా మూసివేసినట్లు వీడియోల్లో కనిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో మొరాదాబాద్ లోనూ జరిగాయి.
జార్ఖండ్ రాజధాని రాంచీలోని కొన్ని ప్రాంతాల్లో కర్ఫూను విధించారు. హనుమాన్ దేవాలయం దగ్గర నినాదాలు చేస్తున్న కొందరిని చెదరగొట్టేసమయంలో, కొద్దిమంది పోలీసులకు గాయాలైయ్యాయి. పోలీసుల మీద గుర్తుతెలియని కొందరు రాళ్లేశారు. వాళ్లను కంట్రోల్ చేయడానికి పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు.
కోల్ కత్తాలోనూ నిరసన ప్రదర్శనలు రేగాయి. హౌరా, హైదరాబాద్ లోని చార్మినార్ దగ్గర, అహ్మదాబాద్, లూధియాన, నవీ ముంబై, శ్రీనగర్ లోని కొన్ని చోట్ల వందలాది మంది గుమికూడారు. నిరసన ప్రదర్శనలు చేపట్టారు. నినాదాలు చేశారు.
77614