వచ్చే 2024 ఎన్నికల్లో తమ వారసులను రాజకీయాల్లోకి తీసుకురావాలని తూర్పుగోదావరి జిల్లాలోని పలువురు నాయకులు పార్టీలకు అతీతంగా ప్రయత్నిస్తున్నారు. కొందరు ఇప్పటికే రంగంలోకి దింపగా మరికొందరు ఇందుకు కసరత్తు చేస్తున్నారు. రాజకీయంగా తాము సంపాదించిన పరువు ప్రతిష్టలను తమ వారసుల రాజకీయ ప్రస్థానానికి ఇంధనంగా వాడాలని అనుకుంటున్నారు.
కోనసీమలో ఇలా..
అమలాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి పినిపే విశ్వరూప్ తన పెద్ద కుమారుడు పినిపే కృష్ణారెడ్డిని వారసుడిగా తీసుకురావాలని ఎప్పటి నుంచో ఎత్తులు వేస్తున్నారు. అంతగా ఫలితం లేకపోవడంతో చురుకుగా ఉండే చిన్నకుమారుడు శ్రీకాంత్‌ను కూడా రంగంలోకి దింపాలని అనుకుంటున్నారు. అమలాపురం లోక్‌సభ స్థానానికి గత ఎన్నికల్లో లోక్‌సభ దివంగత స్పీకర్ గంటిమోహనచంద్ర బాలయోగి కుమారుడు హరీష్‌బాలయోగి టీడీపీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. అయితే గణనీయంగానే ఓట్లు తెచ్చుకోవడంతో మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని వచ్చే ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారు. రాజోలులో మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు తన కుమారుడు శ్రీధర్‌ను టీడీపీ తరఫున రంగంలోకి దింపాలని యోచిస్తున్నారు.
రాజమహేంద్రవరంలో..
తన వారసుడిగా సోదరుడు శాంతారామ్ కుమారుడు డాక్టర్ రవికిరణ్‌ను రాజమహేంద్రవరంసిటీలో రంగంలోకి దింపాలని ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి ఎప్పట్నుంచో ప్రయత్నిస్తున్నారు. దివంగత బొమ్మన రాజ్‌కుమార్ తనయుడు జయకుమార్ వైఎస్సార్ సీపీ తరఫున సిటీ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలని అనుకుంటున్నారు. రాజమహేంద్రవరం రూరల్ మాజీ ఎమ్మెల్యే చందన రమేష్ తన కుమారుడు నాగేశ్వర్‌ను వైఎస్సార్ సీపీలో చేర్చారు. ఆయన రాజమహేంద్రవరం రూరల్ కో ఆర్డినేటర్ గా, స్మార్ట్‌సిటీ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో రూరల్ నుంచి బరిలో దిగాలని యోచిస్తున్నారు.
Also Read : టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోటా సైకిల్ కుదేలు
మెట్టలో..
మాజీమంత్రి జక్కంపూడి రామ్మోహనరావు పెద్ద కుమారుడు రాజా తండ్రి మరణానంతరం రాజకీయాల్లోకి వచ్చారు. రాజానగరం ఎమ్మెల్యేగా ఉన్న ఆయన కాపు కార్పోరేషన్ ఛైర్మన్ గా పనిచేశారు. ప్రస్తుతం రామ్మోహనరావు రెండో కుమారుడు గణేశ్ కూడా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించాలని యత్నాలు చేస్తున్నారు.
మాజీ ఎంపీ చిట్టూరి రవీంద్ర తన కుమారుడు శ్రీనివాసరావును రాజానగరంలో టీడీపీ తరఫున బరిలో నిలుపుతారని వార్తలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే ఇక్కడ మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్, చిట్టూరి నడుమ టీడీపీలో ఆసక్తికర రాజకీయం నడిచే అవకాశం ఉంది. పెద్దాపురంలో దివంగత టీడీపీ సీనియర్ నేత బొడ్డు భాస్కరరామారావు కుమారుడు వెంకటరమణ చౌదరి రంగంలోకి దిగుతారని అంటున్నారు. అయితే ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది ఇంకా స్పష్టత లేదు.
జగ్గంపేటలో టీడీపీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ కుమారుడు నవీన్‌కుమార్ ఇప్పటికే రాజకీయాల్లో ఉన్నారు. ఆయన జెడ్పీ చైర్మన్‌గా పనిచేశారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఎప్పుడో వారసత్వ రాజకీయాలు మొదలయ్యాయి. నియోజకవర్గ రాజకీయాలను శాసించే పర్వత, వరుపుల, ముద్రగడ కుటుంబాల నుంచి ఇప్పటికే వారసులు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు.
Also Read : మహేష్‌బాబు మురారీ సినిమా షూటింగ్ జరిపిన రామచంద్రాపురం రాజుగారి కోట గురించి తెలుసా..?
పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఈసారి తన కుమారుడు గిరిని బరిలోకి దింపాలని చూస్తున్నారు. తునిలో టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తన రాజకీయ వారసుడిగా సోదరుడు యనమల కృష్ణుడిని ఎప్పుడో రంగంలోకి దించగా ఆయన సిటింగ్ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా చేతిలో ఓడిపొయారు.
ఆ రెండు చోట్లా ముగ్గురు..
రామచంద్రపురం నియోజకవర్గంలో మాజీమంత్రి, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు సూర్యప్రకాశ్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కుమారుడు పృధ్వీరాజ్, మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ తనయుడు నరేన్ పోటాపొటీగా సేవా కార్య క్రమాలు నిర్వహిస్తూ జనం దృష్టిలో పడుతున్నారు. వీరు వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగుతారని, అందుకు తగ్గ కసరత్తులు జరుగుతున్నాయని నియోజకవర్గంలో పెద్దయెత్తున చర్చ జరుగుతోంది. అనపర్తిలో టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి తనయుడు రామకృష్ణారెడ్డి ఆల్ రెడీ రాజకీయాల్లో ఉన్న సంగతి తెలిసిందే.
కాకినాడలో మాజీమంత్రి ముత్తా గోపాలకృష్ణ వారసుడిగా ఆయన తనయుడు శశిధర్ ఇప్పటికే రాజకీయాల్లో ఉన్నారు. ఆయన జనసేన తరఫున బరిలో దిగనున్నారు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నా ఇన్ని చోట్ల వారసులు వచ్చే అవకాశం ఉండడంతో నియోజకవర్గాల్లో చర్చ సాగుతోంది. పరిషత్ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో మరోసారి ఈ అంశంపై పిచ్చాపాటీగా మాట్లాడుకుంటున్నారు.
Also Read : పెద్దాపురం పై బొడ్డు వారసుడి గురి…..