ఎమ్మెల్సీ ఎన్నికలకు నగరా మోగబోతోంది. వచ్చే నెల ఆరంభంలో దానికి ముహూర్తం సిద్ధమయ్యే అవకాశం ఉంది. ఏపీ శాసనమండలిలో ఖాళీ సీట్లున్నీ భర్తీ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. దాంతో ఒకేసారి 14 మందికి ఎమ్మెల్సీ హోదా దక్కబోతోంది.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో ఎమ్మెల్సీ సీట్లు భర్తీ కావడం ఇదే కావడంతో అనేక మందికి గట్టి ఆశలే ఉన్నాయి. దాంతో ఆశావాహుల్లో సందడి మొదలయ్యింది.
శాసనమండలికి సంబంధించిన స్థానిక సంస్థల కోటాలో 11 సీట్లు ఖాళీలున్నాయి. వాటికి మొన్నటి జూన్ తోనే గడువు ముగిసింది. అయినప్పటికీ కోవిడ్ కారణంగా ఎన్నికల నిర్వహణకు ఈసీ అనాసక్తి ప్రదర్శించింది. కోవిడ్ ప్రోటోకాల్ మూలంగా పదవుల భర్తీ ఆలస్యమయ్యింది. అసెంబ్లీ ఉప ఎన్నికలు కూడా అప్పట్లో వాయిదా వేసినా ప్రస్తుతం నోటిఫికేషన్ కూడా ఇచ్చి నామినేషన్లు స్వీకరిస్తున్నారు. దాంతో అసెంబ్లీ ఉప ఎన్నికలతో పాటుగా మండలి ఖాళీ స్థానాలకు ఎన్నికల నిర్వహణ కూడా జరపాలనే నిర్ణయానికి ఈసీ వచ్చింది. నవంబర్ 2న అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. అవి వచ్చిన తర్వాత ఎప్పుడైనా మండలి నోటిఫికేషన్ రావచ్చని సమాచారం.
Also Read : బద్వేల్ ఉప ఎన్నిక – కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే
స్థానిక సంస్థల కోటా ఖాళీలతో పాటుగా ఎమ్మెల్యే కోటాలో మూడు సీట్లు ఖాళీ ఉన్నాయి. గతంలో టీడీపీ తరుపున గెలిచిన మండలి చైర్మన్ గా పనిచేసిన ఎంఏ షరీఫ్ , టీడీపీ మద్ధతు తో గెలిచిన బీజేపీ ఏపీ అద్యక్షుడు సోము వీర్రాజు మొన్నటి మే నెలలో రిలీవ్ అయ్యారు. అదే విధంగా అనంతపురం జిల్లాకు చెందిన గోవిందరెడ్డి పదవీకాలం కూడా ముగియడంతో ఆ స్థానం కూడా ఖాళీ అయ్యింది. దాంతో మొత్తం 14 స్థానాలలో కొత్తవారికి అవకాశం దక్కబోతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తిస్థాయిలో పట్టు సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ కే దాదాపుగా అన్ని సీట్లు దక్కడం ఖాయం. దాంతో ఎమ్మెల్యే కోటా సీట్లు, స్థానిక సంస్థల సీట్లు కూడా అధికార పార్టీ ఖాతాలో పడబోతున్న తరుణంలో ఆపార్టీ నేతల్లో ఆశలు పెరుగుతున్నాయి.
సాధారణ ఎన్నికల సందర్భంగా అనేక మందికి జగన్ హామీ ఇచ్చారు. అలాంటి వారిలో పలువురు సీనియర్లు కూడా ఉన్నారు. వారందరికీ తాజా ఎన్నికల్లో అవకాశం దక్కడం ఖాయం. అదే సమయంలో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన వారిలో ఒకరికి మండలి చైర్మన్, మరొకరికి డిప్యూటీ చైర్మన్ పీఠాలు కూడా ఊరిస్తున్నాయి. వాటితో పాటుగా మంత్రిమండలి పునర్వవస్థీకరణ కూడా ముందుంది. ఇది కూడా నేతల ఆశలను రెట్టింపు చేస్తోంది. ఈ తరుణంలో జగన్ ఎంపికే అనివార్యంగా ఉన్న తరుణంలో ఎవరికి ఛాన్స్ వస్తుందోననే అంచనాలు వేసుకుంటున్నారు. మండలిలో వైఎస్సార్సీపీకి పూర్తి ఆధిక్యం దక్కబోతున్న తరుణంలో కొత్త ఎమ్మెల్సీ అవకాశం ఎవరెవరికి వస్తుందో చూడాలి.
Also Read : మండలి ఖాళీల భర్తీ.. వైసీపీలో ఆశావాహుల సందడి